ఇథియోపియా - ఎరిత్రియాల మధ్య ముగిసిన యుద్ధం.. ఇరవయ్యేళ్ల వివాదానికి తెర

  • 9 జూలై 2018
ఇథియోపియా ప్రధానిని చూసి చేతులూపుతున్న ఎరిత్రియా ప్రజలు Image copyright @Fitsumaregaa
చిత్రం శీర్షిక చేతులూపుతూ ఇథియోపియా ప్రధానికి హాయ్ చెబుతున్న ఎరిత్రియా ప్రజలు

ఇథియోపియా, ఎరిత్రియాల మధ్య సుదీర్ఘకాలంగా సాగుతున్న యుద్ధం ముగిసింది. సరిహద్దు విషయంలో ఇరవయ్యేళ్లుగా ఉన్న వివాదానికి ముగింపు పలుకుతూ ఇరు దేశాల అధ్యక్షులు అంగీకారానికి వస్తూ ఒక సంయుక్త ఒడంబడికపై సంతకం చేశారు.

రెండు దేశాల మధ్య వాణిజ్య, దౌత్య సంబంధాల పునరుద్ధరణకూ అంగీకరించారు.

ఎరిత్రియా అధ్యక్షుడు ఇసాయియాస్ అఫెవెర్కి, ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్‌ల మధ్య ఎరిత్రియా రాజధాని అస్మారాలో ఈ కీలక సమావేశం జరిగింది.

ఈ రెండు దేశాల అధినేతలు భేటీ కావడం గత రెండు దశాబ్దాల్లో ఇదే తొలిసారి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్, ఎరిత్రియా అధ్యక్షుడు ఇసాయియాస్

ఎందుకీ యుద్ధం

సుదీర్ఘ సంగ్రామం తరువాత ఎరిత్రియా 1993లో ఇథియోపియా నుంచి స్వాతంత్ర్యం పొందింది.

అయితే... ఆ తర్వాత అయిదేళ్లకే రెండు దేశాల మధ్య వివాదం మొదలైంది. బాద్మి పట్టణం సహా వివిధ సరిహద్దు ప్రాంతాల విషయంలో ఈ వివాదం మొదలైంది.

1998 నుంచి 2000 సంవత్సరం మధ్య రెండేళ్ల పాటు భీకరంగా సాగిన పోరులో వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

సమస్య పరిష్కారం కోసం చర్చలు జరిగి కొన్ని ప్రాంతాలను ఎరిత్రియాకు ఇచ్చేలా 2002లో 'ఎరిత్రియా-ఇథియోపియా బోర్డర్ కమిషన్' ఆదేశాలిచ్చింది. అయితే, ఇథియోపియా దానికి అంగీకరించలేదు. వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల నుంచి తన బలగాలను ఏమాత్రం ఉపసంహరించలేదు. అప్పటి నుంచి యుద్ధం జరుగుతూనే ఉంది.

ఈ యుద్ధం కారణంగా ఎరిత్రియా బాగా నష్టపోయింది. చిన్నదేశం కావడంతో నిత్యం సాగుతున్న యుద్ధం కోసం దేశంలో నిర్బంధ సైనిక శిక్షణ అమలు చేసింది. దీంతో అనేకమంది ఎరిత్రియాను విడిచి వెళ్లిపోయారు. వేలాది మంది యుద్ధంలో మృత్యువాతపడ్డారు.

Image copyright AFP

ఎలా పరిష్కారమైంది..

ఇథియోపియన్ పీపుల్స్ రివల్యూషనరీ డెమొక్రటిక్ ఫ్రంట్‌కు చెందిన అబియ్ అహ్మద్ ఈ ఏడాది ఏప్రిల్‌లో అధికారం చేపట్టారు.

అక్కడికి కొద్ది రోజుల్లోనే ఆయన 2002 నాటి 'ఎరిత్రియా-ఇథియోపియా బోర్డర్ కమిషన్' ఆదేశాలను అమలు చేస్తామంటూ ఎరిత్రియాకు ప్రతిపాదించారు. బాద్మి పట్టణాన్ని ఎరిత్రియాకు ఇచ్చేందుకు అంగీకరించారు.

అంతకుముందు కూడా పలువురు అధ్యక్షులు ఆ ఒప్పందాన్ని అంగీకరిస్తామని చెప్పినా అమలు మాత్రం చేయలేదు.

అందుకు భిన్నంగా అబియ్ ఎరిత్రియాతో శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లారు.

ఈ ప్రకటనకు ముందు ఇథియోపియా జైళ్లలో మగ్గుతున్న వేలాది మంది ఎరిత్రియా రాజకీయ నేతలు, నిరసకారులను, యుద్ధ ఖైదీలను విడుదల చేశారు.

ఆర్థిక సంస్కరణలు ప్రకటించి ఎరిత్రియాకు ఉపశమనం కలిగించారు.

అనంతరం తాజాగా జరిగిన సమావేశంలో రెండు దేశాలు సరిహద్దు సమస్యను పరిష్కరించుకుని యుద్ధానికి ముగింపు పలికాయి.

Image copyright fitsum arega/twitter

ఇకపై భాయీభాయీ

* తాజా ఒడంబడికతో రెండు దేశాలూ పరస్పర సహకారంతో సాగనున్నాయి.

* ఆయా దేశాల రాయబార కార్యాలయాలను తిరిగి తెరవనున్నారు.

* సముద్ర తీరం లేని ఇథియోపియా ఇకపై ఎరిత్రియా ఓడరేవులను రవాణా కోసం ఉపయోగించుకోనుంది.

* రెండు దేశాల మధ్య విమాన సేవలు పునరుద్ధరిస్తారు.

* ఇంతవరకు నిలిచిపోయిన టెలిఫోన్ సేవలనూ పునరుద్ధరిస్తారు.

Image copyright AFP

ఎప్పుడేం జరిగింది..

1993 మే 24: ఇథియోపియా నుంచి ఎరిత్రియా స్వాతంత్ర్యం పొందింది.

1998 మే 6: సరిహద్దు సమస్య రాజుకుని యుద్ధం ఆరంభమైంది.

2000 డిసెంబరు 12: శాంతి ఒప్పందం

2002 ఏప్రిల్ 13: వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలను ఎరిత్రియాకు కేటాయిస్తూ 'ఎరిత్రియా-ఇథియోపియా బోర్డర్ కమిషన్' ఆదేశాలు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం