థాయ్ గుహలో బాలలు: బయటకు ఎలా తీసుకురావాలి?

  • 5 జూలై 2018
గుహ నుంచి నీటిని బయటకు తోడుతున్న దృశ్యం Image copyright Reuters
చిత్రం శీర్షిక గుహ నుంచి నీటిని బయటకు తోడుతున్న దృశ్యం

నీటితో నిండిన థాయ్‌లాండ్ గుహలో ఫుట్ బాల్ కోచ్‌తో పాటు చిక్కుకుపోయిన 12 మంది పిల్లలు లోపల ఇంకా బిక్కుబిక్కు మంటూనే ఉన్నారు. వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న సహాయ బృందాలకు కఠిన సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి.

ఇరుకైన దారిలో కొండ చరియలు విరిగి పడే ప్రమాదం కూడా కనిపిస్తోంది.

థాయ్‌లాండ్‌ గుహలో ఈ పిల్లలు జూన్ 23 నుంచి ఉన్నారు. సోమవారం వీరు సురక్షితంగా ఉన్నట్టు వార్తలొచ్చాయి.

వాటితోపాటు గుహ లోపల దృశ్యాలూ బయటకు వచ్చాయి.

లోపలికి వెళ్లే దారి నుంచి ఈ గుహ రెండు కిలోమీటర్ల పొడవు ఉంది. ఇది 800 మీటర్ల నుంచి ఒక కిలోమీటరు లోతులో ఉంది. గుహ చాలా చోట్ల ఇతర ప్రాంతాలతో తెగిపోయినట్టు ఉండడం సహాయ బృందాలకు సమస్యగా మారింది.

Image copyright ...

లోపల చిక్కుకుపోయిన పిల్లలు శిక్షణ పొందిన స్విమ్మర్స్ కాకపోవడం సహాయ బృందాలకు పెద్ద సమస్యగా మారింది.

అక్కడ లోపల వాళ్లు ఏదీ చూడలేకపోతున్నారని ఇంటర్నేషనల్ అండర్ వాటర్ కేవ్ రెస్క్యూ ఆర్గనైజేషన్ బీబీసీకి చెప్పింది. చీకటిలో ఉండడం భయానకంగా ఉంటుందని. గుహలో ఉండడం చాలా కష్టంగా ఉంటుందని తెలిపింది. ఎవరైనా చిక్కుకుపోయినపుడు భయం, కంగారు ఉండడం సహజమే అని వివరించింది.

నీళ్లు నిండిన దారుల్లో వెళ్లడానికి ప్రత్యేకమైన శ్వాస పరికరాలతో ఒక డైవర్స్ బృందం గుహ దగ్గరికి చేరుకుంది. వీరు ప్రస్తుతం లోపల ఉన్న పిల్లలకు ఎలా ఈదాలో నేర్పిస్తున్నట్టు థాయ్ ఉప ప్రధాని ప్రావిట్ వాంగ్సూవాన్ చెప్పారు. లోపల ఉన్న వారిని డైవర్స్ ఎలాగైనా బయటకు తీసుకొస్తారని భావిస్తున్నారు.

పిల్లలు సొరంగాల నుంచి బయటకు వచ్చేలా వారికి ఫుల్ ఫేస్ మాస్కులు, ఆక్సిజన్ ట్యాంకులు, దారిలో వెలుతురు కోసం లైట్లు ఇవ్వాలని సహాయ బృందాలు భావిస్తున్నాయి.

అయితే ఈ డైవింగ్ ఆప్షన్ చాలా ప్రమాదకరమని కొందరు భావిస్తున్నారు. కానీ భారీ వర్షాల వల్ల మరిన్ని నీళ్లు గుహలోకి చేరక ముందే పిల్లలను బయటకు తీసుకురావడం మంచిదని డైవింగ్ నిపుణులు చెబుతున్నారు.

Image copyright Reuters

గుహలోంచి నీటిని బయటకు తోడే ప్రయత్నాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. నీటిని బయటకు తీసేకొద్దీ కొండపైనుంచి వస్తున్న నీళ్లతో అది నిండుతుండడం సమస్యగా మారింది.

గుహ గోడలకు రంధ్రాలు చేసి నీటిని బయటకు తోడాలని కూడా ప్రయత్నించారు. కానీ రాయి చాలా మందంగా ఉండడంతో అది సాధ్యం కాలేదు.

ఈ సహాయ కార్యక్రమాల్లో చాలా దేశాలు పాల్గొంటున్నాయి. వెయ్యి మంది ఉన్న సహాయ బృందంలో సైన్యం, స్థానిక వర్కర్స్, నిపుణులు ఉన్నారు.

సహాయ బృందం మరో ప్రత్యామ్నాయం కూడా ఆలోచిస్తోంది. గుహ పైనుంచి డ్రిల్ చేయాలని కూడా భావిస్తున్నారు. పైన రంధ్రం చేస్తే అందులోంచి పిల్లలను పైకి లాగవచ్చని అనుకుంటున్నారు.

కానీ కొండ రాతిని తొలిచేందుకు అవసరమయ్యే భారీ మెషినరీ కోసం కొండపైకి కొత్తగా మార్గాలు వేయాల్సి ఉంటుంది. వాటితో డ్రిల్లింగ్ చేయడం సరైన పద్ధతి కాదు అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

గుహలో పిల్లలున్న చోట డ్రిల్లింగ్ చేపడితే, ఆ శిథిలాలు పడి వారు గాయపడవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దీంతో ఆ ప్రాంతంలో నీళ్లు తగ్గేవరకూ వేచిచూడాలని సహాయ బృందాలు భావిస్తున్నాయి. డైవర్ల ద్వారా లోపల ఉన్న వారికి ఆహారం సరఫరా జరిగేలా చూస్తున్నారు. తర్వాత కాలినడకన వారిని బయటకు తీసుకురావాలని అనుకుంటున్నారు.

Image copyright AFP

ప్రస్తుతం వర్షాకాలం కావడంతో, పిల్లలను కాపాడడానికి కొన్ని వారాల నుంచి నెలల సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

ఇక్కడ కొన్ని రోజుల నుంచీ కుండపోత వర్షం కురుస్తోంది. దాంతో సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోంది.

లోపల ఉన్న 13 మందికి నాలుగు నెలలపాటు సరిపోయేలా గుహలోకి ఆహార పదార్థాలు పంపించడానికి ప్రయత్నిస్తున్నామని థాయ్ నౌకాదళం ప్రకటించింది.

గుహలోకి మరిన్ని నీళ్లు చేరినా లోపల ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం లేకుండా సహాయ బృందాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు