థాయ్‌లాండ్ గుహ నుంచి సురక్షితంగా బయటపడ్డ ఎనిమిది మంది బాలలు.. ఇక మిగిలింది నలుగురే

 • 9 జూలై 2018
థాయ్‌ల్యాండ్, ఫుట్‌బాల్, పిల్లలు, గుహ Image copyright Getty Images

థాయ్‌‌లాండ్ గుహ నుంచి ఎనిమిది మంది బాలలు క్షేమంగా బయటపడ్డారని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న నేవీ సీల్స్ స్పష్టం చేసింది.

ఈ మేరకు ఎవరెవరిని కాపాడారో వారి పేర్లను తన అధికారిక ఫేస్ బుక్ పేజీలో బోర్స్1, బోర్స్ 2.. పేర్లతో ప్రకటించింది. పిల్లల అసలు పేర్లను బయటకు చెప్పకూడదనే ఉద్దేశంతో వారి ఫుట్‌బాల్ జట్టు పేరైన వైల్డ్ బోర్స్‌ను స్ఫురించేలా ఈ పేరు పెట్టినట్లు తెలిపింది.

కాగా, మిగిలిన నలుగురిని రక్షించేందుకు మంగళవారం కూడా సహాయక చర్యలు కొనసాగిస్తామని రెస్య్కూ సిబ్బంది తెలిపారు.

చియాంగ్ రాయ్ ఆస్పత్రి‌లో చికిత్స పొందుతున్న నలుగురు బాలురు బాగా ఆకలితో ఉండటంతో ఫ్రైడ్ రైస్ కావాలని అడిగారని రెస్క్యూ టీం హెడ్ నరోంగ్‌సాక్ ఓసటర్నకోర్న్ తెలిపారు.

ఆస్పత్రి గ్లాస్ డోర్‌ల నుంచి బాలురను చూడటానికి తల్లిదండ్రులకు అనుమతి ఇచ్చామని ఆస్పత్రి సిబ్బంది వెల్లడించారు.

చికిత్స పొందుతున్న నలుగురి పేర్లను వెల్లడించడం సరికాదని అధికారులు తెలిపారు.

6.40 PM మిగిలిన నలుగురు బాలలను, కోచ్‌ను కాపాడేందుకు మంగళవారం సహాయక చర్యలు కొనసాగిస్తామని రెస్క్యూ సిబ్బంది తెలిపారు.

2.00 PM థాయ్‌లాండ్ గుహ దగ్గర మళ్లీ సహాయక చర్యలు ప్రారంభించారు.

1.00 PM థాయ్‌లాండ్‌ గుహలో చిక్కుకున్న మిగతా వారిని కాపాడేందుకు గజ ఈతగాళ్లు సిద్ధంగా ఉన్నారు.

Image copyright Getty Images

ఆదివారం సహాయక బృందాలు నలుగురు పిల్లలను బయటికి తీసుకొచ్చాయి.

గుహ నుంచి పిల్లలను తీసుకొచ్చే దారిలో ఆక్సిజన్ ట్యాంకులు మార్చడం పూర్తయింది.

శనివారం రాత్రి రెస్క్యూ ఆపరేషన్ నిలిపేశారు. సుమారు 10 గంటల పాటు శ్రమించి ఆక్సిజన్ ట్యాంకులు అమర్చారు.

Image copyright AFP/royal thai navy

చిక్కుకున్న వారెవరు? గుహలో ఉన్నప్పుడు వాళ్లేమన్నారు?

 • చానిన్ విబుల్ రుంగ్రూంగ్, 11 ( నిక్‌నేమ్: టైటాన్) - ఏడేళ్లకే ఫుట్‌బాల్ ఆడటం మొదలు పెట్టాడు.
 • పనుమాస్ సంగ్దీ, 13 (నిక్‌నేమ్:మిగ్)- 'నేవీ సీల్స్' మమ్మల్ని బాగా చూసుకుంటున్నారని తల్లిదండ్రులకు లేఖ రాశాడు.
 • దుగన్పేట్ ప్రొంటెప్, 13 (నిక్‌నేమ్: డోమ్) - వైల్డ్ బోర్స్ జట్టుకు కెప్టెన్, థాయ్‌లోని చాలా జట్లకు నాయకత్వం వహించాడు.
 • సోంపెంగ్ జాయివాంగ్ 13 (నిక్‌నేమ్: పోంగ్) - థాయ్ జాతీయ జట్టుకు ఆడాలనేది ఇతని లక్ష్యం అని తెలిసింది.
 • మొంగోల్ బూనియమ్, 13 (నిక్‌నేమ్:మార్క్) - చాలా మంచి విద్యార్థి, అందరిని గౌరవిస్తాడని ఇతని టీచర్లు తెలిపారు.
 • నట్ట్వాట్ టాక్మోరాంగ్, 14 (నిక్‌నేమ్: టెర్న్) - నా గురించి బాధపడొద్దని తల్లిదండ్రులకు లేఖ రాశాడు
 • ఎక్రాట్ వోంగ్‌సుక్చాన్, 14 (నిక్‌నేమ్: బేవ్) - గుహ నుంచి బయటకు వచ్చాక తప్పకుండా నీకు సహాయం చేస్తానని అమ్మకు మాట ఇచ్చాడు.
 • అబ్దుల్ శామన్, 14 - ఉత్తర థాయ్‌లాండ్‌లో నిర్వహించిన వాలీబాల్ టోర్నీలో రెండో స్థానం సాధించిన జట్టులో ఇతను సభ్యుడు.
 • ప్రజాక్ సుతమ్ 15 (నిక్‌నేమ్:నోట్) - నెమ్మదస్తుడు, మంచి కుర్రాడని ఇతని ఫ్యామిలీ ఫ్రెండ్స్ చెప్పారు.
 • పిపట్ ఫో, 15 (నిక్‌నేమ్:నిక్ ) - గుహ నుంచి బయటకు వచ్చాక అమ్మానాన్నలను రెస్టారెంట్‌కు తీసుకెళ్తానని లేఖ రాశాడు.
 • పోర్నిచాయి కమ్లూంగ్ 16 (నిక్‌నేమ్:టీ ) - ''బాధ పడకండి, నేను బాగానే ఉన్నాను'' అని పేరెంట్స్‌కు లేఖ రాశాడు.
 • పీరాపట్ సోంమియాంజయ్ , 17 (నిక్‌నేమ్: నైట్) - గుహలో చిక్కుకున్న రోజే ఇతని పుట్టిన రోజు. ''మా అబ్బాయి బయటకు వచ్చే వరకు బర్త్ డే పార్టీ వాయిదా వేస్తున్నాం'' అని ఇతని తల్లిదండ్రులు తెలిపారు.
 • సహాయక కోచ్ ఎక్కాపల్ చాంట్వాంగ్ (నిక్‌నేమ్: ఆకే), 25 - గుహలో చిక్కుకున్న నేపథ్యంలో క్షమించమని తల్లిదండ్రులకు లేఖ రాశాడు. అయితే, దీనికి నిన్ను నిందించమని వారు జవాబిచ్చారు.

గుహలో ఎలా చిక్కుకున్నారు?

గుహ లోపల వారం కిందట బ్రిటీష్ డైవర్లకు ఈ బాలురు కనిపించారు. గుహ బయటి నుంచి వీరు చిక్కుకపోయిన ప్రాంతం దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది.

వీరంతా 11 నుంచి 17 ఏళ్ల మధ్యనున్నవారే. వైల్డ్ బోర్స్ అనే ఫుట్ బాల్ క్లబ్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

విహారయాత్రలో భాగంగా కోచ్‌తో కలసి ఈ గుహకు వచ్చారు. గుహలో చిక్కుకున్న వీరిని కనిపెట్టడానికి రెస్క్యూ టీంకు తొమ్మిది రోజులు పట్టింది.

Image copyright AFP

"గుహలోకి వెళ్లే దారి అంతటా ఆక్సిజన్ ట్యాంకులను అమర్చిన తర్వాత డైవర్లు మళ్లీ సహాయ కార్యక్రమాలు ప్రారంభిస్తారు" అని చాంగ్ రాయ్ గవర్నర్ ఆదివారం తెలిపారు.

చీకటిలో నీళ్లు నిండిన దారుల్లోంచి గుహ ప్రవేశ మార్గం వైపు ఎలా రావాలో డైవర్లు పిల్లలకు చూపిస్తున్నారు. నడుస్తూ గుహ దాటేలా వారిని సన్నద్ధం చేశారు.

వర్షం ఆగితే, అనుకున్న సమయం కంటే ముందే 'హై రిస్క్ ఆపరేషన్' ప్రారంభించాలని సహాయ బృందాలు భావిస్తున్నాయి.

సహాయ కార్యక్రమాల మొదటి దశను కూడా అధికారులు కాస్త ముందే ప్రారంభించారు.

Image copyright EPA

పిల్లల్ని ఎలా తీసుకొస్తున్నారు

90 మంది గజ ఈతగాళ్లు గుహలో వారిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. వీరిలో థాయ్‌లాండ్ డైవర్లు 40 మంది, ఇతర దేశాలకు చెందిన డైవర్లు 50 మంది ఉన్నారు.

గుహలో కఠినమైన దారుల్లో పిల్లలు చిక్కుకున్న ప్రాంతానికి వెళ్లి వారిని మళ్లీ ప్రవేశ మార్గం వరకూ తీసుకురావడం ఎంతో అనుభవం ఉన్న ఈతగాళ్లకు కూడా కష్టం అవుతోంది.

ఈ సహాయ కార్యక్రమాలలో భాగంగా గుహలో నడవడంతోపాటు, ఎక్కడం, గైడింగ్ రోప్స్ ద్వారా ఈదడం చేయాల్సి వస్తోంది.

రెస్పిరేటర్ల బదులు డైవర్లు అందరూ ఫుల్ ఫేస్ మాస్కులు వేసుకున్నారు. ఒక్కో బాలుడిని ఇద్దరు డైవర్లు తీసుకొస్తున్నారు. పిల్లాడికి అందిస్తున్న ఆక్సిజన్ ట్యాంకును కూడా డైవర్లే మోస్తున్నారు.

గుహ నుంచి బయటికి వస్తున్నప్పుడు సగం దూరంలో ఉన్న టీ-జంక్షన్ అనే ప్రాంతం దగ్గర డైవర్లకు కష్టంగా ఉంటోంది. అది చాలా ఇరుగ్గా ఉండడంతో డైవర్లు తమ ఆక్సిజన్ ట్యాంకులు తీసి దాన్ని దాటాల్సి వస్తోంది.

ఆ గుహలోనే ఉన్న చాంబర్ 3 అనే ప్రాంతం నుంచి డైవర్లు సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. లోపలి నుంచి తీసుకొచ్చిన వారు, అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత చాంగ్ రాయ్‌లోని ఉన్న ఆస్పత్రికి పంపుతున్నారు.

Image copyright Getty Images

మొదటి దశ సహాయ కార్యక్రమాలు

 • స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం 10.00 గంటలకు సహాయ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
 • మొదట ఆరుగురిని గుహ నుంచి బయటకు తీసుకొచ్చినట్లు స్థానిక మీడియా, పలు వార్తా సంస్థలు వెల్లడించాయి.
 • అయితే అధికారులు మాత్రం ఆదివారం సాయంత్రానికి నలుగురిని బయటకు తెచ్చామని చెప్పారు.
 • మొదట బలహీనంగా ఉన్న వారిని బయటకు తీసుకొస్తున్నారు
 • ఆదివారం రెండు అంబులెన్సుల్లో నలుగురు పిల్లలను ఆస్పత్రికి తీసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)