దక్షిణాది పురుషుల్లో తగ్గుతున్న వీర్య కణాలు.. ఏపీలో 5శాతం మందికి సంతాన లేమి

 • 9 జూలై 2018
వంధ్యత్వ సమస్య Image copyright Getty Images

నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్(ఎన్‌సీబీఐ) నివేదిక ప్రకారం భారత్‌లో వంధ్యత్వ స్థాయి ఏటా పెరుగుతోంది. దేశంలో పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకొని ఎన్‌సీబీఐ కొన్ని వివరాలను వెల్లడించింది.

వాటి ప్రకారం దక్షిణాది పురుషుల్లో వీర్యకణాల స్థాయి తగ్గుతోంది. ఏపీలో అయితే 5 శాతం మందికి సంతాన లేమి సమస్య ఉంది.

ఇంతకీ వంధ్యత్వం అంటే ఏమిటి?

డబ్ల్యూహెచ్‌వో అనుబంధ సంస్థ 'ది ఇంటర్నేషనల్ కమిటీ ఫర్ మానిటరింగ్ అసిస్టెడ్ రీప్రొడెక్టివ్ టెక్నాలజీ' నిర్వచనం ప్రకారం, 'ఎలాంటి కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించకుండా, మందులు వాడకుండా, క్రమం తప్పకుండా ఏడాదిపాటు శృంగారంలో పాల్లొన్నప్పటికీ పిల్లలు పుట్టకపోవడాన్ని ప్రాథమిక వంధ్యత్వం అంటారు'.

ప్రపంచంలో 8 నుంచి 12 శాతం మంది వంధ్యత్వ సమస్యతో బాధపడుతున్నారని అంచనా. డబ్య్లూహెచ్‌వో నివేదిక ప్రకారం వీరి సంఖ్య 6 నుంచి 7 కోట్లుగా ఉంది.

Image copyright Getty Images

భారత్‌లో పరిస్థితి ఎలా ఉందంటే..

 • భారత్‌లో ప్రాథమిక వంధ్యత్వ స్థాయి 3.9 శాతం నుంచి 16.8 శాతం మధ్యలో ఉంది.
 • ఈ సమస్య ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్థాయిలో ఉంది.
 • ఉత్తరప్రదేశ్‌, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్రలో 3.7 శాతం ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 5 శాతం, కశ్మీర్‌లో 15 శాతం ఉంది.
 • ఒకే ప్రాంతంలో ఉన్నప్పటికీ వివిధ తెగలు, కులాల మధ్య కూడా ఈ ప్రాథమిక వంధ్యత్వ స్థాయి వేర్వేరుగా ఉంది.
 • 40 శాతం వంధ్యత్వ కేసులు పురుషులకు సంబంధించినవే.
 • మరో 40 శాతం మహిళలకు సంబంధించివి కాగా, ఇద్దరిలోనూ సమస్యలున్నవి 20 శాతం.
Image copyright Getty Images

దక్షిణాదిలో ప్రమాద ఘంటికలు..

దక్షిణాది రాష్ట్రాల్లో గత 13 ఏళ్ల గణాంకాలను పరిశీలిస్తే మగవారిలో వీర్య కణాల సంఖ్య తగ్గుతూ వస్తోందని ఎన్‌సీబీఐ తెలిపింది.

దశాబ్దకాలంగా పరిశీలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో మగవారిలో వీర్య కణాల కదలిక సగటు 22.92 శాతానికి, వీర్య కణాల పరిమాణం సగటు 51.25 శాతానికి తగ్గింది.

వంధ్యత్వ స్థాయి ఆంధ్రప్రదేశ్‌లో 5 శాతం ఉండగా, మహారాష్ట్రలో 3.7 శాతంగా ఉంది.

ఎయిమ్స్ నివేదిక ప్రకారం దేశంలో ఏటా 1.2 నుంచి 1.8 కోట్ల మంది దంపతులు సంతానోత్పత్తి సమస్యలతో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు.

దశాబ్దం కిందట భారత్‌లోని మగవారిలో వీర్యకణాల సంఖ్య సగటున 60 మిలియన్/ మిల్లీ లీటర్లు ఉండగా, అదిప్పుడు 20 మిలియన్/ మిల్లీ లీటర్లకు తగ్గింది.

తీవ్ర ఉష్ణోగ్రతలే కారణం..

వేడి ప్రదేశాల్లో అంటే వెల్డింగ్ పని, బాణాసంచా, సిమెంట్ ఫ్యాక్టరీలలో పనిచేసేవారులో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గే అవకాశం ఎక్కువగా ఉందని ఎన్‌సీబీఐ పేర్కొంది.

‘‘తీవ్ర ఉష్ణోగ్రతలు వృషణాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. దీంతో వీర్య వృద్ధి తగ్గుతుంది. ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగితే శుక్రకణాల సంఖ్య 14 శాతం తగ్గుతుంది. వీర్యకణాల కదలిక, నాణ్యత, ఉత్పత్తి సామర్థ్యంపై కూడా ప్రభావం పడుతుంది’’ అని ఎన్‌సీబీఐ తెలిపింది.

Image copyright Getty Images

గుప్పెడు నట్స్‌తో పరిష్కారం

రోజూ గుప్పెడు నట్స్ తినడం వల్ల వీర్యం వృద్ధి చెందుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

వంధ్యత్వ సమస్యలను ఎదుర్కొనే పురుషులు 14 వారాల పాటు రోజూ గుప్పెడు బాదం, ఆక్రోట్, వాల్‌నట్స్‌ల మిశ్రమాన్ని తీసుకుంటే వారిలో వీర్య కణాల సంఖ్య పెరుగుతుందని అంటున్నారు.

ప్రతి ఏడుగురు దంపతుల్లో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నారని ఇందులో 40 నుంచి 50 శాతం లోపం మగవారిలోనే ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.

పౌష్టికాహారం తీసుకోవడం వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని తమ పరిశోధనలో వెల్లడైనట్లు వారు చెప్పారు.

ఈ పరిశోధనలో భాగంగా వారు 18 నుంచి 35 ఏళ్ల మధ్యనున్న 119 మంది పురుషులను ఎంపిక చేసుకొన్నారు. వారిని రెండు గ్రూపులగా విభజించారు.

 • ఒక గ్రూపులో ఉన్నవారికి సాధారణ భోజనంతో పాటు రోజూ 60 గ్రాముల నట్స్ అందించారు.
 • మరో గ్రూప్‌లో వారికి సాధారణ భోజనమే పెట్టారు.
 • నట్స్ గ్రూపులో ఉన్నవారిలో వీర్యం వృద్ధి చెందింది.
 • వారిలో వీర్య కణాల సంఖ్య 14%, సామర్థ్యం 4%, కదలిక 6%, పరిమాణం 1% పెరిగింది.

నట్స్‌లలో ఒమెగా-3 ఫాటీ ఆమ్లాలు, యాంటీయాక్సిడెంట్స్, బి- విటమిన్‌ ఉంటాయని, ఇవి సంతాన సామర్థ్యాన్ని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్యకర జీవన విధానం, పౌష్టికాహారంతో వంధ్యత్వ సమస్యలను అధిగమించవచ్చిన స్పెయిన్‌లోని రివిరా ఐ విర్జిలీ యూనివర్సటీకి చెందిన డాక్టర్ అల్బెర్ట్ సలస్ హ్యూయటోస్ తెలిపారు.

Image copyright Getty Images

'అందరికీ వర్తిసాయని చెప్పలేం'

అయితే, తమ పరిశోధనలో పాల్గొన్నవారందరూ ఆరోగ్యవంతులేనని, వారిలో వంధ్యత్వ సమస్యలు లేవని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ నేపథ్యంలో తమ పరిశోధన ఫలితాలు అందరి వర్తిస్తాయని స్పష్టంగా చెప్పలేమని వెల్లడించారు.

ఈ పరిశోధన వివరాలను పరిగణించకున్నా నట్స్ తినే గ్రూపువారిలో సానుకూల మార్పులు కనిపించే అవకాశం ఉందని షెఫ్పిల్డ్ యూనివర్సిటీ ఆండ్రాలజీ ప్రొఫెసర్ అల్లన్ పెయిసీ అన్నారు. ఆయన ఈ పరిశోధనలో పాలుపంచుకోలేదు.

'ఈ పరిశోధన ఫలితాలు ఆసక్తికరంగానే ఉన్నాయి. అయితే, సంతాన సాఫల్యతకు నట్స్ ఏ విధంగా ఉపయోగపడుతాయి? ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో చెప్పలేమని లండన్‌లోని గయ్స్ ఆస్పత్రి మాజీ వైద్య పరిశోధకురాలు వర్జీనియా బొల్డన్ అన్నారు.

వంధ్యత్వ సమస్యలున్నవారు పొగతాగడం మానేయాలని, మద్యపానానికి దూరంగా ఉండాలని, పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.

ఈ పరిశోధన పూర్తి వివరాలను బార్సిలోనాలో నిర్వహించిన 'యూరోపియన్ సొసైటీ ఆఫ్ హ్యూమన్ రీప్రొడక్షన్ అండ్ ఎంబ్రాలజీ' వార్షిక సమావేశంలో వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

టెలికాం రంగంలో ఏం జరుగుతోంది.. మొబైల్ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరముందా

"పాకిస్తాన్‌ వ్యతిరేక ప్రచారానికి దిల్లీ కేంద్రంగా నకిలీ మీడియా సంస్థలు" - ఇది నిజమేనా?

శబరిమలకు 10 మంది విజయవాడ మహిళలు.. వెనక్కి పంపిన పోలీసులు

అతిపెద్ద డంప్ యార్డ్ పాతికేళ్ల ముందే నిండిపోయింది

మసీదు దేవుడి ఇల్లయితే, మహిళలకు తలుపులు ఎందుకు మూస్తున్నారు...

తెలంగాణ ఆర్టీసీ సమ్మె: కార్మికుల నిరాహార దీక్షలు... అశ్వత్థామరెడ్డి ఇంటివద్ద భారీగా పోలీసులు

గణితశాస్త్రంతో కంటికి కనిపించని వాటిని కనుక్కోవచ్చా... అసలు గణితం అంటే ఏమిటి

ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు