క్యాన్సర్‌ను ‘తినేసి, ధ్వంసం చేసే’లా మానవ కణాలను బలోపేతం చేయనున్న కొత్త మందు

  • 4 జూలై 2018
ప్రతీకాత్మక చిత్రం Image copyright Getty Images

క్యాన్సర్ కణాలు, ఆ లక్షణాలున్న కణాలను మానవ శరీరంలోని కణాలే తినేసేలా, నాశనం చేసేలా దోహదపడే కొత్త ఔషధాన్ని, చికిత్స విధానాన్ని శాస్త్రవేత్తలు తయారుచేశారు.

ఈ మందు మేక్రోఫేజస్ తెల్లరక్త కణాల చర్యాతీవ్రతను పెంచుతుంది. క్యాన్సర్ కణాలపై పోరాడే అవకాశాన్ని, శక్తిని వాటికి కలిగిస్తుంది.

సూపర్ మాలిక్యూల్‌గా పేర్కొంటున్న ఈ చికిత్స విధానాన్ని ఎలుకలపై ప్రయోగించి చూశారు. రొమ్ము, చర్మ క్యాన్సర్ కణుతులను నిర్మూలించడంలో ఈ మందును బాగా పనిచేసినట్లు 'నేచర్ బయోమెడికల్ ఇంజినీరింగ్' జర్నల్‌లో ప్రచురితమైన వ్యాసంలో శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఈ మందుకు ఇప్పటికే లైసెన్సు ఉంది. కొద్ది సంవత్సరాల్లో దీన్ని మనుషులపైనా పరీక్షించి చూడాలని వారు భావిస్తున్నారు.

మనిషిలో ఉండే సహజసిద్ధమైన రోగ నిరోధక శక్తి క్యాన్సర్‌తో పోరాడేలా చేయడంపై ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీరి తాజా పరిశోధన క్యాన్సర్ కణాలను నాశనం చేసే రోగనిరోధక కణాలను అభివృద్ధి చేయడంలో కీలక మలుపుగా పేర్కొంటున్నారు.

సాధారణంగా బయట నుంచి శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా, వైరల్ ఇన్‌ఫెక్షన్లపై పోరాడే మేక్రోఫేజెస్ క్యాన్సర్ కణాలను నాశనం చేయలేవు. క్యాన్సర్ కణాలు మన శరీరంలోనే తయారవడం, రోగనిరోధక కణాలకు దొరక్కుండా ఉండేలా వాటి ఉనికి అంత త్వరగా బయటపెట్టుకోకపోవడమే దీనికి కారణం.

హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన శాస్త్రవేత్త ఆశిష్ కులకర్ణి నేతృత్వంలోని బృందం తయారుచేసిన ఈ మందు మొట్టమొదట క్యాన్సర్ కణాలను తమ ఉనికికి దాచుకోనివ్వకుండా చేస్తుంది. దీంతో శరీరంలోని రోగనిరోధక కణాలు వీటిపై దాడిచేసే అవకాశం కలుగుతుంది. దీన్ని ఎలుకలపై ప్రయోగించగా క్యాన్సర్ కణాలు పెరగకుండా, విస్తరించకుండా అడ్డుకున్నట్లు గుర్తించారు.

క్యాన్సర్ రోగులకు దీన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు గాను దీన్ని మరింత అభివృద్ధి చేయాల్సి ఉందని శాస్త్రవేత్తల బృందం చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)