క్రికెట్: ఏడు రోజుల్లోనే ఐర్లాండ్, ఇంగ్లండ్‌లకు చుక్కలు చూపించిన చైనామన్ కుల్దీప్ యాదవ్

  • 4 జూలై 2018
కులదీప్ యాదవ్ Image copyright Getty Images

ఇండియన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గత ఏడు రోజుల్లో ఐర్లాండ్, ఇంగ్లండ్‌ల్లో తన బౌలింగ్‌తో సంచలనం సృష్టించాడు.

ఈ భారత చైనామన్ బౌలర్ గత ఏడు రోజుల్లో ఆడిన మూడు ట్వంటీ-20 మ్యాచుల్లో కేవలం 61 పరుగులు ఇచ్చి 12 వికెట్లు పడగొట్టాడు.

కుల్దీప్ అంతకు ముందు ఎనిమిది ట్వంటీ-20 మ్యాచుల్లో 12 వికెట్లు సాధించాడు.

ఐర్లాండ్‌తో ఆడిన రెండు మ్యాచుల్లో 7 వికెట్లు తీసిన కుల్దీప్, మాంచెస్టర్‌లో మంగళవారం ఇంగ్లండ్‌తో ఆడిన మ్యాచ్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. సిరీస్ ప్రారంభంలోనే ఆతిథ్య జట్టును ఇరకాటంలో పడేశాడు.

Image copyright ALLSPORT/GETTY IMAGES

కుల్దీప్ పవర్ పంచ్

ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి ట్వంటీ-20 మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన కుల్దీప్ మిగతా మ్యాచుల్లో కూడా తన జోరు కొనసాగుతుందని ఆతిథ్య జట్టుకు హెచ్చరిక పంపించాడు.

ఇంగ్లండ్‌పై 8 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందిన ఈ మ్యాచ్‌లో కుల్దీప్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. "ఇది ఇంగ్లండ్‌లో నా మొదటి పర్యటన. పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి. తర్వాత మ్యాచ్‌లో కూడా మేం ఇలాగే చేయాలనుకుంటున్నాం" అన్నాడు.

కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా కుల్దీప్ వల్లే ఈ విజయం దక్కిందని అన్నాడు

మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడిన కోహ్లీ.. "కుల్దీప్ ఒక్క ఓవర్ మ్యాచ్‌నే మార్చేసింది" అన్నాడు.

తన స్పెల్‌ మూడో ఓవర్లో కుల్దీప్ ఇయాన్ మోర్గాన్, జానీ బెయిర్‌స్టో, జో రూట్ వికెట్లు తీశాడు.

అలెక్స్ హేల్స్, బట్లర్ వికెట్లు కూడా పడగొట్టిన కుల్దీప్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Image copyright ALLSPORT/GETTY IMAGES

ఆకాశానికెత్తేసిన కెప్టెన్ కోహ్లీ

కుల్దీప్ యాదవ్‌ను ప్రశంసించిన కోహ్లీ.. "కుల్‌దీప్ మణికట్టుతో బంతిని తిప్పుతాడు, వికెట్ నుంచి కాస్త అండ దొరికినా చెలరేగిపోతాడు. తన బౌలింగ్ మెరుగుపరుచుకోడానికి కుల్దీప్ చాలా కష్టపడుతున్నాడు" అని అన్నాడు.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే క్రికెట్ ట్రైనింగ్ ప్రారంభించినపుడు కుల్దీప్ ఫాస్ట్ బౌలర్‌ కావాలని అనుకున్నాడు.

Image copyright Reuters

కుల్దీప్ క్రికెట్ జర్నీ

1994లో ఉత్తర ప్రదేశ్ కాన్పూర్‌లో పుట్టిన కుల్దీప్ యాదవ్‌కు రిస్ట్ స్పిన్నర్( మణికట్టుతో బంతిని తిప్పే స్పిన్ బౌలర్)అవమని అతడి కోచ్ సలహా ఇచ్చాడు. దాన్ని అమలు చేయడం అంత సులభం కాకపోయినా కుల్దీప్ శ్రమ ఫలించింది. పిచ్‌పై అద్భుతాలు సృష్టించేలా చేసింది.

అండర్-19, ఇండియా ఎ, ఉత్తర్ ప్రదేశ్ తరఫున అద్భుతాలు చేసిన కుల్దీప్ తర్వాత భారత జట్టులో భాగమయ్యాడు.

2017లో కుల్దీప్ ట్వంటీ-20, వన్డే, టెస్ట్ కెరీర్ కూడా ప్రారంభమైంది.

2017 మార్చిలో ధర్మశాలలో ఆస్ట్రేలియాతో కుల్దీప్ తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి భారత్ విజయానికి మార్గం సుగమం చేశాడు.

రెండు టెస్ట్ మ్యాచుల్లో 9 వికెట్లు తీసిన కుల్దీప్, 20 వన్డేల్లో 39 వికెట్లు, 11 ట్వంటీ-20 మ్యాచుల్లో 24 వికెట్లు పడగొట్టాడు.

గిరగిరా తిరుగుతూ దూసుకొచ్చే కుల్దీప్ బంతులు ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్‌ను ఎంత మాయ చేస్తున్నాయో ఈ గణాంకాలే నిరూపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)