LIVE: ఇంకా థాయ్‌లాండ్‌ గుహలోనే 9 మంది..కాసేపట్లో ‘హై రిస్క్ ఆపరేషన్‌’

 • 9 జూలై 2018
బాలురు Image copyright Facebook/katol

థాయ్‌లాండ్ గుహలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు 'హై రిస్క్ ఆపరేషన్‌' కాసేపట్లో మళ్లీ ప్రారంభంకాబోతోంది. గుహలో చిక్కుకున్న 13మందిలో ఇప్పటి వరకు నలుగుర్ని క్షేమంగా బయటి తీసుకొచ్చారు. ఇంకా తొమ్మిది మంది గుహలోనే ఉన్నారు.

ఆక్సిజన్ ట్యాంకులు మార్చేందుకు గత రాత్రి రెస్క్యూ ఆపరేషన్ నిలిపేశారు. కాసేపట్లో మళ్లీ సహాయ చర్యలు మొదలుకానున్నాయి.

థాయ్‌లాండ్‌లోని గుహలో 16 రోజులుగా చిక్కుకున్న ఫుట్‌బాల్ ఆటగాళ్ల బృందంలోని నలుగురిని రెస్క్యూ టీం నిన్న క్షేమంగా బయటకు తీసుకొచ్చింది.

మళ్లీ గుహ నుంచి బాలురిని బయటకు తీసుకురావాలంటే 10 గంటల సన్నద్ధత అవసరమని అందువల్ల తాత్కాలికంగా రెస్క్యూని నిలిపివేశామని అధికారులు చెప్పారు.

రాత్రి ఆక్సిజన్ ట్యాంకులు మార్చారు. రెస్క్యూ ఆపరేషన్ కాసేపట్లో మళ్లీ మొదలుకాబోతోంది.

థాయ్‌లాండ్ రెస్క్యూ ఆపరేషన్‌కి సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ పేజీ ఇది.

ఆదివారం రెస్క్యూ ఆపరేషన్ జరిగిన తీరు

 • ఇప్పటి వరకు నలుగురిని బయటకు తీసుకొచ్చారు
 • మొదట బలహీనంగా ఉన్నవారిని బయటకు తెస్తున్నారు
 • స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 10 గంటలకు సహాయ బృందాలు గుహలోకి ప్రవేశించాయి

19.34 మొత్తం 90 మంది గజఈతగాళ్లు రెస్క్యూ ఆపరేషన్లో పాలుపంచుకుంటున్నారు.

19.16 గుహ వద్ద నుంచి ఆస్పత్రికి బయల్దేరిన మరో అంబులెన్స్

ఆస్పత్రి వద్దకు వచ్చిన అంబులెన్సులు

 • బీబీసీ ప్రతినిధి నిక్ బేక్ పై ఫొటోను ట్వీట్ చేశారు. ఇది చియాంగ్‌ రాయ్ వద్ద ఆస్పత్రి ఫొటో. ఇక్కడకు గుహ నుంచి బయల్దేరిన రెండు అంబులెన్స్‌లు వచ్చాయి.

ఇంతకుముందు ఎవరైనా తప్పిపోయారా..?

 • ఇంతకుముందు కూడా ఈ గుహలో కొందరు తప్పిపోయారని స్థానికులు చెప్తున్నారు. 1986లో ఓ విదేశీ పర్యటకుడు గుహలో తప్పిపోయాడని.. ఏడు రోజుల తరువాత ఆయన్ను సురక్షితంగా రక్షించారని స్థానికులు చెబుతున్నారు. అయితే, అప్పుడు వర్షాలేమీ పడలేదని గుర్తు చేస్తున్నారు.
 • ఆ తరువాత 2016 ఆగస్టులో మెఫాలువాంగ్ యూనివర్సిటీకి చెందిన సుథిరోజ్ అనే మాజీ ప్రొఫెసర్ ఈ గుహలో ధ్యానం చేసుకోవడానికి వెళ్లి తప్పిపోయారు. ఆయన కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. మూణ్నెళ్ల తరువాత ఆయనే బయటకొచ్చారని స్థానిక ప్రసారమాధ్యమాల రిపోర్టులు చెప్తున్నాయి.
Image copyright Reuters

18.49 గుహలపై స్థానికంగా ఎన్నో కథలు

 • 'థామ్ లువాంగ్ ఖున్ నుమ్ నాంగ్ నాన్' గుహ గురించి స్థానికంగా ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అసలు దానికా పేరు ఎందుకు వచ్చిందన్నది కూడా స్థానికులు కథలుకథలుగా చెబుతుంటారు.
 • 'థామ్ లువాంగ్ ఖున్ నుమ్ నాంగ్ నాన్' అంటే... నదుల జన్మస్థలమైన పర్వతాన ఒక గొప్ప మహిళ నిద్రిస్తున్న గుహ అని అర్థం. దీని వెనుక ఓ కథ ఉందని చెప్తారు.
Image copyright EPA
చిత్రం శీర్షిక గుహ సమీపంలో అంబులెన్స్
 • చియాంగ్ రూంగ్ నగరానికి(ప్రస్తుతం దక్షిణ చైనాలో ఉన్న జింగాంగ్ కావొచ్చు) చెందిన రాకుమారి ఓ అశ్వికుడి కారణంగా గర్భం దాల్చుతుంది. ఆ సంగతి తండ్రికి తెలిస్తే తమ ఇద్దరినీ చంపేస్తారన్న భయంతో ఆమె ప్రియుడితో కలిసి నగరాన్ని వదిలి దూరంగా పారిపోతుంది. అక్కడ ఆమె ప్రియుడు ఆమెను ఒక రాతిపై కూర్చోబెట్టి తినడానికి ఏమైనా తేవడానికి వెళ్తాడు. అంతలో రాకుమారి తండ్రి తన మనుషులతో వచ్చి ఆమె ప్రియుడిని చంపేస్తాడు.
 • అతని కోసం చాలారోజుల పాటు ఎదురుచూసిన ఆమె చివరకు ఆయన్ను చంపేసుంటారని అర్థం చేసుకుని తాను కూడా కత్తితో పొడుచుకుని ప్రాణ త్యాగం చేస్తుంది. ఆమె శరీరం ఒక పర్వతంలా మారిపోగా, కత్తి గాయం వల్ల కారిన రక్తం నదిలా మారుతుంది. ఆ నదిని 'నామ్ మేసాయ్' లేదా సాయ్ నది అని స్థానికంగా పిలుస్తారు.

శుక్రవారం బాలలకు ఆక్సిజన్ ఇవ్వటానికి వెళ్లి చనిపోయిన ఈతగాడు

 • థాయ్ నౌకాదళానికి చెందిన మాజీ డైవర్ సమన్ గునన్, గుహలో చిక్కుకుపోయిన వారికి ఎయిర్ టాంక్స్ అందించడానికి వెళ్లారు. కానీ అక్కడి నుంచి తిరిగి వస్తున్నప్పుడు స్పృహతప్పారు.
 • "మాజీ సైనికుడు అయిన సమన్, సహాయ బృందాలకు సాయం చేయాలని తనకు తానుగా వచ్చాడు, రాత్రి 2 గంటల సమయంలో మృతి చెందాడు" అని చాంగ్ రాయ్ డిప్యూటీ గవర్నర్ చెప్పారు.
 • "సమన్ లోపల ఉన్న వారికి ఆక్సిజన్ అందించే పనిలో ఉన్నాడు. కానీ తిరిగి వస్తున్నప్పుడు అతడికే తగినంత ఆక్సిజన్ అందలేదు. దాంతో స్పృహతప్పాడు."
 • "గుహ లోపలి నుంచి వస్తున్న సమన్‌కు తనతో ఉన్న మరో డైవర్ ప్రథమ చికిత్స అందించి, బయటకి తీసుకొచ్చాడు. మేం అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లాం, కానీ ప్రాణాలు కాపాడలేకపోయాం" అని అధికారులు శుక్రవారం చెప్పారు.

18.41 ఏంటీ గుహల ప్రత్యేకత?

 • చియాంగ్ రాయ్‌ రాష్ట్రంలోని థామ్ లువాంగ్ గుహలు.. డోయ్ నాంగ్ నాన్ పర్వతం కింద ఉన్న చాలా సంక్లిష్టమైన గుహలు. ఎన్నో మలుపులు, చీలికలతో విస్తరించి దాదాపు పది కిలోమీటర్ల మేర విస్తరించిన గుహలివి. వర్షాకాలంలో ఈ గుహలు వరద నీటితో నిండిపోతాయి.

18.34 గుహ నుంచి నలుగురు బాలురు సురక్షితంగా బయటకు

 • ఈ మేరకు థాయ్ నేవీ అధికారులు తమ ఫేస్‌బుక్ పేజీలో వెల్లడించారు.

18.25 అసలు వీరు ఎలా చిక్కుకుపోయారు..?

Image copyright Facebook/katol
 • ఫుట్‌బాల్ టీం గుహలోకి వెళ్లిన తరువాత కుంభవృష్టి మొదలైంది. కొండలపై నుంచి వర్షం నీరు వరదలా ముంచెత్తి గుహ ముఖద్వారంలోంచి నీరు లోపలికి వచ్చేసింది. ఒక్కసారిగా నీరు నిండిపోవడంతో వీరంతా కాస్త ఎత్తయిన ప్రాంతానికి చేరి ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నంలో గుహలో ఇంకా లోపలికి వెళ్లి చిక్కుకుపోయారు.
 • ఈ 'థామ్ లువాంగ్' గుహ థాయిలాండ్‌లోనే అత్యంత పొడవైన గుహ. ఇది మొత్తం 10,316 మీటర్ల పొడవున ఉంది. అంటే సుమారు 10 కిలోమీటర్ల మేర ఈ గుహ ఉందన్నమాట.

18.20 ఈ బాలురు గుహలోకి ఎందుకు వెళ్లారు..?

 • జూన్ 23న ఉదయం ఈ బాలుర ఫుట్‌బాల్ జట్టు ప్రాక్టీస్ చేస్తున్న లైవ్ వీడియోను వారి అసిస్టెంట్ కోచ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఆ తరువాత మధ్యాహ్నం 3 గంటలకు గుహ ముఖద్వారం వద్ద 11 సైకిళ్లు ఉన్నట్లు 'థాయ్ లువాంగ్ -ఖున్నమ్ నాంగ్నాన్ నేషనల్ పార్క్' సిబ్బంది గుర్తించారు. ఫుట్‌బాల్ టీం కనపడకుండా పోయినట్లు రాత్రి 10 గంటలకు పోలీసులు తేల్చిన కొద్ది గంటల తరువాత రాత్రి ఒంటి గంట(జూన్ 24) నుంచి గాలింపు చర్యలు ప్రారంభించారు.
 • అయితే... తమ జట్టులోని ఒక సభ్యుడి పుట్టినరోజు కోసం ఆయన్ను సర్‌ప్రైజ్ చేసేలా పార్టీ ఏర్పాట్లు చేసేందుకు వీరంతా గుహలోకి వెళ్లినట్లు చెబుతున్నారు. వీరితోపాటు ఆ రోజు గుహలోకి వెళ్లని 'గేమ్' అనే అబ్బాయి దీనిపై స్థానిక మీడియాతో మాట్లాడుతూ... తాము ఇంతకుముందు మూడుసార్లు అందులోకి వెళ్లినట్లు చెప్పారు. అయితే, వర్షాకాలంలో ఎప్పుడూ వెళ్లలేదని ఆయన తెలిపారు.
 • ''నాకు ఆ రోజు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో నేను వెళ్లలేదు. మేం ఈ గుహలోకి ఎప్పుడు వెళ్లినా అవసరమైనవన్నీ తీసుకుని వెళ్తాం. ముందుగానే భోజనం చేసి అందులోకి వెళ్తాం, వెళ్లేటప్పుడు టార్చిలైట్లు మాతో పాటు తీసుకెళ్తాం. ఎవరైనా ఫిట్‌గా లేకపోతే వారిని తీసుకెళ్లం. శిక్షణలో భాగంగానే తామంతా అందులోకి వెళ్తుంటామని.. త్వరలో తమ టీం మేట్ ఒకరి పుట్టిన రోజు ఉండడంతో అక్కడ ఏర్పాట్లు చేసేందుకు వీరంతా వెళ్లారనుకుంటున్నాను'' అని గేమ్ చెప్పాడు.

18.15 మొదట బలహీనంగా ఉన్న బాలురు

 • బ్యాంకాక్‌కు చెందిన జర్నలిస్టు ఫ్లోరియన్ విటుల్‌స్కీ ఈ రక్షణ చర్యలకు సంబంధించిన పలు వివరాలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
 • ఆయన వెల్లడించిన వివరాల మేరకు.. గుహలో ఉన్న ఆస్ర్టేలియా వైద్యుడు మొదట బలహీనంగా ఉన్న బాలురిని బయటకు తీసుకురావాలని సూచించారు.

18.12 తొలుత నాలుగు నెలలు పడుతుందని అనుకున్నారు

 • సహాయ బృందాలు మొదట పిల్లలను కాపాడేందుకు నాలుగు నెలలపాటు వేచిచూడాలని, లేదా వారికి డైవింగ్ నేర్పించాలని భావించాయి. లేదంటే నీళ్లన్నీ బయటికి తోడేసేవరకూ ఆగాలని అనుకున్నారు.
 • అయితే తర్జనభర్జనల అనంతరం నిపుణులైన డైవర్ల సాయంతో వారిని బయటకు తీసుకువచ్చే ప్రయత్నం ప్రారంభించారు. పిల్లలు కూడా ఇందుకు సిద్ధంగా ఉన్నారని అధికారులు చెప్పారు. పిల్లలను, కోచ్‌ను రక్షించేందుకు మొత్తం 18 మంది డైవర్లు రంగంలోకి దిగారు.
 • డైవర్లు పిల్లలున్న చోటికి చేరి, అక్కడి నుంచి ఒక్కక్కరిని బయటకు తీసుకురావడానికి సుమారు 11 గంటల సమయం పట్టవచ్చని తొలుత అంచనా వేశారు.

18.09 బాలల ఆచూకీ ఇలా దొరికింది

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionపాతాళ గుహలో చిన్నారులు

17.59 త్వరలోనే నలుగురు బాలురు బయటకు

 • లెఫ్టినెంట్ జనరల్ కొంగ్‌చీఫ్ త్వరలోనే నలుగురు బాలురు బయటకు వస్తారని చెప్పారు.
 • ప్రస్తుతం వారు డైవర్లతో గుహలోని బేస్ క్యాంపు వద్ద ఉన్నారని చెప్పారు.
 • ఈ మేరకు వార్తా సంస్థ ఏఎఫ్‌పీ వెల్లడించింది.

17.51 హెలికాప్టర్లలో తరలింపు?

 • స్థానిక మీడియా రిపోర్టర్లు ఈ చిత్రాన్ని ట్వీట్ చేశారు. గుహ వద్ద ఇలా హెలికాప్టర్లు కనిపించాయి.

17.39 వీడియో.. గుహ నుంచి బయల్దేరిన రెండో అంబులెన్స్

17.37 గుహ దగ్గరి నుంచి రెండు అంబులెన్స్‌లు బయల్దేరి వెళ్లాయి. దీంతో ఇద్దరు బాలలను అక్కడి నుంచి తీసుకెళ్లి ఉంటారని భావిస్తున్నారు.

17.32 ఇద్దరు బాలలను బయటకు తీసుకొచ్చామన్న థాయ్ అధికారులు

అంతకు ముందు స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు సహాయ బృందాలు గుహలోకి ప్రవేశించాయని థాయ్‌లాండ్ ప్రభుత్వాధికారి ఒకరు వెల్లడించారు.

బాలల్ని బయటకు తీసుకొచ్చే ఈ ఆపరేషన్ గురించి వారి తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించారు.

ప్రస్తుతం గుహ దగ్గర పరిస్థితులు లోపలున్న వారిని కాపాడడానికి తగినట్టుగా ఉన్నాయని సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్న నారోంగ్సక్ తెలిపారు.

అంతకు ముందు ఏం జరిగింది

జూన్ 23న గుహను చూడ్డానికి వెళ్లిన థాయ్ పిల్లలు, వరద నీళ్లు రావడంతో తమ ఫుట్‌బాల్ కోచ్‌తో సహా లోపలే చిక్కుకుపోయారు.

పిల్లల ఆచూకీ గుర్తించినప్పటి నుంచి సహాయ బృందాలు వారికి ఆహారం, ఆక్సిజన్, మందులు సరఫరా చేస్తున్నాయి. వివిధ దేశాలకు చెందిన సహాయక దళాలు గుహలో ఉన్న వారందరినీ సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి.

"గుహ దగ్గర నీళ్లు, వాతావరణం అనుకూలంగా ఉండడంతోపాటు ప్రస్తుతం లోపలున్న పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నారు" అని చయాంగ్ రాయ్ ప్రావిన్స్ గవర్నర్ చెప్పారు.

"మేం ఏమేం చేయాలి అనే దానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది" అని ఆయన అన్నారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక గుహలో వారికి ఆహారం తీసుకు వెళ్తున్న డైవర్లు

తల్లిదండ్రులకు పిల్లల లేఖలు

శనివారం ఉదయం థాయ్ నేవీ సీల్స్ పిల్లలు తమ కుటుంబాకు రాసిన లేఖలను విడుదల చేసింది. లోపల ఉన్న వారికి ఆక్సిజన్ ట్యాంకులు సరఫరా చేస్తున్న ఈతగాళ్లు పిల్లల నుంచి ఈ లేఖలు తీసుకువచ్చారు

కొందరు పిల్లలు "డోంట్ వర్రీ, మేం బాగున్నాం" అని రాస్తే, ఒక బాలుడు "టీచర్, మాకు ఎక్కువ హోంవర్క్ ఇవ్వద్దు" అని లేఖ రాశాడు.

ఇంకొక బాలుడు "అమ్మ, నాన్న, అక్కయ్యా.. నా గురించి దిగులు పడకండి. అమ్మా, నాన్నా.. నేను బయటికొస్తే తినడానికి మూకతా( థాయ్ బార్బిక్యూ) తీసుకొస్తారా" అని అడిగాడు. వారిపై తన ప్రేమకు గుర్తుగా హార్ట్ సింబల్స్ కూడా వేశాడు.

పిల్లలను గుహ దగ్గరకు తీసుకెళ్లినందుకు తనను క్షమించాలని కోచ్ తల్లిదండ్రులను కోరాడు. కానీ చాలా మంది తల్లిదండ్రులు ఇందులో అతడి తప్పేం లేదని భావిస్తున్నారు.

కాపాడే ప్లాన్ ఏంటి?

గుహలో ఉన్న పిల్లలు, కోచ్ ప్రస్తుతం ఒక రాయిపైకి ఎక్కి పొడిగా ఉన్నారు. కానీ వర్షాలతో లోపలికి నీళ్లు పెరుగుతుండడంతో ఆ స్థలం 10 చదరపు మీటర్ల కంటే చిన్నగా అయిపోయే ప్రమాదం ఉంది.

గుహ లోపలికి వేసిన ఆక్సిజన్ ట్యూబు వల్ల అక్కడ తక్కువ స్థలం ఉన్నా, ఎక్కువ మంది గాలి పీల్చుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

పిల్లలకు ప్రమాదం లేకుండా లోపలి నీళ్లు బయటికి రావడానికి గుహ గోడలకు రంధ్రాలు వేస్తున్నారు.

చిత్రం శీర్షిక గుహ బయట పరిస్థితి అదుపు చేస్తున్న సైన్యం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు