థాయ్‌లాండ్‌: గుహలో బాలురు అందరూ సురక్షితం

  • 10 జూలై 2018
థాయ్ గుహలో బాలలు

థాయ్‌లాండ్‌ గుహలో చిక్కుకున్న బాలురు అందరూ సురక్షితంగా బయటపడ్డారు. మూడు రోజుల ఆపరేషన్ తర్వాత మొత్తం 12 మంది బాలురు, ఓ కోచ్‌ని బయటకు తీసుకొచ్చామని థాయ్ నేవీ సీల్స్ వెల్లడించాయి.

గుహలో ఉన్న 13 మందినీ బయటకు తీసుకొచ్చామని నలుగురు డైవర్లు గుహ నుంచి బయటకు వస్తున్నారని థాయ్ నేవీ సీల్స్ వెల్లడించాయి.

సహాయక చర్యలు చివరి దశకు చేరుకున్నాయి. సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న నలుగురు ఈతగాళ్లు, ఒక డాక్టర్ ఇంకా గుహలోనే ఉండిపోయారు. వారు బయటకు రాగానే ఆపరేషన్ ముగుస్తుంది.

‘‘నలుగురు ఈతగాళ్ల కోసం వేచి చూస్తున్నాం’’ అని నేవీ అధికారులు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

హాస్పిటల్ వద్ద ఉన్న ప్రజల ముఖాల్లో ఆనందం

‘‘అందరూ సురక్షితంగా బయటకు రావడం.. మాకు ఎప్పటికీ గుర్తిండిపోయే విషయం. ఈ క్షణాన్ని నమ్మలేకపోతున్నాం..’’ అని, పిల్లలు చికిత్స పొందుతున్న హాస్పిటల్ వద్ద గుమికూడిన స్థానికులు చెబుతున్నారు.

మొత్తం 13 మంది సురక్షితంగా బయటకు వచ్చారన్న వార్తతో.. ప్రజలు ఆనందోత్సాహాల్లో మునిగారు. పాటలు పాడుతూ, డాన్స్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సంబరాలను థాయ్‌లాండ్ మీడియా ప్రసారం చేసింది.

డైవర్ సుమాన్ గునాన్ స్మృతిలో..

థాయ్‌లాండ్ నేవీ డైవర్ సమన్ గునన్ ఓ చిన్న ఉద్యోగి. పిల్లలను కాపాడే సహాయక చర్యల్లో పాల్గొంటూ జూలై 6న ఆయన మరణించారు. గుహలో ఆక్సిజన్ సరఫరా చేయడానికి వెళ్లిన సమన్, తనకు ఆక్సిజన్ అందకపోవడంతో మరణించారు. ఆయన కుటుంబంతో బీబీసీ మాట్లాడింది.

‘‘ఆయన్ను నేను చాలా ప్రేమించాను. ప్రతిరోజూ మధ్యాహ్నం.. భోజనం చేశారో లేదోనని ఒకరినొకరు కనుక్కునేవాళ్లం. సమన్.. నీకొక విషయం చెప్పాలి. అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికీ నువ్వే నా హీరో!" అని సమన్ భార్య అన్నారు.

ఇదో ఆనందభరిత క్షణం : ట్రంప్

సహాయక చర్యల్లో పాల్గొన్న థాయ్‌లాండ్ నేవీ సీల్స్‌కు, సహాయక చర్యల్లో పాల్గొన్న ఇతరులకు అమెరికా దేశం తరఫున అభినందనలు తెలియజేస్తున్నా. ఆ భయంకరమైన గుహ నుంచి కోచ్ సహా 12 మంది పిల్లలను సురక్షితంగా బయటకు తేవడం.. నిజంగా ఇదో ఆనందకరమైన క్షణం. గ్రేట్ జాబ్.. అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ చేశారు.

ఇలా విజయవంతంగా బాలురను బయటకు తీసుకురావడంపై బ్రిటన్ ప్రధాని థెరెసా మే ట్వీట్ చేశారు.

‘ఇదంతా మాయనా, లేక శాస్త్ర విజ్ఞానమా అర్థం కావడం లేదు. కానీ గుహలో చిక్కుకున్న 13 మందీ సురక్షితంగా బయటకు వచ్చారు’ అని అధికారులు తెలిపారు. కానీ సహాయక చర్యల్లో పాల్గొన్న నలుగురు ఈతగాళ్ల గురించి ఇంకా పూర్తి సమాచారం అందలేదని అధికారులు అన్నారు.

‘‘చాలా ఆశ్చర్యంగా ఉంది. గుహలో చిక్కుకున్న కోచ్, 12 మంది పిల్లల మనోధైర్యం, సహాయక చర్యల్లో పాల్గొన్నవారి ధృడ సంకల్పం అద్భుతం’’ అని జర్మన్ ఛాన్సెలర్ ఏంజెలా మార్కెల్ అధికారిక ప్రతినిధి ట్వీట్ చేశారు.

సురక్షితంగా బయటపడ్డ వారిలో చాలా మంది మాంఛెస్టర్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ అభిమానులని అంటారు. ఈ విషయం తెలుసుకున్న ఫుట్‌బాల్ క్లబ్ వీరిని ఓల్డ్ ట్రాన్స్‌ఫోర్డ్ స్టేడియంకు రావాలంటూ ఆహ్వానం పలికింది.

’’కోచ్ సహా గుహలో చిక్కుకున్న 12 మంది పిల్లలు సురక్షితంగా బయటపడటం చాలా ఆనందంగా ఉంది. కోచ్, పిల్లలు, సహాయక చర్యల్లో పాల్గొన్నవారు కూడా రానున్న ఫుట్‌బాల్ సీజన్‌లో ఓల్డ్ ట్రాన్స్‌ఫోర్డ్ స్టేడియంకు రావాలని ఆహ్వానిస్తున్నాం’’ అని ఫుట్‌బాల్ క్లబ్.. తన ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్ చేసింది.

ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టుకే థాయ్‌లాండ్ మద్దతు : థాయ్ పౌరుడు

‘‘గుహలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడంలో బ్రిటన్ ఈతగాళ్లు కీలక పాత్ర పోషించారు. అందుకు కృతజ్ఞతగా.. రేపు జరగబోయే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్ ప్రజలు ఇంగ్లండ్‌కు మద్దతు తెలుపుతారు’’ అని.. పిల్లలు చికిత్స పొందుతున్న హాస్పిటల్ బయట ఓ థాయ్ పౌరుడు మా ప్రతినిధి హోవర్డ్ జాన్సన్‌తో అన్నారు.

Image copyright howardrjohnson

‘ఫుట్‌బాల్ ఫైనల్ మ్యాచ్ వీరు చూడలేకపోవచ్చు’ : ఫీఫా

మాస్కోలో ఈ ఆదివారం జరగనున్న ఫీఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ఈ పిల్లలను ఫీఫా ఆహ్వానించింది. కానీ, రెండు వారాలకు పైగా ఆ చీకటి గుహలో గడపడంతో వీరి ఆరోగ్యం దెబ్బతింది.

ఈ పరిస్థితుల్లో వీరు ఫైనల్ మ్యాచ్ చూడటానికి మాస్కో రాలేరని థాయ్‌లాండ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ తెలిపినట్లు ఫీఫా నిర్వహకులు అన్నారు. అయితే.. వారి ఆరోగ్యం మెరుగుపడటమే తమకు ముఖ్యం అని, పిల్లలను కలిసేందుకు మరో అవకాశాన్ని వెతుకుతాం.. అని ఫీఫా తెలిపింది.

పిల్లల్ని ఎలా తీసుకొచ్చారు?

90 మంది గజ ఈతగాళ్లు గుహలో వారిని బయటకు తీసుకురావడానికి కృషి చేశారు.

వీరిలో థాయ్‌లాండ్ డైవర్లు 40 మంది, ఇతర దేశాలకు చెందిన డైవర్లు 50 మంది ఉన్నారు.

చీకటిలో నీళ్లు నిండిన దారుల్లోంచి గుహ ప్రవేశ మార్గం వైపు ఎలా రావాలో డైవర్లు పిల్లలకు చూపించారు.

నడుస్తూ గుహ దాటేలా వారిని సన్నద్ధం చేశారు.

గుహలో కఠినమైన దారుల్లోంచి పిల్లలు చిక్కుకున్న ప్రాంతానికి వెళ్లి వారిని మళ్లీ ప్రవేశ మార్గం వరకూ తీసుకురావడం ఎంతో అనుభవం ఉన్న ఈతగాళ్లకు కూడా కష్టమైంది.

సహాయ కార్యక్రమాలలో భాగంగా గుహలో నడవడంతోపాటు, పాకడం, గైడింగ్ రోప్స్ ద్వారా ఈదారు.

రెస్పిరేటర్ల బదులు డైవర్లు అందరూ ఫుల్ ఫేస్ మాస్కులు వేసుకున్నారు.

ఒక్కో బాలుడిని ఇద్దరు డైవర్లు కలిసి తీసుకొచ్చారు.

పిల్లాడికి అందిస్తున్న ఆక్సిజన్ ట్యాంకును కూడా డైవర్లే మోశారు.

గుహ నుంచి బయటికి వస్తున్నప్పుడు సగం దూరంలో ఉన్న టీ-జంక్షన్ అనే ప్రాంతం దగ్గర డైవర్లకు కష్టంగా మారింది.

అది చాలా ఇరుగ్గా ఉండడంతో డైవర్లు తమ ఆక్సిజన్ ట్యాంకులు తీసి దాన్ని దాటాల్సి వచ్చింది.

ఆ గుహలోనే ఉన్న చాంబర్ 3 అనే ప్రాంతం నుంచి డైవర్లు సహాయ కార్యక్రమాలు కొనసాగించారు..

లోపలి నుంచి తీసుకొచ్చిన వారు, అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత చాంగ్ రాయ్‌లోని ఉన్న ఆస్పత్రికి పంపారు.

Image copyright AFP/royal thai navy

గుహలో ఎలా చిక్కుకున్నారు?

గుహ లోపల వారం కిందట బ్రిటీష్ డైవర్లకు ఈ బాలురు కనిపించారు.

గుహ బయటి నుంచి వీరు చిక్కుకుపోయిన ప్రాంతం దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది.

వీరంతా 11 నుంచి 17 ఏళ్ల మధ్యనున్నవారే. వైల్డ్ బోర్స్ అనే ఫుట్ బాల్ క్లబ్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

విహారయాత్రలో భాగంగా కోచ్‌తో కలసి ఈ గుహకు వచ్చారు.

Image copyright AFP

బాలలకు ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ వీక్షించే అవకాశం

థాయ్‌లాండ్ గుహ నుంచి ప్రాణాలతో బయటపడిన బాలలకు ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ వీక్షించే అవకాశం ఇప్పటికీ ఉంది.

రష్యాలో జరిగే ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు రావాలని ఫిఫా అధ్యక్షుడు గియాన్నో ఇన్‌పాంటినో బాలలను ఆహ్వానిస్తూ గత శుక్రవారం లేఖ రాశారు.

గుహలో చిక్కుకున్న బాలలకు తమ మద్దతు ఉంటుందని, వారి పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నామని థాయ్ ఫుట్ బాల్ అసోసియేషన్‌కు రాసిన ఆ లేఖలో ఇన్‌పాంటినో తెలిపారు.

''గుహలోంచి వారు సరైన సమయంలో బయటపడి, ఇక్కడికి వచ్చే స్థితిలో ఉంటే..అంతకంటే సంతోషకరమైన వార్త ఉండదు'' అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

LIVE: హైదరాబాద్ ఎన్‌కౌంటర్: నిందితుల మృతదేహాలు అప్పగించాలని కుటుంబ సభ్యుల ఆందోళన

INDvsWI T20 : భారత్ బ్యాటింగ్ ప్రారంభం.. టార్గెట్ 208 పరుగులు

నాడు మూడు అడుగుల లోతులో పాతిపెడితే సజీవంగా బయటపడిన పసిపాప ఆరోగ్యం ఇప్పుడు భేష్

స్మృతి ఇరానీపై లోక్‌సభలో ఇద్దరు కాంగ్రెస్ ఎంపీల ‘దౌర్జన్యం’.. క్షమాపణలు చెప్పాలన్న బీజేపీ

హైదరాబాద్ ఎన్‌కౌంటర్: సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ అంటే ఏంటి.. ఎందుకు చేస్తారు

సజ్జనార్ ప్రెస్ మీట్: 'చట్టం తన పని తాను చేసింది'

'దిశ' నిందితుల ఎన్‌కౌంటర్... కాల్చి చంపాలనుకుంటే చట్టాలు, కోర్టులతో పనేముంది?

'దిశ' తల్లి: 'నా బిడ్డ కూడా ఒక చెల్లిలాంటిదేనని వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచించి ఉంటే...'