మా విషయంలో అమెరికా వైఖరి విచారకరం: ఉత్తర కొరియా

మైక్ పాంపేయో, కిమ్‌ యాంగ్-చోల్ కరచాలనం

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

జపాన్ బయల్దేరిన మైక్ పాంపియోకు వీడ్కోలు చెప్తున్న కిమ్ యాంగ్-చోల్

ఉత్తర కొరియా అణు నిరాయుధీకరణ ప్రణాళిక విషయంలో ఆ దేశంతో చర్చలు జరిపిన తర్వాత పురోగతి కనిపించిందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో పేర్కొనగా.. తమ అణు కార్యక్రమం విషయంలో అమెరికా వైఖరి ‘‘విచారకరం’’గా ఉందని ఉత్తర కొరియా అభివర్ణించింది.

పాంపేయో ఉత్తర కొరియాలో ఆ దేశ పాలకుడు కిమ్ జోంగ్-ఉన్ కుడిభుజంగా పరిగణించే కిమ్ యాంగ్-చోల్‌తో సమావేశమయ్యారు. రెండు రోజుల పాటు చర్చల తర్వాత ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.

అయితే.. పాంపేయో చెప్పిన విషయాలకు భిన్నంగా.. ఉత్తర కొరియా విదేశాంగ శాఖ అధికారి ఒకరు విడుడదల చేసిన ప్రకటన అమెరికా వైఖరిపై అసంతృప్తి వ్యక్తంచేసింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కిమ్ శిఖరాగ్ర సదస్సు అనంతరం.. పాంపేయో ఉత్తర కొరియాలో పర్యటించటం ఇదే తొలిసారి.

ఉత్తర కొరియా అధికారిక కేసీఎన్‌ఏ వార్తా సంస్థ ప్రచురించిన ఆ దేశ ప్రకటన.. శిఖరాగ్ర సదస్సు స్ఫూర్తికి విరుద్ధంగా అమెరికా వ్యవహరిస్తోందని, అణ్వాయుధాలను వదిలిపెట్టాలంటూ తమ దేశం మీద ఏకపక్ష ఒత్తిడి తెస్తోందని మండిపడింది.

ఫొటో సోర్స్, Reuters

అణు నిరాయుధీకరణ దిశగా కృషి చేస్తామని కిమ్ హామీ ఇచ్చారు. కానీ.. అది ఎలా సాధిస్తారన్న వివరాలేవీ ఇంకా తెలీదు.

సింగపూర్ శిఖరాగ్ర సదస్సు తర్వాత.. ఉత్తర కొరియా నుంచి ఇక ఏమాత్రం అణు ముప్పు లేదని ట్రంప్ పేర్కొన్నారు.

ఆ సదస్సులో.. ఉత్తర కొరియాకు ‘‘భధ్రతా భరోసాలు’’ ఇస్తామని అమెరికా చెప్పింది. దక్షిణ కొరియాతో సైనిక విన్యాసాలను కూడా నిలిపివేస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు.

అయితే.. సదస్సు అనంతరం ఉత్తర కొరియాపై ఆంక్షలను ట్రంప్ పునరుద్ధరించారు. అలాగే ఉత్తర కొరియా తన అణు, క్షిపణి కార్యక్రమాల సదుపాయాలకు మెరుగులు దిద్దుతోందనేందుకు ఆధారాలు ఉన్నాయని అమెరికా నిఘా అధికారులు చెప్పారు.

ఈ నేపథ్యంలో.. అణు నిరాయుధీకరణ పట్ల ఉత్తర కొరియా నిబద్ధతను బలోపేతం చేయటం ప్రధాన లక్ష్యంగా పాంపేయో ఆ దేశంలో రెండు రోజుల పర్యటనకు వచ్చారు.

ఉత్తర కొరియా అణు నిరాయుధీకరణ క్రమం ఎప్పుడెప్పుడు ఎలా సాగాలన్న అంశం మీద సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు ఆయన తెలిపారు. క్షిపణి ఇంజన్ పరీక్ష కేంద్రాన్ని ధ్వంసం చేయటం కూడా ఆ కార్యక్రమంలో భాగమని చెప్పారు. కానీ కొత్త వివరాలేవీ ఆయన వెల్లడించలేదు.

ఫొటో సోర్స్, Twitter/Conor Finnegan

ఫొటో క్యాప్షన్,

సింగపూర్ డిక్లరేషన్

‘‘ఇవి చాలా సంక్లిష్టమైన విషయాలు. కానీ ముఖ్యమైన అన్ని అంశాల్లోనూ మేం పురోగతి సాధించాం. కొన్ని విషయాల్లో చాలా ప్రగతి ఉంది. ఇంకొన్ని విషయాల్లో ఇంకా పని చేయాల్సి ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు.

అణు నిరాయుధీకరణ మీద దృష్టి కేంద్రీకరించటంలోను, భద్రతా పరమైన హామీలు, కొరియా యుద్ధం నాటి అమెరికా సైనిక సిబ్బంది భౌతిక అవశేషాలను తిరిగి అప్పగించే విషయంలోనూ పాంపేయో చాలా ఖచ్చితంగా వ్యవహరించారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.

అంతకుముందు.. పాంపేయో, కిమ్ యాంగ్-చోల్ ఇద్దరూ.. ‘స్పష్టత’ రావాల్సిన అంశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

ప్యాంగ్యాంగ్‌లోని గెస్ట్‌హౌస్‌లో బసచేసిన పాంపేయో.. రాత్రి సరిగా నిద్రపోయి ఉండరని చోల్ జోక్ చేశారు. తాను బాగానే నిద్రపోయానని పాంపేయో చెప్పారు.

పాంపేయో ఆదివారం టోక్యోలో జపాన్, దక్షిణ కొరియా విదేశాంగ మంత్రులను కలుస్తారు.

వీడియో క్యాప్షన్,

ట్రంప్-కిమ్ సదస్సు: చరిత్రాత్మక కరచాలనం ఇదే

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)