అమెరికాలో కాల్పులు: తెలుగు యువకుడి మృతి

కొప్పు శరత్, అమెరికా, కాల్పులు

ఫొటో సోర్స్, Facebook/Sharath

అమెరికాలోని కాన్సస్ నగరంలో జరిగిన కాల్పులలో వరంగల్ పట్టణానికి చెందిన కొప్పు శరత్ అనే విద్యార్థి మృతి చెందాడు.

ఈ మేరకు కాన్సస్ సిటీ పోలీసులు బీబీసీ న్యూస్ తెలుగుకి వెల్లడించారు.

భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4 గంటల 40 నిమిషాల సమయంలో కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు.

కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన శరత్‌ను ఆసుపత్రికి తరలించగా, అతను ఆసుపత్రిలో మరణించినట్లు కాన్సస్ పోలీసు అధికారి థామస్ బీబీసీ తెలుగు ప్రతినిధి బొల్లంపల్లి వేణుగోపాల్‌కి చెప్పారు.

కాన్సస్‌లో కాల్పుల సమాచారం తెలుసుకున్న బీబీసీ తెలుగు కాన్సస్‌ సిటీ పోలీసులను సంప్రదించింది. వారు మొదట కాల్పుల విషయాన్ని ధృవీకరించారు. కానీ చనిపోయింది శరత్ అనే విషయాన్ని ధృవీకరించలేదు.

తర్వాత ఈ కేసుతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న పోలీసు అధికారి థామస్‌ను సంప్రదించగా ఆయన ఈ కాల్పుల ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు.

అనుమానితుడి సీసీటీవీ ఫుటేజిని కూడా ఇచ్చారు.

అనుమానితుడి సమాచారం అందించిన వారికి 10 వేల డాలర్ల రివార్డు ప్రకటించినట్లు వివరించారు.

కాగా.. శరత్ తల్లిదండ్రులు తమ కుమారుడి మృతదేహాన్ని భారతదేశం తీసుకువచ్చేందుకు సహకరించాలని మంత్రి కేటీఆర్‌కు, సుష్మా స్వరాజ్‌కు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

అంతకు ముందు వీరు తెలంగాణ డీజీపీని కలిసి అమెరికాలోని కాన్సస్ సిటీలోని ముస్సోరి హాస్పిటల్ నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు వివరించారు.

వీడియో క్యాప్షన్,

వీడియో: శరత్‌పై కాల్పుల ఘటనలో అనుమానితుడు

శరత్ ఎవరు?

శరత్ యూనివర్సిటీ ఆఫ్ మిసోరిలో చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు.

వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన శరత్ ఈ ఏడాది జనవరిలోనే పై చదువుల కోసం అమెరికాకు వెళ్లారు.

ఒకవైపు చదువుకుంటూనే జేస్ ఫిష్ అండ్ చికెన్ మార్కెట్‌లో పని చేస్తున్నారు.

శరత్ తండ్రి రామ్ మోహన్ బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి. వరంగల్‌లోని కొత్తవాడకు చెందిన శరత్ కుటుంబం, తండ్రి ఉద్యోగ నిమిత్తం మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కు తరలివెళ్లింది.

మరోవైపు అమెరికాలోని శరత్ బంధువైన రాఘవేందర్, అతని మృతదేహాన్ని భారతదేశం పంపడానికి స్నేహితుల నుంచి నిధులు సేకరిస్తున్నారు.

ఫొటో సోర్స్, Facebook

ఫొటో క్యాప్షన్,

గత ఏడాది ఇదే రాష్ట్రంలో జరిగిన కాల్పుల్లో కూచిభొట్ల శ్రీనివాస్ చనిపోగా, అలోక్ మేడసాని (మధ్యలో), ఇయాన్ గ్రిల్లాట్ గాయపడ్డారు

ఏడాది కిందట ఇదే రాష్ర్టంలో హత్యకు గురైన తెలుగు యువకుడు కూచిభొట్ల

అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన తెలుగు యువకుడు కూచిభొట్ల శ్రీనివాస్‌ కూడా గత ఏడాది కాన్సస్‌లోనే హత్యకు గురయ్యాడు.

గతేడాది కాన్సస్‌ రాష్ట్రం ఒలేథ్ నగరంలోని ఒక బార్‌లో పురింటన్ అనే వ్యక్తి కాల్పులు జరుపగా కూచిభొట్ల శ్రీనివాస్‌ చనిపోయాడు. అలోక్ మేడసాని అనే యువకుడు గాయపడ్డాడు.

తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా వెళ్లి జీపీఎస్ తయారు చేసే గర్మిన్ కంపెనీలో ఇంజనీర్లుగా పనిచేస్తున్న ఈ ఇద్దరినీ ‘తీవ్రవాదులు’ అని సంబోధిస్తూ.. ‘నా దేశం విడిచిపొండి’ అని పురింటిన్ అరిచాడు. అనంతరం వారిపై కాల్పులు జరిపాడు.

ఈ హత్య కేసులో పురింటన్‌కు 50 ఏళ్ల జైలు శిక్ష పడింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)