నా కళ్ల ముందే ఆ విమానాన్ని కూల్చేశారు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

యుద్ధ విమానం అనుకుని సాధారణ పౌరులు ప్రయాణిస్తున్న విమానం కూల్చేసిన అమెరికా

  • 4 జూలై 2018

జూలై 3.. అమెరికాకు చెందిన యుద్ధ నౌక యూఎస్ఎస్ విన్సెనెస్‌ ఇరాన్‌కు చెందిన 655 విమానాన్ని కూల్చేసి నేటికి సరిగ్గా 30 ఏళ్ళు. పర్షియన్ గల్ఫ్‌లో గస్తీ నిర్వహిస్తున్న అమెరికా నౌకా దళ బృందానికి ఆకాశంలో ఓ విమానం కనిపించింది. అది ఇరాన్‌కు చెందిన యుద్ధ విమానమని భావించి క్షిపణితో దాడి చేసి పేల్చేశారు. కానీ, నిజానికి అది సాధారణ పౌరులు ప్రయాణిస్తున్న విమానం. అందులో ప్రయాణికులందరూ చనిపోయారు. అదే యూఎస్ఎస్ విన్సెనెస్ నౌకలో ప్రయాణిస్తూ తన కళ్ళతో విమానాన్ని కూల్చి వేయడాన్ని చూసిన ఒక వ్యక్తి ఆరోజు ఏం జరిగిందో బీబీసీకి వివరించారు.

అదొక విషాదం. మేం ఒక విమానాన్ని కూల్చేశాం. ఇప్పటికీ, ఆ ఘటన జరిగిందంటే నమ్మలేకపోతున్నాను.

గల్ఫ్‌లో వాతావరణం ఉద్రిక్తంగా ఉంది. ఇరాన్-ఇరాక్‌ల మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. అదే సమయంలో కువైట్ నుంచి వస్తోన్న ఆయిల్ ట్యాంకర్లకు అమెరికా రక్షణ కల్పిస్తోంది. నేను కంబాట్ కెమెరా బృందంతో ఉన్నాను. ఉన్నంత సేపు నేను అన్ని దృశ్యాలను నా వీడియో కెమెరాలో రికార్డ్ చేస్తున్నాను.

యూఎస్ఎస్ విన్సెనెస్ అనే ఓడ మీద నేను ప్రయాణిస్తున్నాను. బహ్రయిన్ నుంచి వెనక్కి వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా ఇరానియన్ స్పీడ్ బోట్లతో పోరాడాల్సి వచ్చింది.

ఐదు నిమిషాల తరువాత బాండార్ అబ్బాస్ అనే ఇరానియన్ వైమానిక కేంద్రం నుంచి ఏదో విమానం బయలుదేరిందని, దాన్ని లక్ష్యం చేసుకుందామని అన్నారు. బయల్దేరిన విమానం శత్రువులదని గుర్తించారు. అది ఇరాన్ వైమానిక దళానికి చెందిన ఎఫ్14 టామ్‌కాట్ అని భావించారు. కానీ నిజానికి అది 655 విమానం - సామాన్య ప్రయాణికులతో బయల్దేరిన ఎయిర్ బస్. ఇక్కడ వైమానిక కేంద్రం నుంచి ఏదైనా విమానం బయల్దేరితే దాన్ని లక్ష్యంగా చేసుకుందామని సిబ్బంది ఎదురుచూస్తోంది. నేను వెళ్లి ‘ఏం జరుగుతోంది’ అని ఒక లెఫ్టినెంట్‌ను అడిగాను. ‘ఇపుడు నువ్వు ఒక క్షిపణి దాడిని చూడబోతున్నావు’ అని అతను నాతో అన్నారు.

స్కోప్‌లో నుంచి గమనిస్తున్న ఆపరేషన్ స్పెషలిస్ట్ దగ్గరకి వెళ్ళాను. ఆయన క్షిపణి ప్రయాణిస్తున్న గతిని గమనిస్తున్నారు. లక్ష్యాన్ని క్షిపణి ఢీ కొట్టడం చూశారు.

కానీ 15-20 నిమిషాల తరువాత ఒక ప్రయాణికుల విమానం అదృశ్యమైందన్న వార్త తెలిసింది. ఏమిటి? ప్రయాణికుల విమానం అదృశ్యమైందా? మేం కూల్చేసింది విమానాన్ని కాదు, మేము కూల్చేసింది టామ్‌కాట్ యుద్ధ విమానాన్ని అని నేననుకున్నాను.

ఎంతో మథనపడ్డాం.. నమ్మలేకపోయాం. ఇలా జరిగి ఉండాల్సింది కాదు. మేం ఇక్కడున్నది ఈ పని చేయడానికి కాదు. 655 విమానంలో ప్రయాణిస్తున్న 290 మంది అమాయక ప్రజలు చనిపోయారు. అందులో 66 మంది చిన్నారులు. వారి కుటుంబాలను తలచుకుని ఎంతో బాధ పడ్డాను. ఆ ఘటన జరగకుండా ఉండుంటే బాగుండేదని అనిపిస్తుంది. కానీ, నేను అక్కడే ఉన్నాను. అదంతా నా కళ్ళారా చూశాను.

మా ఇతర కథనాలు చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)