థాయ్‌లాండ్: గుహ నుంచి ఆస్పత్రి వరకూ.. పలు ప్రశ్నలకు సమాధానాలు

  • 12 జూలై 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionధైర్యమనే లక్షణమే ఎక్కడెక్కెడి వాళ్లనూ ఒక్కటి చేసి ముందుకు నడిపించింది

పాతాళ గుహలో 17 రోజుల పాటు చిక్కుకుపోయిన థాయ్‌లాండ్ బాలురు, వారి ఫుట్‌బాల్ కోచ్‌ క్షేమంగా బయటపడ్డారు.

థామ్ లువాంగ్ గుహ నుంచి వీరిని రక్షించి బయటకు తీసుకురావటానికి.. థాయ్‌‌లాండ్‌తో పాటు వివిధ దేశాల డైవర్ల బృందం చాలా ప్రమాదకరమైన, సంక్లిష్టమైన ఆపరేషన్ నిర్వహించారు. అది ఎలా సాగిందనే వివరాలు ఇప్పుడు తెలుస్తున్నాయి.

ఆ బాలురు, వారిని రక్షించటానికి చేపట్టిన ఆపరేషన్‌, ఇక తర్వాత ఏం జరుగుతుంది అనే అంశాలపై కొన్ని కీలక ప్రశ్నలకు బీబీసీ ప్రతినిధి జొనాథన్ హెడ్ జవాబు ఇచ్చారు.

బాలురు గుహలో అంత లోపలికి ఎందుకు వెళ్లారు?

ఆ బాలురు, వారి అసిస్టెంట్ కోచ్ ఎక్కోపాల్ ‘ఎక్’ చాంటావాంగ్ చెప్పే వరకూ మనకు ఆ విషయం తెలియదు.

ఆ శనివారం నాడు వారు ఒక మ్యాచ్ ఆడాల్సి ఉందని, కానీ అది రద్దయిందని ప్రధాన కోచ్ నొప్పారాట్ కాన్థావాంగ్ చెప్పారు. దానికి బదులుగా శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని ఆయన నిర్ణయించాడు.

ఆ బాలురికి సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. వీరందరూ తమ తల్లిదండ్రులతో సంభాషించటానికి, సమాచారం తెలియజేయటానికి ఒక ఫేస్‌బుక్ చాట్ గ్రూప్ ఏర్పాటుచేసుకున్నారు. సైకిళ్లు తొక్కుకుంటూ ఫుట్‌బాల్ మైదానానికి వెళ్దామని కోచ్ ఎక్ సూచించాడు.

వాళ్లు గుహల్లోకి వెళ్లాలన్న సూచనేదీ అందులో లేదు.

Image copyright FACEBOOK/EKATOL
చిత్రం శీర్షిక బాలుర ఫుట్‌బాల్ టీమ్ సభ్యులు కొందరు, కోచ్ కలిసి ఉన్న ఈ ఫొటో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు

అదే శనివారం ఫీరాఫాట్ ‘నైట్’ సోంపీన్‌గ్జాయ్ 16వ పుట్టిన రోజు. ఆ సంబరాల కోసం బాలురు తమ దగ్గర ఆహార పదార్థాలు తినటానికి 700 భాట్లు (దాదాపు రూ. 1,500) ఖర్చు పెట్టారని స్థానిక దుకాణం ఒకటి చెప్పింది. అది ఈ ప్రాంతంలో పెద్ద మొత్తమే.

ఎక్ చాలా దయార్ద్ర హృదయుడని.. బాలురకు అంకితమై మెసలేవాడని కోచ్ నోప్ అభివర్ణిస్తారు. గుహల్లోకి వెళ్లాలని ఆ పిల్లలే అతడి మీద ఒత్తిడి తెచ్చి ఉంటారని ఆయన భావిస్తున్నారు. ఆ గుహలు ఈ ప్రాంతంలో బాగా తెలిసినవే. ఈ బాలురు ఇంతకుముందు కూడా వాటిలోకి పలుమార్లు వెళ్లివచ్చారు.

ఈ గుహలు పొడిగా ఉన్నపుడు లోపల దూరంగా వెళ్లటం సులభం. అలా పొడిగా ఉన్నపుడు వీరు కాస్త దూరం వెళ్లివుంటారని.. తర్వాత వరద నీరు చుట్టుముట్టడంతో ఇంకా లోపలికి వెళ్లాల్సి వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Image copyright AFP/ROYAL THAI NAVY
చిత్రం శీర్షిక గుహలో నుంచి బాలురను రక్షించేందుకు పుల్లీలను నిర్మించారు

పిల్లలను చూడటానికి వారి తల్లిదండ్రులను ఎందుకు అనుమతించటం లేదు?

పాతాళ గుహలో ఇన్ని రోజులు ఉండటం వల్ల పిల్లలు బలహీనంగా ఉన్నారని.. అందువల్ల ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధికారిక వివరణ.

ఈ బాలుర ప్రాణాలు ఇప్పుడు థాయ్‌లాండ్‌లో చాలా విలువైనవి. వారిని సజీవంగా బయటకు తీసుకురావటానికి భారీస్థాయి‌లో కృషి చేశారు. అందువల్ల ప్రమాదాలకు అవకాశాలు ఇవ్వరాదని థాయ్ అధికారవర్గాలు భావిస్తున్నాయి.

పిల్లలు తల్లిదండ్రులను మళ్లీ చూడటంతో లోనయ్యే భావోద్వేగాన్ని కూడా నివారించాలని కూడా వారు భావిస్తుండవచ్చు. పశ్చిమ ప్రజల మధ్య ఉండే.. ఆలింగనాల వంటి వాటి ద్వారా శరీర కలయికలతో అభిమానం తెలుపుకోవటం థాయ్‌ ప్రజల్లో చాలా తక్కువ. నిజానికి ఇక్కడ ఆలింగనం అనేది అసాధారణం.

పైగా ఈ బాలుర తల్లిదండ్రులు పేద, వెనుకబడిన వర్గాల వారు. ఏం చేయాలనేది వారికి అధికారులే చెప్తుంటారు. పిల్లలను కాపాడటానికి ప్రభుత్వం ఎంతగా కృషి చేసిందనేదానికి కృతజ్ఞులై ఉండొచ్చు. వారు నిరసన తెలపరు.

కిటికీల ద్వారా పిల్లలను చూడటానికి అనుమతిస్తున్నారు. నెమ్మదిగా లోపలికి పంపిస్తున్నారు. గ్లవ్స్, ఫేస్‌మాస్కులు ధరించి పిల్లలున్న గదిలోకి వెళ్లేందుకు అనుమతిస్తున్నారు.

Image copyright Thai Government public relations department

కోచ్ ఎక్ మీద క్రమశిక్షణ చర్యలేవైనా చేపడతారా?

ఈ దశలో అలాంటిదేమీ ఉండకపోవచ్చు. అతడిని క్షమించామని తల్లిదండ్రులు అంటున్నారు. గుహల్లో పిల్లలను ధైర్యంగా ఉంచటానికి అతడు చేసినట్లు చెప్తున్న కృషి పట్ల కూడా వారు కృతజ్ఞతాభావంతో ఉన్నారు. ప్రత్యేకించి ధ్యానం చేయించటం ద్వారా అతడు పిల్లల్లో ధైర్యం నింపాడని.. 12 ఏళ్ల పాటు బౌద్ధ సన్యాసి‌గా ఉన్నపుడు అతడు ఇది నేర్చుకున్నాడని చెప్తున్నారు.

ఎక్‌ను మూడు నెలల పాటు మళ్లీ సన్యాసిగా ఉండాలని పంపించవచ్చునని కోచ్ నోప్ చెప్పారు. థాయ్ జనం ఒకవిధమైన ప్రాయశ్చిత్తంగా కానీ.. తమను తాము ఆధ్యాత్మికంగా ప్రక్షాళన చేసుకునేందుకు గానీ ఇలా చేస్తుంటారు.

ఆ తర్వాత అతడు తన సాధారణ జీవితాన్ని పున:ప్రారంభించవచ్చు.

అలాగే.. ఏదైనా పొరపాటుకు ఒక దోషిని పట్టుకునేటటువంటి ‘నిందా సంస్కృతి’ థాయ్‌లాండ్‌లో లేదు. తప్పులు, పొరపాట్లను విధిరాతగా అంగీకరిస్తారు. ఎవరైనా బాధ్యత వహించాలనే భావన ప్రజల్లో తక్కువ.

Image copyright Getty Images

అతి తక్కువ ఆహారంతో అంత కాలం ఎలా మనగలిగారు? బరువు పెద్దగా తగ్గలేదు ఎందుకు?

ఈ బాలురు గుహల్లో చిక్కుకుపోయిన తొమ్మిది రోజుల తర్వాత వారిని గుర్తించారు. నైట్ పుట్టినరోజు వేడుక కోసం వారు కొన్న ఆహారంలో చాలా తక్కువ వారి దగ్గర మిగిలి ఉండొచ్చు.

ఫుట్‌బాల్ అంటే ఎంతో ఇష్టపడే క్రీడాకారులు. వారికి ఉన్న శిక్షణతో చాలా సన్నిహితమైన టీంగా తయారయ్యారు.

ఉన్న ఆహారాన్న జాగ్రత్తగా పంచుకుని, ఒకరికొకరు మద్దతుగా ఉండటానికి ఇది దోహదపడి ఉండొచ్చు.

ఆ బాలురికి ధ్యానం చేయటాన్ని కోచ్ ఎక్ బోధించాడని, అతడు స్వయంగా తిన్న ఆహారం కన్నా పిల్లలకు ఎక్కువ ఆహారం ఇచ్చాడని థాయ్ నేవీ డైవర్లు చెప్తున్నారు. కలుషితమైన నేల మీద జలం కన్నా.. పైన రాళ్ల నుంచి కారుతున్న నీటిని తాగాలని కూడా వారికి చెప్పాడతను.

గుహలో ఉన్న చివరి ఆరు నుంచి ఎనిమిది రోజుల పాటు వారికి ఆహారం అందించారు. మొదట హై-ప్రొటీన్ జెల్స్ అనంతరం సాధారణ ఆహారం ఇచ్చారు. దీనివల్ల వారు బయటకు రావటానికి ముందు కొంత బరువు పెరగటానికి అవకాశం లభించివుండొచ్చు.

Image copyright AFP/royal thai navy

గుహలో ఉన్నన్ని రోజులూ చీకట్లోనే ఉన్నారా?

ఎక్కువ కాలం చీకట్లోనే ఉన్నారు. వారు వెళ్లేటపుడు చౌకైన టార్చ్ లైట్లు తీసుకెళ్లారు. అవి ఎక్కువ కాలం పనిచేయలేదు. మొదటి తొమ్మిది రోజుల్లో అత్యధిక భాగం చీకట్లోనే ఉండి ఉండొచ్చు.

వారిని వెదికి గుర్తించిన తర్వాత థాయ్ ఆర్మీ డాక్టర్ ఒకరు, మరో ముగ్గురు డైవర్లు వారితోనే ఉన్నారు. వారి దగ్గర మంచి టార్చ్ లైట్లు ఉన్నాయి. అయినా కానీ వారు ఎక్కువగా చీకట్లోనే ఉన్నారు. వారిని మొదట బయటకు తీసుకొచ్చినపుడు సన్‌గ్లాస్‌లు ధరించాల్సి వచ్చింది.

వారికి ఏ విధంగానైనా మత్తు ఇచ్చారా?

ఈ విషయంలో థాయ్ అధికారులు చాలా రహస్యంగా వ్యవహరిస్తున్నారు.

వారికి కొద్దిగా మత్తు ఇచ్చినట్లు ప్రధానమంత్రి ప్రయుత్ చాన్-ఓచా చెప్పారు. అయితే.. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న ఒక సభ్యుడితో బీబీసీ మాట్లాడినపుడు.. ఆ పిల్లలకు చాలా ఎక్కువగా మత్తు ఇచ్చారని, వారు పాక్షికంగానే మెలకువగా ఉన్నారని అతడు చెప్పారు.

మొదటిసారిగా డైవింగ్ పరికరాలను ధరించటం, చీకట్లో, సుడులు తిరిగే గుహ నీటిలో ఆ పిల్లలు భయాందోళనలకు గురైపోయి తమతో పాటు, తమను రక్షించటానికి వచ్చిన వారి ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టే అవకాశముందని సహాయ చర్యలు చేపట్టిన వారు భయపడటం వల్ల ఇలా చేసినట్లు చెప్తున్నారు.

ఈ సహాయ చర్యలకు సారథ్యం వహించిన ఇద్దరు బ్రిటిష్ కేవ్ డైవర్లు (పాతాళ గుహ నీటిలో ఈదే గజఈతగాళ్లు) జాన్ ఒలాంథెన్, రిచర్డ్ స్టాన్టన్.. పిల్లలను బయటకు తీసుకురావటానికి సిద్ధం చేయటంలో సాయం చేయాల్సిందిగా ఆస్ట్రేలియాకు చెందిన కేవ్ డైవర్, అనస్తీటిషియన్ రిచర్డ్ హారిస్‌ను కోరినట్లు భావిస్తున్నారు.

గుహల నుంచి బయటకు రావటానికి సాంకేతికంగా సవాళ్లతో కూడుకున్న.. బాగా ఇరుకైన సందుల గుండా నీటిలో మునిగి ప్రయాణించాల్సిన అవసరం ఎక్కువగా ఉన్న మొదటి దశల్లో.. చాలా మగతలో ఉన్న, పాక్షికంగానే స్పృహలో ఉన్న పిల్లలను ఎలా తీసుకువచ్చారనేది ఇంకా తెలియదు.

కొన్నిసార్లు ఈ పిల్లలను ఒక డైవర్ శరీరానికి కట్టేసి ఉండొచ్చు. ఇంకొన్నిసార్లు ఒక స్ట్రెచర్ మీద కట్టేసి.. గుహ పైభాగంలో గిలక ఏర్పాటు చేసి దాని ద్వారా తాళ్లతో లాగి ఉండొచ్చు.

ఈ మొత్తం ఆపరేషన్ చాలా సంక్లిష్టమైనది. వినూత్నమైనది. చాలా సాహసోపేతమైనది. ఇలాంటి ఆపరేషన్‌కు గతంలో ఎన్నడూ ప్రయత్నించలేదు. ఆ పిల్లలను బయటకు తీసుకొచ్చిన ముఖ్యమైన డైవర్లు చేసిన పనులు మానవాతీతమైనవని.. ఈ చర్యల్లో పాల్గొన్న కొందరు అభివర్ణించారు.

Image copyright THAI NAVY SEALS/GETTY IMAGES
చిత్రం శీర్షిక బాలురు మానసికంగా, శారీరకంగా కోలుకోవటం కోసం సహాయ చర్యల్లో పాల్గొన్న వారు ఆహారం, లైట్లు, వారి తల్లిదండ్రుల నుంచి లేఖలు తెచ్చి ఇచ్చారు

ఈ ఆపరేషన్‌కు అయిన ఖర్చు ఎవరు చెల్లించారు?

అత్యధిక భాగం థాయ్ ప్రభుత్వమే చెల్లించింది.

సహాయ చర్యల్లో పాల్గొనటానికి వచ్చిన అమెరికా వైమానిక దళానికి చెందిన 30 మంది సిబ్బంది వంటి ఇతర దేశాలు చేసిన సహాయాలకు.. ఆయా దేశాలు సుహృద్భావంగా నిధులు సమకూర్చి ఉండొచ్చు.

రవాణా, ఆహారం విషయంలో చాలా థాయ్ వాణిజ్య సంస్థలు మద్దతు ఇచ్చాయి. ఈ ఆపరేషన్‌లో పాల్గొనటానికి వచ్చిన విదేశీ డైవర్లు కొందరికి థాయ్ ఎయిర్‌వేస్, బ్యాంకాక్ ఎయిర్‌వేస్ విమాన ప్రయాణాన్ని ఉచితంగా అందించాయి.

Image copyright AFP/GETTY
చిత్రం శీర్షిక ఈ భారీ ఆపరేషన్‌లో విదేశీ డైవర్లు కీలక భూమిక పోషించారు

థాయ్ ప్రభుత్వం సొంతంగానే ఈ పని చేసి ఉండేదా?

లేదు. ఈ పని చేయగలిగే దేశాలు చాలా తక్కువ. కేవ్ డైవింగ్ అనేది చాలా విశిష్టమైన నైపుణ్యం. నిపుణులైన కేవ్ సంరక్షుకులు ఇంకా అరుదు.

వెర్న్ ఉన్స్‌వర్త్ అనే అనుభవజ్ఞుడైన గుహ నిపుణుడు థామ్ లువాంగ్ గుహల సముదాయాన్ని విస్తృతంగా పరిశోధించటం.. సమీపంలోనే నివసిస్తుండటం.. ఈ వ్యవహారంలో థాయ్‌లాండ్‌కు అదృష్టంగా మారింది.

పిల్లలు కనిపించకుండాపోయిన మరుసటి రోజే ఆయన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సాయం కోసం ఇతర దేశాల నుంచి నిపుణులైన డైవర్లను పిలిపించాల్సిన అవసరముందని థాయ్ ప్రభుత్వానికి సూచించారు.

మొదట్లో గుహ లోపలికి వెళ్లిన థాయ్ డైవర్లు చాలా కష్టపడ్డారు. ఎందుకంటే.. వారి అనుభవం, పరికరాలు అన్నీ సముద్రంలో డైవింగ్‌కు సంబంధించినవే. అవి చాలా భిన్నమైనవి. వేగంగా పెరుగుతున్న వరద నీటి వల్ల వారు గుహల నుంచి బయటకు వచ్చేయక తప్పలేదు. ఆ పిల్లలను వెదికిపట్టికునే ఆశలు వదులుకోవాల్సిరావచ్చునని భావించారు.

అయితే.. వేర్వేరు దేశాల నుంచి విదేశీ డైవర్లు వచ్చిన తర్వాత.. మొదట గాలింపు ఎలా చేపట్టాలో వారే వ్యూహం రచించుకునేందుకు థాయ్ ప్రభుత్వం అనుమతించింది. ఆ తర్వాత పిల్లలను బయటకు తీసుకురావటానికి ఎంతో సంక్లిష్టమైన ఆపరేషన్ ప్రణాళికను కూడా వారే రచించారు. వందలాది మందితో.. దారిచూపే తాళ్లను, గుహ పై భాగంలో పుల్లీ వ్యవస్థలను నిర్మించటం.. విద్యుత్, సమాచార వ్యవస్థల వైర్లను ఏర్పాటు చేయటం.. చాలా భారీ ఆపరేషన్ ఇది.

దీనిని థాయ్‌లాండ్ ప్రభుత్వం చాలా బాగా నిర్వహించింది. విదేశీ సాయాన్ని తక్కువచేయటానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionస్కూలుకెళ్లే చిన్నారులను ఎలా రక్షించుకోవాలి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు