అమెరికాలో చనిపోతే స్వదేశానికి తెచ్చేదెవరు? సాయం చేసేదెవరు?

  • 11 జూలై 2018
కొప్పు శరత్, అమెరికా, కాల్పులు Image copyright Facebook/Sharath

ఉన్నత చదువుల కోసమో.. ఉపాధి అవకాశాల కోసమో.. అక్కడున్న వారిని కలవటం కోసమో.. విహార యాత్రల వల్లో.. విధి నిర్వహణ వల్లో.. విదేశీ ప్రయాణాలు పెరుగుతున్నాయి. దేశం విడిచి వెళ్లాక ఆ ప్రయాణం సాఫీగా సాగిపోతే సరే. కానీ దేశం కాని దేశంలో అనుకోని విషాదం ఎదురైతే..? అనూహ్య మరణం సంభవిస్తే..? ఆ బాధ వర్ణనాతీతం.

ఏమయిందో తెలియక కన్నీళ్లలో కుంగిపోయే స్వదేశంలో ఉన్న కన్నవారు, కుటుంబ సభ్యులు.. కడసారి చూడటానికి భౌతికకాయం కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సి రావటం.. ఆ విషాద భారాన్ని మరింత పెంచుతుంది.

తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శరత్ కొప్పు ఈ నెల 6న అమెరికాలోని కాన్సస్ సిటీలో హత్యకు గురయ్యాడు. అతడి మృతదేహం అమెరికా నుంచి బుధవారం రాత్రికి భారతదేశం చేరుకోనుంది. అంటే.. చనిపోయిన తర్వాత దాదాపు వారం రోజుల సమయం పట్టింది.

అమెరికాలో పెరుగుతున్న భారతీయుల మరణాలు...

విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో భారతీయుల మరణాలు ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయి.

‘‘ఇక్కడకు వచ్చే వారిలో కొందరు అనారోగ్యంతో చనిపోతున్నారు. ఇంకొందరు ప్రమాదాల్లో చనిపోతున్నారు. మరికొందరు హత్యల వంటి ఘటనల్లో చనిపోతున్నారు. ఈ మరణాలు ఎక్కువగా కనిపించటానికి కారణం.. ఇక్కడ భారతీయుల సంఖ్య అధికంగా ఉండటమే. అమెరికాలో ప్రస్తుతం దాదాపు 25 లక్షల మంది భారతీయులు ఉన్నారు’’ అని ‘టీమ్ ఎయిడ్’ ప్రతినిధి ప్రతినిధి మోహన్ నన్నపనేని బీబీసీ ప్రతినిధికి వివరించారు.

అయితే.. అలా చనిపోయిన వారి మృతదేహాలను స్వదేశానికి తరలించటంలో చాలా వ్యయప్రయాసలు ఇమిడి ఉన్నాయి. సహజ మరణమైతే కొంత త్వరగాను, ప్రమాదాల్లో మరణస్తే కొంచెం ఆలస్యంగాను మృతదేహాలను స్వదేశానికి పంపించటానికి వీలవుతుంది. అదే.. హత్య వంటి ఘటనల వల్ల మరణం సంభవిస్తే.. ఆ ప్రక్రియ ఇంకా ఆలస్యమవుతుంది.

ఆ ప్రక్రియ ఏమిటి? ఎందుకంత ఆలస్యమవుతుంది? అటువంటి ఆపదల్లో సాయం చేసేవారెవరు?

Image copyright Facebook
చిత్రం శీర్షిక గత ఏడాది ఇదే రాష్ట్రంలో జరిగిన కాల్పుల్లో చనిపోయిన కూచిభొట్ల శ్రీనివాస్

అటాప్సీ తర్వాత అంత్యక్రియల సంస్థలకు...

అమెరికాలో చనిపోయిన భారత పౌరుల మృతదేహాలను తిరిగి స్వదేశానికి తీసుకురావటానికి.. ఇరు దేశాల ప్రభుత్వాల నుంచీ పలు ధృవపత్రాలు అవసరం.

మరణంపై వైద్యుల నుంచి ధృవపత్రం తీసుకోవటం మొదలుకుని.. మృతదేహం పాడవకుండా ఎంబాల్మింగ్ చేయించటం వరకూ.. చాలా ప్రయాసపడాల్సి ఉంటుంది.

అనారోగ్య మరణం, ప్రమాదంలో మరణంతో పోలిస్తే.. హత్య వల్ల మరణం సంభవించినపుడు ఈ ప్రక్రియ చాలా సుదీర్ఘంగా ఉంటుంది.

హత్యకు గురైన వ్యక్తి మృతదేహాన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం.. మరణానికి కారణాన్ని నిర్ధారించేందుకు శవపరీక్ష (అటాప్సీ) నిర్వహిస్తారు. ఈ పని ప్రత్యేకంగా నియమితులైన వైద్యులే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మరణ ధృవీకరణ పత్రం, పోస్ట్‌మార్టం నివేదికలు జారీ చేస్తారు.

ఈ వైద్య పరిశోధనలు, పోలీసుల దర్యాప్తులు పూర్తయిన తర్వాత మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి విడుదల చేస్తారు. అమెరికాలో చనిపోయిన వారి మృతదేహాలను వారి బంధువులకు అప్పగించటం ఉండదు. అంత్యక్రియలు నిర్వహించే సంస్థలకు (ఫ్యునరెల్ హోంలకు) అప్పగిస్తారు.

ఎంబాల్మింగ్... సీలింగ్...

సాధారణంగా.. మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించే బాధ్యతలను ఈ ఫ్యునరెల్ హోంలు నిర్వహిస్తాయి. అందుకు అవసరమైన వ్యయాన్ని మృతుల సంబంధీకులే భరిస్తారు.

విదేశాలకు తరలించాల్సిన మృతదేహాలను కూడా ఈ ఫ్యునరెల్ హోంల నుంచే తరలించాల్సి ఉంటుంది. అందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి.

తొలుత మృతదేహాన్ని వేరే దేశానికి తీసుకెళ్లటానికి ఎటువంటి అభ్యంతరం లేదని.. దానివల్ల అంటువ్యాధులేవీ వ్యాపించబోవని వైద్యుల ధృవీకరణ అవసరం.

ఆ తర్వాత మృతదేహం పాడవకుండా ఉండటానికి ఎంబాల్మింగ్ చేస్తారు. అనంతరం ఆ మృతదేహాన్ని ఒక శవపేటికలో పెట్టి సీల్ చేస్తారు. ఎంబాల్మింగ్, సీలింగ్ పూర్తిచేసినట్లు ధృవీకరణపత్రాలు పొందాలి.

భారతీయ కాన్సులేట్ నుంచి పర్మిట్...

ఉద్యోగ రీత్యా కానీ, విద్యాభ్యాసం కోసం కానీ, తాత్కాలిక సందర్శన కోసం కానీ.. అమెరికాలో ఉన్న వారు ఏ కారణం చేత చనిపోయినా.. అక్కడి భారతీయ రాయబార కార్యాలయానికి సమాచారం అందించాలి.

మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావటానికి పర్మిట్ (అనుమతి పత్రం) కోసం సంబంధిత ప్రాంతంలోని భారతీయ కాన్సులేట్‌లో దరాఖాస్తు చేసుకోవాలి.

అందుకోసం.. మరణించిన వ్యక్తి డెత్ సర్టిఫికెట్, సదరు వ్యక్తికి అంటువ్యాధులేవీ లేవని ధృవీకరిస్తూ డాక్టర్ ఇచ్చే సర్టిఫికెట్, మృతదేహాన్ని ఎంబాల్మింగ్ చేయటానికి సంబంధించి సంబంధిత ఫ్యునెరల్ హోం నుంచి సర్టిఫికెట్, ఆ మృతదేహాన్ని పంపించబోయే విమానం వివరాలు, మరణించిన వ్యక్తి పాస్‌పోర్ట్‌లను ఒరిజనల్ పత్రాలతో పాటు.. ఫొటో కాపీలను కూడా సమర్పించాలి. ఈ దరఖాస్తు చేసే వ్యక్తి పాస్‌పోర్ట్‌ను కూడా అందించాలి. ఈ డాక్యుమెంట్లు అన్నీ సంపాదంచడానికి వ్యయప్రయాసల్లో సమయం ఖర్చయిపోతుంది.

మరణించిన వ్యక్తి పాస్‌పోర్టును రద్దు చేసి తిరిగి ఇస్తారు. మిగతా పత్రాలను సరిచూసుకుని ఒరిజనళ్లను తిరిగి ఇస్తారు. అన్నీ సక్రమంగా ఉన్నట్లయితే మృతదేహాన్ని భారతదేశానికి తరలించటానికి అనుమతి పత్రం జారీచేస్తారు.

ఈ అనుమతి పత్రాలన్నిటితో విమానం టికెట్లు బుక్ చేసుకోవాలి. అలా అమెరికాలో మరణించిన వ్యక్తి చివరి ప్రయాణానికి ఏర్పాట్లు జరుగుతాయి.

అమెరికా వీసాలు.. విశేషాలు

ఇదండీ హెచ్-1బీ వీసా కథా కమామిషు!

Image copyright teamaid.org

ఆపదలో సాయం చేసే 'టీమ్ ఎయిడ్'

ఈ ప్రక్రియలో ఇరు దేశాల ప్రభుత్వాలకు చెందిన అనేక విభాగాలను సంప్రదించాల్సి ఉంటుంది. పైగా ఎంబాల్మింగ్, శవపేటికలో సీలింగ్, విమానంలో ప్రయాణం అన్నీ చాలా ఖర్చులతో కూడుకున్న పనులు.

విదేశాలకు వెళ్లే వారెవరూ ఇటువంటి పరిస్థితులను ఎదురవుతాయని ఊహించరు. అందుకు సన్నద్ధంగా ఉండాలని ఆలోచించరు. కానీ.. ఈ విషాదం చెప్పిరాదు. కష్టకాలంలో సాయంవచ్చే చుట్టాలు పక్కాలు ఎవరూ లేని దూరతీరాల్లో ఇంతటి విషాద పరిస్థితుల్లో ఏం చేయాలి?

కొంత కాలం కిందట ఈ వివరాలన్నీ తెలిసిన వారు.. సమయానికి సాయమందించేవారు అరుదు. కానీ.. ఇప్పుడు అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయుల సంస్థ ఒకటి స్వచ్ఛందంగా ఈ సేవలన్నీ అందిస్తోంది.

'టీమ్ ఎయిడ్' అనే ఆ సంస్థ అమెరికాతో పాటు, కెనడాలోనూ వలంటీర్ల బృందంతో.. ఇటువంటి విషాదంలో ఉన్న భారతీయులకు అండగా నిలుస్తోంది.

అమెరికాలోని వివిధ తెలుగు సంఘాలతో పాటు తమిళ సంఘాలు, ఇతర భారతీయ రాష్ట్రాల సంఘాలన్నీ కలిసి ఒక వేదికగా ఈ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటైంది.

Image copyright Getty Images

విరాళాల సమీకరణకూ సాయం...

''మరణం వల్ల ఓ కుటుంబానికి కలిగే బాధను పోగొట్టలేం. కానీ వారి కష్టాలను పంచుకోవటం ద్వారా కొంత సాయం చేయగలం' అన్నది 'టీమ్ ఎయిడ్' ఉద్దేశమని ఆ సంస్థ ప్రతినిధి మోహన్ నన్నపనేని బీబీసీ ప్రతినిధితో ఫోన్‌లో మాట్లాడుతూ చెప్పారు.

మరణాల వంటి విషాదంలో అధికారికంగా డాక్యుమెంట్ల ప్రక్రియ పూర్తిచేయటానికి ఆయా విభాగాలను సంప్రదించటానికి అవసరమైన సాయం అందిస్తారు. అంతేకాదు.. మృతదేహాన్ని స్వదేశానికి తరలించటానికి అవసరమైన నిధులను సమీకరించటం కోసం ఆర్థికంగా ఆదుకోవటానికీ చేయూతనందిస్తారు.

సురేశ్ కొప్పు కోసం 'గోఫండ్‌మి' వెబ్‌సైట్‌ ద్వారా 40,000 డాలర్ల విరాళాల కోసం కోరగా.. బుధవారం నాటికి 50,000 డాలర్లు పైగా విరాళాలు లభించాయి. ఇందులో 15,000 మందికి పైగా సాయపడ్డారు.

అలాగే.. ఇన్సూరెన్స్ సంస్థల నుంచి రాగల క్లెయిములు, మృతులు విద్యార్థులైతే ఆయా విద్యా సంస్థల నుంచి అందగల సాయాన్ని అందేలా చూడటానికి కూడా ‘టీమ్ ఎయిడ్’ సాయపడుతుంది.

ప్రస్తుతం అమెరికా, కెనడాల్లో ఉన్న ‘టీమ్ ఎయిడ్’ సాయాన్ని ప్రపంచ దేశాలన్నిటికీ విస్తరించాలన్నది సంస్థ లక్ష్యమని మోహన్ నన్నపనేని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో ఆపదల్లో ఉండే భారతీయులకు సాయం అందించటానికి వ్యాప్తి చేయనున్నట్లు తెలిపారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు

LIVE: హైదరాబాద్ ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో కేసు: ‘సోమవారం దాకా నిందితులకు అంత్యక్రియలు చేయొద్దు.. మృతదేహాలను భద్రపర్చండి’

INDvsWI T20 : రోహిత్ శర్మ ఔట్.. భారత్ 50/1.. టార్గెట్ 208 పరుగులు

నాడు మూడు అడుగుల లోతులో పాతిపెడితే సజీవంగా బయటపడిన పసిపాప ఆరోగ్యం ఇప్పుడు భేష్

స్మృతి ఇరానీపై లోక్‌సభలో ఇద్దరు కాంగ్రెస్ ఎంపీల ‘దౌర్జన్యం’.. క్షమాపణలు చెప్పాలన్న బీజేపీ

హైదరాబాద్ ఎన్‌కౌంటర్: సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ అంటే ఏంటి.. ఎందుకు చేస్తారు

సజ్జనార్ ప్రెస్ మీట్: 'చట్టం తన పని తాను చేసింది'

'దిశ' నిందితుల ఎన్‌కౌంటర్... కాల్చి చంపాలనుకుంటే చట్టాలు, కోర్టులతో పనేముంది?

'దిశ' తల్లి: 'నా బిడ్డ కూడా ఒక చెల్లిలాంటిదేనని వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచించి ఉంటే...'