హెచ్‌ఐవీ వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందడుగు

  • అలెక్స్ థెర్రీన్
  • బీబీసీ ప్రతినిధి
హెచ్‌ఐవీ, వ్యాక్సిన్

ఫొటో సోర్స్, Getty Images

హెచ్‌ఐవీ వైరస్ బారి నుంచి రక్షించే వ్యాక్సిన్‌ను కనుగొనే ప్రయోగంలో ముందడుగు పడింది.

హెచ్‌ఐవీ వైరస్‌ను ఎదుర్కొనేందుకని అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ను 393 మందిపై ప్రయోగించి చూడగా, ఆశాజనకమైన ఫలితాలు వెలువడ్డాయని మెడికల్ జర్నల్ లాన్సెట్ వెల్లడించింది.

అంతే కాకుండా కొన్ని రకాల కోతులలో హెచ్‌ఐవీని పోలిన వైరస్‌పై ఈ వ్యాక్సిన్ సమర్థంగా పని చేసింది.

ఫొటో సోర్స్, Getty Images

ప్రస్తుతం ప్రపంచంలో సుమారు 3.7 కోట్ల మంది హెచ్‌ఐవీ లేదా ఎయిడ్స్‌తో బాధ పడుతున్నారు. అంతే కాకుండా ఏటా 18 లక్షల కొత్త కేసులు నమోదు అవుతున్నాయని అంచనా.

ప్రస్తుతం హెచ్‌ఐవీకి పలు రకాలుగా చికిత్స చేస్తున్నా దానిని పూర్తిగా నయం చేసే ఔషధాలు లేదా వ్యాక్సిన్‌ను మాత్రం ఇప్పటివరకు కనుగొనలేదు.

ప్రీ-ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ అనే డ్రగ్ హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్‌ను అరికట్టడంలో సమర్థంగా పని చేస్తోంది. కానీ వ్యాక్సిన్ మాదిరి కాకుండా దీనిని ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.

అందువల్ల హెచ్‌ఐవీ వైరస్ నుంచి రక్సించే వ్యాక్సిన్‌ను కనుగొనడం శాస్త్రవేత్తలకు సవాలుగా మారింది. దీనికి కారణం.. హెచ్‌ఐవీ వైరస్‌లో అనేక రకాలున్నాయి. అంతే కాకుండా, రోగ నిరోధక శక్తిని తిప్పికొట్టడానికి హెచ్‌ఐవీ రకరకాలుగా మార్పులు చెందగలదు.

గతంలోను హెచ్‌ఐవీకి వ్యాక్సిన్‌లను కనుగొనే ప్రయత్నాలు జరిగినా, అవి కేవలం ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలకు చెందిన నిర్దిష్టమైన హెచ్‌ఐవీ రకాలకు మాత్రమే పరిమితమయ్యాయి.

ఈ కొత్త వ్యాక్సిన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రకాల హెచ్‌ఐవీ వైరస్‌ల నుంచి రక్షణ కల్పిస్తుందని భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు 18-50 ఏళ్ల మధ్య ఉన్న అమెరికా, దక్షిణాఫ్రికా, యుగాండా, థాయ్‌ల్యాండ్‌కు చెందిన వారిపై ప్రయోగించి చూశారు. దీనిలో మొత్తం 48 వారాల వ్యవధిలో నాలుగు వ్యాక్సిన్లను ప్రయోగించారు.

ఈ వ్యాక్సిన్లు అన్నీ కూడా హెచ్‌ఐవీ వైరస్‌ను అడ్డుకునే రోగనిరోధక వ్యవస్థను సమర్థంగా ఉత్పత్తి చేశాయి.

ఇదే సమయంలో శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్‌ను కోతులలో వచ్చే హెచ్‌ఐవీ తరహా వైరస్‌పై కూడా ప్రయోగించి చూశారు. ఈ ప్రయోగంలో ఆ వ్యాక్సిన్ 67 శాతం కోతులలో వైరస్‌ను సమర్థంగా అడ్డుకుందని తేలింది.

ఈ ఫలితాలు హెచ్‌ఐవీ వ్యాక్సిన్ పరిశోధనలో ఒక మైలురాయి అని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన హార్వర్డ్ మెడికల్ స్కూల్ ఫ్రొఫెసర్ డాన్ బారోచ్ తెలిపారు.

అయితే ఈ వ్యాక్సిన్ రోగ నిరోధక వ్యవస్థను స్పందింపజేయడంలో సమర్థంగా పని చేసినప్పటికీ, అది వైరస్‌ను ఎదుర్కొనడంలో, ఇన్ఫెక్షన్‌ను అరికట్టడంలో ఎలా పని చేస్తుందన్న దానిపై స్పష్టత లేదు.

సమర్థంగా పని చేసే హెచ్‌ఐవీ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి ఇంకా చాలా కృషి చేయాల్సి ఉందని టెర్రెన్స్ హిగ్గిన్స్ ట్రస్ట్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ మెఖేల్ బ్రాడీ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)