బ్రిటన్‌లో మరో విష ప్రయోగం, స్పృహతప్పిన దంపతులు

  • 5 జూలై 2018
బాధితులు Image copyright facebook
చిత్రం శీర్షిక విషయం ప్రయోగానికి గురైన దంపతులు

బ్రిటన్‌లో మరోసారి విష ప్రయోగ ఘటన కలకలం సృష్టించింది. విల్ట్‌షైర్ ప్రాంతంలో దంపతులపై 'నోవిచోక్' అనే నర్వ్ ఏజెంట్ ప్రయోగం జరిగిందని పోలీసులు తెలిపారు.

నాలుగు నెలల కిందట బ్రిటన్ మాజీ గూఢచారి మీద ప్రయోగించిన పదార్థం కూడా ఇదేనని పోలీసులు వెల్లడించారు.

శనివారం జరిగిన తాజా ఘటనలో ఛార్లీ రౌలే, డాన్ స్టర్జెస్‌ దంపతులు తీవ్ర అస్వస్థతకు గురై స్పృహతప్పి పడిపోయారు.

వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా వారిపై నోవిచోక్ అనే నర్వ్ ఏజెంట్‌ను ప్రయోగించారన్న విషయం బయటపడిందని పోలీసులు వెల్లడించారు.

ఈ ఇద్దరు కాకుండా మరెవరిలోనూ అలాంటి లక్షణాలు కనిపించలేదని పోలీసులు తెలిపారు.

ఈ జంటను ఎవరు.. ఎందుకు లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేశారో తెలియాల్సి ఉందన్నారు.

Image copyright PA

గతంలో బ్రిటన్ గూఢచారి సెర్గీ స్క్రిపాల్, ఆయన కుమార్తెపై దాడికి వాడిన విషం, తాజా ఘటనలో వాడిన విషం రెండూ ఒకే బ్యాచ్‌కి చెందినవేనా? అన్నది ఇంకా నిర్ధారించాల్సి ఉందని పోలీసులు చెప్పారు.

ఈ దాడిపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని మెట్రోపాలిటన్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ నెయిల్ బసు తెలిపారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: భవిష్యత్తులో అన్నీ రసాయన ఆయుధాలేనా?

ఏమిటీ 'నోవిచోక్'? ఎలా పని చేస్తుంది?

నోవిచోక్ అంటే రష్యా భాషలో.. 'కొత్తగా వచ్చిన వాడు' అని అర్థం. ఈ విష రసాయనం.. రష్యా గూఢచార సంస్థకు చెందినది. ఈ రసాయనాన్ని 1970-80 మధ్య కాలంలో రష్యా తయారు చేసింది.

ఏ-230 అనే మరో విష రసాయనం వీఎక్స్ నెర్వ్ ఏజెంట్ కంటే ఐదు నుంచి ఎనిమిది రెట్లు ఎక్కువ ప్రమాదకారి. ఇది మనుషులను కొన్ని నిమిషాల్లోనే హతమారుస్తుంది.

ఇందులో కొన్ని ద్రవ రూపంలో ఉంటే.. మరికొన్ని ఘన రూపంలో ఉంటాయి. మరికొన్ని.. తక్కువ సామర్థ్యం ఉన్న రెండు రకాల విష రసాయనాలు ఉంటాయి. కానీ ఈ రెంటినీ కలిపినపుడు అత్యంత ప్రమాదకరమైన విషం తయారవుతుంది.

వీటిలో ఒకరకమైన రసాయనాన్ని 'రసాయన ఆయుధం'గా ఉపయోగించడానికి రష్యా మిలిటరీ ఆమోదం తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)