ఓజోన్ డే: చైనా కారణంగానే ఓజోన్ రంథ్రం పెద్దదవుతోందా

  • మాట్ మెక్‌గ్రాత్
  • బీబీసీ ప్రతినిధి

చైనాలో ఇళ్ల ఇన్సులేషన్‌లో ఉపయోగిస్తున్న రసాయనమే ఓజోన్ పొరను తీవ్రంగా దెబ్బ తీస్తోందని భావిస్తున్నారు.

చైనాలో సీఎఫ్‌సీ-11ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారని పర్యావరణ పరిశోధన సంస్థ (ఈఐఏ) 2018లో గుర్తించింది. నిజానికి ఈ గ్యాస్‌ను 2010లోనే నిషేధించారు.

కరెంటు బిల్లులను తగ్గించడానికి ఇన్సులేషన్‌లో ఉపయోగించే పాలీయురేథేన్ ఫోమ్ తయారీలో సీఎఫ్‌సీ-11 సమర్థవంతమైన 'బ్లోయింగ్ ఏజెంట్'గా ఉపయోగపడుతుంది. అందుకే చైనా గృహ నిర్మాణ పరిశ్రమలో దీనిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

రసాయన ఆయుధాలకు ఉపయోగపడే యురేనియంను శుద్ధి చేయడంలో కూడా దీనిని ఉపయోగిస్తున్నట్లు ఇటీవల కొన్ని వదంతులు వినవస్తున్నాయి.

అయితే ఇన్సులేషన్ కారణంగానే ఓజోన్ రంథ్రం పెద్దది అవుతోందన్నది మాత్రం స్పష్టం.

ఫొటో క్యాప్షన్,

నిషేధిత సీఎఫ్‌సీ-11 బ్యారెల్స్

ఈఐఏ ఏజెంట్లు చైనాలోని 10 ప్రావిన్స్‌లలో ఆ ఫోమ్‌ను తయారు చేసే యూనిట్లను సందర్శించారు. అక్కడ పాలీయురేథేన్ ఇన్సులేషన్ తయారీలో సీఎఫ్‌సీ-11ను విస్తృతంగా ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు.

మొత్తం 70 శాతం పాలీయురేథేన్‌ను ఈ గ్యాస్ ద్వారానే తయారు చేస్తున్నారు. దీనికి కారణం దాని నాణ్యత, తక్కువ ధరకే లభించడం.

అయితే సీఎఫ్‌సీ-11 వినియోగాన్ని నియంత్రించడంలో చైనా అధికారులు ఘోరంగా విఫలమయ్యారు.

''కొన్ని సంస్థలు చాలా బహిరంగంగా సీఎఫ్‌సీ-11ను ఉపయోగించడం చూసి మేం నివ్వెరపోయాం'' అని ఈఐఏ ప్రతినిధి అవిప్సా మహాపాత్ర బీబీసీకి తెలిపారు.

ఫొటో క్యాప్షన్,

చైనాలోని ఈ పరిశ్రమకు చెందిన 99శాతం ఉత్పత్తులలో సీఎఫ్‌సీ-11 ఉన్నట్లు గుర్తించారు

ఎందుకు అంత ప్రాముఖ్యం?

మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పాలీయురేథేన్ ఫోమ్ ఉత్పత్తిలో చైనాలో ఉత్పత్తి అవుతున్నదే మూడో వంతు ఉంది. అందువల్ల సీఎఫ్‌సీ-11ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఓజోన్‌కు పడిన రంథ్రాన్ని పూడ్చేయడానికి పట్టే సమయం మరో దశాబ్దం లేదా అంతకన్నా ఎక్కువ కాలం పెరుగుతుంది.

ఓజోన్ పొరతో పాటు సీఎఫ్‌సీ-11 కారణంగా వాతావరణం వేడెక్కే అవకాశం కూడా ఉంది. దానిని ఇలాగే ఉపయోగిస్తే, దాని వల్ల వెలువడే వేడి ప్రతి సంవత్సరం బొగ్గుతో నడిచే 16 పవర్ స్టేషన్ల నుంచి వెలువడే కార్బన్ డైయాక్సైడ్‌తో సమానంగా ఉంటుంది.

మరి దీని గురించి ఏం చేయొచ్చు?

ఓజోన్‌కు రంధ్రాన్ని చేసే ఉత్పత్తులను నిషేధించే మాంట్రియల్ ప్రొటోకాల్‌లో చైనా కూడా సభ్యదేశమే. ఆ ప్రొటోకాల్‌ను ఉల్లంఘించిన దేశాలపై వాణిజ్యపరమైన ఆంక్షలను ఉపయోగించవచ్చు.

కానీ ప్రొటోకాల్‌పై సంతకాలు చేసిన నాటి నుంచి ఎన్నడూ ఏ దేశంపై అలాంటి ఆంక్షలను విధించలేదు. అయితే నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటేనే పరిస్థితి మెరుగుపడుతుందని ఈఐఏకు చెందిన మహాపాత్ర అన్నారు.

ఫొటో క్యాప్షన్,

ఆర్కిటిక్ వద్ద ఓజోన్ నమూనా సేకరణ

ఓజోన్ పొర అంటే ఏమిటి? దాని ప్రాధాన్యం ఏమిటి?

భూ ఉపరితలంపై 15 నుంచి 30 కిలోమీటర్లపై ఓజోన్ పొర ఏర్పడి ఉంటుంది. ఈ పొర అల్ట్రావయోలెట్ రేడియషన్ భూమిని చేరుకోవడాన్ని అడ్డుకుంటుంది. ఆ పొర చిరిగితే అల్ట్రావయోలెట్ కిరణాల కారణంగా స్కిన్ క్యాన్సర్, కళ్లు దెబ్బ తినే అవకాశం ఉంది. సముద్ర జీవాలు, పంటలూ దెబ్బ తింటాయి.

ఒక క్లోరిన్ పరమాణువు లక్షకు పైగా ఓజోన్ అణువులను నాశనం చేస్తుంది.

మాంట్రియల్ ప్రొటోకాల్‌లో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఓజోన్ పొరను నాశనం చేసే గ్యాస్‌ల వినియోగాన్ని అరికట్టడానికి ఎక్కువ సమయం ఇచ్చారు. చైనా, ఇతర దేశాలు 2010 నాటికి అలాంటి గ్యాస్‌లను నిషేధించాలని సూచించారు. కానీ ఆ నియమాలను కఠినంగా అమలు చేయలేదని ఈఐఏ పరిశోధనలో తేలింది.

2014లో పరిశోధకులు ఓజోన్ పొరలో ఉన్న రంధ్రం పరిణామం తగ్గుతోందని గుర్తించారు. ఒక దశాబ్ద కాలంలో అది మొత్తం పూడిపోతుందని వారు భావించారు.

కానీ 2015 సెప్టెంబర్ నాటికి అది పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి కారణం చైనాలో సీఎఫ్‌సీని విస్తృతంగా వినియోగించడమే ఇప్పుడు ఈఐఏ పరిశోధనలో తేలింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)