థాయ్‌లాండ్‌లో ఇప్పుడు హీరోలు వీరే

  • 11 జూలై 2018
థాయ్ హీరోలు Image copyright AFP/GETTY
చిత్రం శీర్షిక మిగతా డైవర్లతో ఇవాన్ కరడ్జిక్(ఎడమ నుంచి రెండో వ్యక్తి) ఎరిక్ బ్రౌన్(కుడి నుంచి మూడో వ్యక్తి)

థాయ్ నేవీ సీల్స్‌తో కలిసి థాయ్ గుహలో చిక్కుకున్న వారిని కాపాడిన వారిలో అంతర్జాతీయ డైవర్లు కూడా ఉన్నారు. వీరిలో ఎంతో మంది ఈ సహాయ కార్యక్రమాలలో హీరోలుగా నిలిచారు.

12 మంది పిల్లలు, వారి ఫుట్‌బాల్ కోచ్ ఆచూకీని మొదట బ్రిటీష్ డైవర్లు గుర్తించారు. కానీ వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు మాత్రం అసలుసిసలు గ్లోబల్ ఆపరేషన్‌లా జరిగాయి.

ఈ సహాయ కార్యక్రమాల్లో ఎంతోమంది థాయ్ నేవీ డైవర్లు పాల్గొన్నారు. గుహలోపలికి వెళ్లిన నావీ మాజీ డైవర్ సమన్ గునన్ గత శుక్రవారం మృతి చెందారు.

ఈ సహాయ కార్యక్రమాలలో ఎవరున్నారు? ఎలా కాపాడారు? అనేదానిపై చాలా తక్కువ సమాచారం విడుదల చేశారు. ఎందుకంటే ఇందులో పాల్గొన్న చాలా మంది మాట్లాడేందుకు అయిష్టత వ్యక్తం చేశారు.

సహాయ కార్యక్రమాలలో థాయ్, విదేశీ డైవర్లు పదుల సంఖ్యలో పాల్గొన్నారని భావిస్తున్నారు. వారిలో కొందరి వివరాలు..

Image copyright FACEBOOK/THAI NAVY SEALS
చిత్రం శీర్షిక గుహ నుంచి చివరగా బయటికొచ్చిన థాయ్ నావీ సీల్స్‌లోని ముగ్గురు డైవర్లు, వైద్యుడు

థాయ్ నేవీ సీల్స్

సహాయ కార్యక్రమాలలో థాయ్ ప్రత్యేక దళాలకు చెందిన ఎంతోమంది పాల్గొన్నారు. వీరిలో ముఖ్యంగా పాక్ లోహర్న్‌షూన్ అనే డాక్టర్, పేరు వెల్లడించని ముగ్గురు డైవర్లు చాలా గుర్తింపు పొందారు. వీరు నలుగురూ గుహలో పిల్లలను గుర్తించిన రోజు నుంచి వాళ్ల పక్కనే ఉంటూ వచ్చారు.

నేవీ సీల్స్ తమ ఫేస్‌బుక్ పేజ్‌‌లో షేర్ చేసిన ఒక వీడియోలో డాక్టర్ పాక్ పిల్లల గాయాలకు మందు రాస్తూ కనిపించారు.

మంగళవారం సాయంత్రం అందరి కంటే చివరన నలుగురు థాయ్ నేవీ సీల్స్ డైవర్లు గుహ నుంచి బయటికి వచ్చారు.

థాయ్ నేవీ సీల్స్ బృందానికి రేర్ అడ్మిరల్ అర్పకోర్న్ యుకోంగ్కేవ్ నేతృత్వం వహించారు.

డైవర్లు పిల్లల కోసం ఇంకా వెతుకుతున్నప్పుడు ఆ సహాయ కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించారు.

చిత్రం శీర్షిక సహాయ కార్యక్రమాలలో నావీ సీల్స్ ఇంఛార్జ్, రేర్ అడ్మిరల్ అర్పకోర్న్

జాన్ వొలాంథెన్, రిచర్డ్ స్టాంటన్

గుహలోపల చిక్కుకుపోయిన పిల్లలు, కోచ్ తొమ్మిది రోజుల తర్వాత మొదట బ్రిటన్‌కు చెందిన జాన్ వొలాంథెన్ గొంతు విన్నారు.

థాయ్ అధికారులు బ్రిటిష్ గుహల నిపుణుడు రాబర్ట్ హార్బర్‌తోపాటు వలొంథెన్, ఆయన సహచర బ్రిటిష్ డైవర్ స్టాంటన్‌ను అక్కడికి పిలిపించారు.

ఫుట్‌బాల్ టీమ్ గల్లంతైన మూడు రోజుల తర్వాత వీళ్లు ముగ్గురూ థాయ్‌లాండ్ వచ్చారు.

వొలాంథెన్ ఒక ఐటీ నిపుణుడు, స్టాంటన్ ఒక మాజీ ఫైర్ ఫైటర్. వీళ్లిద్దరూ సౌత్ అండ్ మిడ్ వేల్స్ కేవ్ రెస్క్యూ బృందంలో పనిచేస్తున్నారు.

నార్వే, ఫ్రాన్స్, మెక్సికోతోపాటూ వీళ్లు ఎన్నో కేవ్ డైవింగ్ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionథాయ్‌లాండ్ బాలురు: పాతాళ గుహలో చిక్కుకుని ప్రాణాలతో బయటపడ్డారు

రిచర్డ్ హారిస్

ఆస్ట్రేలియా అడిలైడ్‌కు చెందిన డాక్టర్ హారిస్‌కు దశాబ్దాల డైవింగ్ అనుభవం ఉంది.

గుహలో ఉన్న పిల్లలను పరీక్షించాక సహాయ కార్యక్రమాలు ప్రారంభించడానికి గ్రీన్ లైట్ చూపించింది ఆయనే.

మీడియా నివేదికల ప్రకారం డాక్టర్ హారిస్ ఆస్ట్రేలియా, చైనా, క్రిస్మస్ ఐలాండ్స్, న్యూజిలాండ్‌లో జరిగిన ఎన్నో డైవింగ్ అన్వేషణల్లో భాగం అయ్యారు. అనస్తటిక్ అయిన ఈయన సాహస యాత్ర మెడిసన్, రిట్రైవల్ ఆపరేషన్లలో నిపుణులు.

2011లో దక్షిణ ఆస్ట్రేలియాలో జరిగిన అత్యంత కఠినమైన సాహసయాత్రలో ఊపిరాడక చనిపోయిన కేవ్ డైవర్, తన స్నేహితుడు ఆగ్నెస్ మిలోవ్కా మృతదేహాన్ని హారిస్ తీసుకొచ్చారు.

థాయ్ సహాయ కార్యక్రమాలలో పాల్గొన్న బ్రిటిష్ డైవర్ల ద్వారా ప్రత్యేకంగా ఆయన సాయం కోరినట్టు భావిస్తున్నారు.

చిత్రం శీర్షిక సహాయ కార్యక్రమాలలో ప్రాణాలు కోల్పోయిన సమన్ గుమన్

సమన్ గునన్

సమన్ గునన్ రిటైరైన థాయ్ నేవీ డైవర్. సహాయ కార్యక్రమాలలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. జులై 6న ఎయిర్ ట్యాంకులు తీసుకెళ్లి వస్తున్నప్పుడు థామ్ లుయాంగ్ గుహలో అతడు స్పృహతప్పాడు.

సహచరుడు అతడిని కాపాడాలని చూశాడు. కానీ సమన్ మృతదేహాన్ని మాత్రమే బయటకు తీసుకురాగలిగాడు.

ఆయన గురించి తెలిశాక.. అందరూ హీరోలా ప్రశంసిస్తున్నారని సమన్ భార్య బీబీసీకి చెప్పారు.

ఇతరులకు సాయం చేయడం అంటే అతడికి ఇష్టం అని, చారిటీలో పని చేస్తున్నాడని తెలిపారు.

రేర్ అడ్మిరల్ అర్పకోర్న్ ఆయన త్యాగాన్ని వృథా కానివ్వమని అన్నారు.

Image copyright FACEBOOK.COM/BEN.REYMENANTS
చిత్రం శీర్షిక బెన్ రేమెనంట్స్, గవర్నర్ నారోంగ్సక్ ఒసట్టనకోర్న్, సహచర డైవర్ మక్సిమ్ పోలెజక

బెన్ రేమెనంట్స్, క్లాస్ రాస్‌ముస్సెన్

బెల్జియన్ బెన్ రేమెనంట్స్ ఫుకెట్‌లో ఒక డైవింగ్ షాప్ నడుపుతున్నాడు. సోమవారం పిల్లల్ని మొదట గుర్తించిన డైవర్లలో అతడు కూడా ఒకరని భావిస్తున్నారు.

క్లాస్ రాస్‌ముస్సెన్ చాలా ఏళ్ల నుంచి థాయ్‌లాండ్‌లో ఉంటున్న డెన్మార్క్ వాసి. చాలా డైవ్ స్కూల్స్‌లో పనిచేసాడు.

అతడు ప్రస్తుతం బెన్ రేమెనంట్స్ నడిపే బ్లూ లేబుల్ డైవింగ్ కంపెనీలో ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్నాడు.

అతడు ఆసియా అంతా డైవింగ్ చేసున్నాడు. ఆగ్నేయాసియాలోని ఎన్నో దేశాలలో పనిచేశాడు.

Image copyright FACEBOOK.COM/BEN.REYMENANTS
చిత్రం శీర్షిక పాసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఫొటో, గుహలో క్లాస్ రస్‌ముస్సెన్

మిక్కో పాసి

ఫిన్‌లాండ్ వాసి అయిన మిక్కో పాసి, కోహ్ టావ్ అనే చిన్న థాయ్ ద్వీపంలో ఒక డైవింగ్ సెంటర్ ఏర్పాటు చేశాడు. ఇతడికి టెక్నికల్ డైవింగ్‌లో నైపుణ్యం ఉంది.

అంటే అతడు శిథిలాలపై, కేవ్ డైవింగ్‌పై దృష్టి పెట్టేవాడు

జులై 2న పిల్లలు, వారి కోచ్ ఆచూకీ తెలిసినప్పుడు, అతడి భార్య మిక్కో "మా 8వ వివాహ వార్షికోత్సవం రోజున సహాయ కార్యక్రమాలలో పాల్గొనడానికి నా భర్త చాంగ్ రాయ్ వెళ్లాడు అని" ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

Image copyright FACEBOOK.COM/BEN.REYMENANTS
చిత్రం శీర్షిక పిల్లలను సురక్షితంగా తీసుకువచ్చిన డైవర్లలో మిక్కో పాసి ఒకరు

ఇవాన్ కరడ్జిక్

ఇవాన్ కరడ్జిక్ డెన్మార్క్ వాసి. పాసి తర్వాత కొన్నేళ్లకు అతడు కూడా కోహ్ టావ్ వెళ్లిపోయాడు. అక్కడ ప్రస్తుతం వాళ్లిద్దరూ కలిసి డైవింగ్ సెంటర్ నడుపుతున్నారు.

మొదట పిల్లాడ్ని చూస్తూనే తనకు కలిగిన భయం గురించి అతడు బీబీసీకి చెప్పాడు. "దూరం నుంచి చూశా, అది పిల్లాడా, మృతదేహమా తెలీలేదు. తర్వాత పిల్లాడు సురక్షితంగా ఉన్నట్టు తెలుసుకున్నా" అన్నారు.

చిత్రం శీర్షిక ఇవాన్ కరడ్జిక్

ఎరిక్ బ్రౌన్

కెనడా దేశస్థుడైన ఎరిక్ బ్రౌన్, వాంకోవర్‌లో ఒక టెక్నికల్ డైవింగ్ శిక్షకుడుగా ఉన్నారు.

ఆయన శతాబ్దం క్రితం డైవింగ్ ప్రారంభించారు. ఈజిఫ్టులో 'టీమ్ బ్లూ ఇమ్మర్షన్' అనే ఒక టెక్నికల్ డైవింగ్ స్కూల్ నడుపుతున్నారు

మంగళవారం ఆయన తన ఫేస్‌బుక్‌లో తొమ్మిది రోజుల్లో ఏడు డైవింగ్ కార్యక్రమాలలో పాల్గొన్నట్టు పోస్ట్ చేశాడు. దాన్లో థామ్ లుయాంగ్ గుహలో గడిపిన 63 గంటలు కూడా ఉంది.

Image copyright FACEBOOK.COM/MIKKO.PAASI.3
చిత్రం శీర్షిక పిల్లలను కాపాడిన తర్వాత ఎరిక్ బ్రౌన్(ఎడమ), మిక్కో పాసి(మధ్య), క్లాస్ రాస్‌ముస్సెన్(కుడి)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)