డొనాల్డ్ ట్రంప్: థెరెసా మేదీ.. నాదీ గట్టి బంధం

డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్ష హోదాలో బ్రిటన్‌లో పర్యటిస్తున్నారు. గురువారం నాటో సదస్సులో పాల్గొన్న ఆయన శుక్రవారం బ్రిటన్ ప్రధాని థెరెసా మేతో భేటీ అవుతున్నారు. కాగా, రెండు దేశాల అధినేతల ముఖాముఖి భేటీకి ముందే వాతావరణం వేడెక్కింది.
థెరెసా మే కనుక తన బ్రెగ్జిట్ ప్రణాళికను యథాతథంగా ముందుకు తీసుకెళ్తే అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు జరక్కపోవచ్చని ట్రంప్ అన్నారు.
'ది సన్' వార్తాసంస్థతో మాట్లాడిన ఆయన.. థెరెసా మే బ్రెగ్జిట్ ప్రణాళిక భవిష్యత్తులో అమెరికాతో వాణిజ్య ఒప్పందాల అవకాశానికి తెరదించొచ్చని అన్నారు.
ట్రంప్ మరో సంచలన వ్యాఖ్య కూడా చేశారు. మే కేబినెట్ నుంచి ఇటీవల రాజీనామా చేసిన విదేశాంగ మంత్రి బోరిస్ జాన్సన్ సమర్థుడని, ఆయన బ్రిటన్‌కు గొప్ప ప్రధాని కాగలరని అన్నారు.
కాగా, ట్రంప్ వ్యాఖ్యలపై థెరెసా మే కార్యాలయం నుంచి ఇంతవరకు ఎలాంటి ప్రతిస్పందన వెలువడలేదు.
తర్వాత ట్రంప్.. థెరెసా మేదీ తమదీ గట్టి బంధం అని విలేకర్ల సమావేశంలో అన్నారు. అమెరికా, బ్రిటన్ సంబంధం చాలా ప్రత్యేకమైందని చెప్పారు.
- బ్రిటన్: బ్రెగ్జిట్ మంత్రి డేవిడ్ డేవిస్ రాజీనామా
- అమెరికా-బ్రిటన్ చారిత్రక సంబంధాలకు డొనాల్డ్ ట్రంప్ ముగింపు పలుకుతారా?
‘ఏం చేయాలో చెప్పాను.. అయినా, నా మాట వినలేదు’
అంతకుముందు గురువారం ట్రంప్ బ్రిటన్‌లో అడుగుపెట్టగానే ఘన స్వాగతం లభించింది. ఆక్స్ఫర్డ్షైర్లోని బ్లెన్‌హీమ్ ప్యాలస్‌లో ట్రంప్ దంపతులకు ఎర్ర తివాచీ పరిచారు. ప్రధాని మేతో కలిసి ట్రంప్ దంపతులు అక్కడ విందారగించారు.
బ్రెగ్జిట్ విషయంలో ప్రజలు తమ ఓట్ల ద్వారా వెల్లడించిన అభిప్రాయానికి భిన్నంగా థెరెసా మే ప్రణాళికలు ఉన్నాయని ట్రంప్ 'ది సన్'తో అన్నారు.
బ్రెగ్జిట్ ఒప్పందం ఎలా ఉండాలో తాను థెరెసా మేకు తెలిపానని.. కానీ, ఆమె తన మాట వినలేదని ట్రంప్ చెప్పారు.
వాణిజ్యం విషయంలో ఐరోపా సమాఖ్య అమెరికాతో నిజాయితీగా వ్యవహరించలేదని, అందుకే ఈయూ పట్ల తమ వైఖరి కఠినంగా ఉందని అన్నారు.
ఐరోపా సమాఖ్యతో సుదీర్ఘ కాలం సంబంధాలు కొనసాగించడానికి చేసిన ప్రతిపాదనలను బ్రిటన్ ప్రభుత్వం విడుదల చేసిన రోజునే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
బ్రిటన్ విడుదల చేసిన ప్రతిపాదనల్లో వాణిజ్య సహకారం, ఉత్తర ఐర్లాండ్‌తో స్వేచ్ఛా సరిహద్దు, అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు వంటివన్నీ ప్రస్తావించారు.
- బ్రెగ్జిట్ బిల్లుపై థెరెసా సర్కారుకు ఎదురుదెబ్బ
- అధ్యయనం: ‘కోపం వస్తే కోప్పడండి.. నవ్వొస్తే నవ్వండి.. ఏదీ దాచుకోవద్దు’
నిరసనల సెగ
కాగా ప్రభుత్వ ప్రణాళికలను తిరస్కరిస్తూ మంత్రులు బోరిస్ జాన్సన్, డేవిడ్ డేవిస్ థెరెసా మే కేబినెట్ నుంచి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు బ్రిటన్ ప్రజలు కోరుకున్నది జరగడం లేదంటూ ట్రంప్ ఇంతకుముందు చేసిన వ్యాఖ్యలపై మే స్పందిస్తూ... ఈయూ ముందు పెడుతున్న ప్రతిపాదనలు తమ ప్రజలు కోరుకున్నది అందించగలవని అన్నారు.
గురువారం ట్రంప్ దంపతులకు ఇచ్చిన విందు సందర్భంగా థెరెసా మే మాట్లాడుతూ.. బ్రిటన్ సంస్థల్లో 10 లక్షల మందికిపైగా అమెరికన్లు పనిచేస్తున్నారని చెప్పారు. ఈయూని వీడుతున్న నేపథ్యంలో తాము మరిన్ని కార్యక్రమాలు చేపట్టడానికి మునుపెన్నడూ లేని అవకాశం లభిస్తోందని అన్నారు.
బ్రిటన్‌తో పాటుగా అమెరికాలోనూ అనేక ఉద్యోగావకాశాలను సృష్టించే, అభివృద్ధికి మార్గమేసే స్వేచ్ఛా వాణిజ్య సంబంధాలు పెంచుకోవడానికి ఇదో అవకాశమని ఆమె చెప్పారు.
మరోవైపు ట్రంప్‌కు నిరసనల సెగ తగులుతోంది. ఆయన బ్రిటన్ చేరుకోగానే అక్కడి అమెరికా రాయబారి నివాసం రెజెంట్స్ పార్క్ ముంగిట సుమారు వెయ్యి మంది చేరి ప్రదర్శనలు జరిపారు.
వారాంతం సొంత రిసార్టులో..
శుక్రవారం ట్రంప్, మేలు అమెరికా, బ్రిటన్ ప్రత్యేక దళాలు సంయుక్తంగా నిర్వహించే ఉగ్రవాద నిరోధక విన్యాసాలను తిలకించనున్నారు.
అనంతరం వారు బకింగ్‌హామ్‌షైర్‌లోని థెరెసా మే నివాసంలో సమావేశమై చర్చలు జరపనున్నారు.
శుక్రవారం మధ్యాహ్నం ట్రంప్ దంపతులు ఎలిజబెత్ రాణిని కలుస్తారు. అక్కడి నుంచి ట్రంప్ దంపతులు స్కాట్లాండ్లో ఉన్న తమ 'టర్న్బెరీ గోల్ఫ్ రిసార్ట్'లో వారాంతాన్ని గడిపేందుకు వెళ్తారు.
ఇవి కూడా చదవండి:
- థాయ్‌లాండ్: ‘గుహలో పిల్లల కథ’తో హాలీవుడ్ సినిమా
- స్థానిక పత్రికలు లేకుంటే సమాజం ఏమవుతుంది?
- సానుభూతి, సైన్యం, ఫేక్ న్యూస్, మతం: పాక్ ఎన్నికల్లో వీటి మధ్యే పోటీ
- దక్షిణాది పురుషుల్లో తగ్గుతున్న వీర్య కణాలు.. ఏపీలో 5శాతం మందికి సంతాన లేమి
- ఉరే సరి: నిర్భయ కేసులో రివ్యూ పిటిషన్ కొట్టేసిన సుప్రీం కోర్టు
- ప్రపంచం నుంచి చీకటిని మానస తరిమేయాలనుకుంటోంది. ఇలా..
- అమెరికాలో 10శాతం మందికే పాస్‌పోర్టులు.. నిజమేనా?
- YouTube Stars: అమ్మాయిల కోసం, అమ్మాయిల చేత, అమ్మాయిలతో.. ‘గాళ్ ఫార్ములా’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)