‘తిప్పేసిన’ కుల్దీప్: ఇంగ్లండ్ మ్యాచ్‌లో 25 పరుగులకు 6 వికెట్లు

  • 13 జూలై 2018
కులదీప్ యాదవ్ Image copyright Getty Images

భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్లు తీసి భారత్ గెలుపును సులభతరం చేశాడు. మొదట బెయిర్‌స్టో, జేసన్ రాయ్, జో రూట్‌లను వెంటవెంటనే పెవిలియన్‌కు పంపాడు.

మొత్తం 25 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. అతని కెరీర్‌లో ఇదే బెస్ట్.

అంతకు ముందూ ఐర్లాండ్, ఇంగ్లండ్‌‌తో మ్యాచుల్లో తన బౌలింగ్‌తో సంచలనం సృష్టించాడు.

తాజా మ్యాచ్ లైవ్ స్కోర్.. అప్‌డేట్స్‌ని ఇక్కడ చూడొచ్చు

కుల్దీప్ పవర్ పంచ్

ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి ట్వంటీ-20 మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన కుల్దీప్ మిగతా మ్యాచుల్లో కూడా తన జోరు కొనసాగుతుందని ఆతిథ్య జట్టుకు హెచ్చరిక పంపించాడు. అందుకు తగ్గట్టే వన్డేల్లో విజృంభించాడు.

అంతకు ముందు ఇంగ్లండ్‌పై 8 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందిన మ్యాచ్‌లో కుల్దీప్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. "ఇది ఇంగ్లండ్‌లో నా మొదటి పర్యటన. పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి. తర్వాత మ్యాచ్‌లో కూడా మేం ఇలాగే చేయాలనుకుంటున్నాం" అన్నాడు.

కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా కుల్దీప్ వల్లే ఈ విజయం దక్కిందని అన్నాడు

Image copyright ALLSPORT/GETTY IMAGES

ఫాస్ట్ బౌలర్ కాబోయి స్పిన్నర్ అయ్యాడు

ఆసక్తికరమైన విషయం ఏంటంటే క్రికెట్ ట్రైనింగ్ ప్రారంభించినపుడు కుల్దీప్ ఫాస్ట్ బౌలర్‌ కావాలని అనుకున్నాడు.

1994లో ఉత్తర ప్రదేశ్ కాన్పూర్‌లో పుట్టిన కుల్దీప్ యాదవ్‌కు రిస్ట్ స్పిన్నర్( మణికట్టుతో బంతిని తిప్పే స్పిన్ బౌలర్)అవమని అతడి కోచ్ సలహా ఇచ్చాడు. దాన్ని అమలు చేయడం అంత సులభం కాకపోయినా కుల్దీప్ శ్రమ ఫలించింది. పిచ్‌పై అద్భుతాలు సృష్టించేలా చేసింది.

అండర్-19, ఇండియా ఎ, ఉత్తర్ ప్రదేశ్ తరఫున అద్భుతాలు చేసిన కుల్దీప్ తర్వాత భారత జట్టులో భాగమయ్యాడు.

Image copyright ALLSPORT/GETTY IMAGES

2017లో కుల్దీప్ ట్వంటీ-20, వన్డే, టెస్ట్ కెరీర్ కూడా ప్రారంభమైంది.

2017 మార్చిలో ధర్మశాలలో ఆస్ట్రేలియాతో కుల్దీప్ తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి భారత్ విజయానికి మార్గం సుగమం చేశాడు.

రెండు టెస్ట్ మ్యాచుల్లో 9 వికెట్లు తీసిన కుల్దీప్, 20 వన్డేల్లో 39 వికెట్లు, 11 ట్వంటీ-20 మ్యాచుల్లో 24 వికెట్లు పడగొట్టాడు.

గిరగిరా తిరుగుతూ దూసుకొచ్చే కుల్దీప్ బంతులు ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్‌ను ఎంత మాయ చేస్తున్నాయో ఈ గణాంకాలే నిరూపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)