డేటా బ్రీచ్: ఫేస్‌బుక్‌కు 46 కోట్ల జరిమానా విధించనున్న బ్రిటన్

కేంబ్రిడ్జ్ ఎనలిటికా స్కాం విషయంలో ఫేస్బుక్ మీద 5,00,000 పౌండ్ల జరిమానా (దాదాపు 46 కోట్ల రూపాయలు) విధించాలని బ్రిటన్‌కు చెందిన సమాచార పరిరక్షణ సంస్థ ‘ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఆఫీస్’ (ఐసీఓ) యోచిస్తోంది.
ఇది ఫేస్బుక్ ఎదుర్కొనే అతి పెద్ద జరిమానా అవుతుంది. ఈ జరిమానా మొత్తాన్ని తగ్గించటానికి ప్రయత్నించాలా వద్దా అనే అంశం మీద ఫేస్బుక్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
కేంబ్రిడ్జ్ ఎనలటికా మాతృ సంస్థ ఎస్సీఎల్ ఎలెక్షన్స్ (ఇప్పుడు మూతపడింది) మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలని కూడా ఐసీఓ నియంత్రణ సంస్థ భావిస్తోంది.
బ్రెక్జిట్ వ్యవహారంలో ‘ఓట్ లీవ్’ (ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగేలా ఓటు వేయాలనే) ప్రచారంతో కలిసి పనిచేసిన ‘అగ్రిగేట్ ఐక్యూ’ అనే సంస్థ.. బ్రిటన్ పౌరుల సమాచారాన్ని విశ్లేషించటాన్ని నిలిపివేయాలని కూడా ఆ సంస్థ స్పష్టంచేసింది.
అలాగే.. బ్రిటన్‌లోని 11 ప్రధాన రాజకీయ పార్టీలు తమ సమాచార పరిరక్షణ విధానాలను తప్పనిసరిగా సమీక్షించాలని నిర్దేశిస్తూ ఆ సంస్థ లేఖ రాసింది.
ఆయా పార్టీలు ప్రజల జీవనశైలి గురించిన సమాచారాన్ని డాటా బ్రోకర్ల నుంచి కొనుగోలు చేసి ఉండవచ్చునని, ఆ డాటా బ్రోకర్ సంస్థలు ప్రజల నుంచి అవసరమైన అనుమతి పొంది ఉండకపోవచ్చునని.. కాబట్టి ఆ పార్టీలు తమ డాటా ప్రొటెక్షన్ విధానాలను సమీక్షించాల్సిన అవసరముందని ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఆఫీస్ వివరించింది.
- ఫేస్బుక్ మోడరేటర్: చూడలేనివెన్నో అక్కడ చూడాల్సి ఉంటుంది!
- బిజెపి, కాంగ్రెస్‌లు మీ ఫేస్బుక్ డేటా వాడుకుంటున్నాయా!
ప్రత్యేకించి ఎమ్మాస్ డైరీ అనే డాటా బ్రోకర్ విషయంలో ఐసీఓ ఆందోళన వ్యక్తంచేసింది. ఆ సంస్థ గర్భిణిలకు వైద్య సలహాలు, పిల్లలు పుట్టిన తర్వాత గిఫ్ట్ ప్యాక్‌లు ఇవ్వజూపుతుంది.
సదరు సంస్థ రాజకీయ కార్యకలాపాల విషయంలో ఎంత పారదర్శకంగా ఉన్నదనే విషయం ఆందోళన కలిగిస్తోందని ఐసీఓ చెప్పింది.
ఆ సంస్థను ఉపయోగించుకుంటున్నట్లు లేబర్ పార్టీ నిర్ధరించిందని తెలిపింది. అయితే.. ప్రస్తుతానికి ఇతర వివరాలు వెల్లడించలేదు.
ఈ పరిణామంపై స్పందించటానికి ఎమ్మాస్ డైరీ యాజమాన్య సంస్థ లైఫ్‌స్టైల్ మార్కెటింగ్ అందుబాటులోకి రాలేదు.
అయితే.. ఐసీఓ చెప్తున్న విషయాలతో ఏకీభవించటం లేదని 'ద గార్డియన్' వార్తా పత్రికతో ఆ సంస్థ పేర్కొంది.
- భారత్ ఎన్నికల్లో జోక్యాన్ని ఆపేస్తాం : జుకర్‌బర్గ్
- ఐరాస: ‘మయన్మార్‌లో ఫేస్బుక్ మృగంలా మారిపోయింది’
ఫేస్బుక్ మీద జరిమానా ఎందుకు?
బ్రిక్జిట్ రిఫరెండం ప్రచారం సందర్భంగా రాజకీయ ప్రచారాలు.. పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని వినియోగించుకోవటం మీద దర్యాప్తు ప్రారంభించిన 16 నెలల తర్వాత ఐసీఓ ఈ చర్యలను ప్రకటించింది.
లండన్ కేంద్రంగా పనిచేస్తున్న రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ కేంబ్రిడ్జ్ ఎనలిటికా.. లక్షలాది మంది ఫేస్బుక్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్బుక్ నిబంధనలకు విరుద్ధంగా సేకరించిందని.. ఆ సమాచారాన్ని ఆ సంస్థ చెరిపివేసేలా చూడటంలో ఫేస్బుక్ విఫలమైందని ఇటీవల బయటపడింది.
అయితే.. 2015 డిసెంబర్లో ఫేస్బుక్ నుంచి విజ్ఞప్తి వచ్చినపుడు ఆ సమాచారాన్ని నిజంగా చెరిపివేశామని కేంబ్రిడ్జ్ ఎనలిటికా కుప్పకూలకముందు గట్టిగా వాదించింది.
ఆ సమాచారం పత్రాలను ఇతరులతో పంచుకున్నట్లు ఆధారాలను చూశామని ఐసీఓ చెబుతోంది. ‘‘సమాచారాన్ని చెరిపివేశారంటూ ఫేస్బుక్ అందించిన సర్టిఫికట్ల వాస్తవికతను ఇది ప్రశ్నార్థకం చేస్తోంది’’ అని ఐసీఓ వ్యాఖ్యానించింది.
ఇంకా విస్తృతంగా చూస్తే.. రాజకీయ పార్టీలు, ప్రచారాల నుంచి అత్యధికంగా డిజిటల్ అడ్వర్టైజ్మెంట్లు పొందుతున్న సంస్థ ఫేస్బుక్ అని ఐసీఓ ప్రస్తావించింది.
‘‘దీని ఫలితంగా ఫేస్బుక్ తన వినియోగదారులు ఎలా లక్ష్యంగా మారుతున్నారో వివరించటానికి తగిన కృషి చేయలేదు. వారి వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించుకోవటం మీద వినియోగదారులకు తగిన నియంత్రణ అందించలేదు’’ అని తప్పుపట్టింది.
ఫలితంగా.. డాటా ప్రొటక్షన్ యాక్ట్ (బ్రిటన్ సమాచార పరిరక్షణ చట్టం)ను రెండు విధాలుగా ఉల్లంఘించటంలో ఫేస్బుక్ దోషి అని ఐసీఓ పేర్కొంది.
దీనిపై ఫేస్బుక్ చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ స్పందించారు.
‘‘మేం ఇంతకుముందే చెప్పినట్లుగా 2015లో కేంబ్రిడ్జ్ ఎనలిటికా పేర్కొన్న విషయాల మీద మరింతగా పరిశోధన చేసి, చర్యలు చేపట్టి ఉండాల్సింది’’ అని ఎరిన్ ఏగన్ పేర్కొన్నారు.
‘‘అమెరికా, ఇతర దేశాలతో పనిచేస్తున్నట్లుగానే కేంబ్రిడ్జ్ ఎనలిటికా మీద దర్యాప్తులో ఐసీఓతో కలిసి సన్నిహితంగా పనిచేస్తున్నాం. ఈ నివేదికను సమీక్షిస్తున్నాం. ఐసీఓకు త్వరలో బదులిస్తాం’’ అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- కత్తి మహేశ్: పోలీసులు ఎందుకు బహిష్కరించారు?
- కర్ణాటక పోలీస్: బరువు తగ్గకుంటే ఉద్యోగం ఊడుతుంది
- స్థానిక పత్రికలు లేకుంటే సమాజం ఏమవుతుంది?
- ఏడాదికి 81 లక్షలు సంపాదించినా 'అల్పాదాయ వర్గం' కిందే లెక్క
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)