నిరసనల మధ్య స్కాట్లాండ్‌ చేరుకున్న ట్రంప్

ట్రంప్ దంపతులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

స్కాట్లాండ్‌లో దిగిన డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్

వేలాది మంది నిరసనల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్కాట్లాండ్‌లో అడుగుపెట్టారు.

యూకేలో తన రెండు రోజుల పర్యటన ముగించుకున్న ట్రంప్.. తన తల్లి స్వదేశమైన స్కాట్లాండ్ వెళ్లారు.

టర్న్ బెర్రీ గోల్ఫ్ రిసార్టులో ఆయన ఈ వారాంతం గడపనున్నారు.

అయితే.. ట్రంప్ పర్యటనను వ్యతిరేకిస్తూ అనేక మంది ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన చేపట్టారు. స్కాట్లాండ్ రాజధాని గ్లాస్గోలో దాదాపు 3,000 మంది నిరసన తెలిపారు.

ట్రంప్ "విభజన.. ద్వేషంతో కూడిన రాజకీయాల"ను తాము వ్యతిరేకిస్తున్నామన్న సందేశాన్ని పంపేందుకే ఈ ప్రదర్శన చేస్తున్నట్టు నిరసనకారులు తెలిపారు.

ట్రంప్ వెనక్కి వెళ్లిపోవాలంటూ కొందరు నినాదాలు చేశారు. మరోవైపు.. కొద్ది మంది ట్రంప్‌ పర్యటనకు అనుకూలంగా ప్రదర్శన చేపట్టారు.

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్,

ట్రంప్ అమలు చేస్తున్న వివాదాస్పద విధానాలను వ్యతిరేకిస్తున్నామని నిరసనకారులు తెలిపారు.

స్కాట్లాండ్ దేశం, అక్కడి ప్రజలంటే తనకు ఎంతో ఇష్టమని.. ఎన్నో ఏళ్లుగా ఎప్పుడూ ఆ దేశం వెళ్తుంటానని ట్రంప్ చెబుతుంటారు. అయితే.. అమెరికాకు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన స్కాట్లాండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.

ట్రంప్‌కు స్కాట్లాండ్ సెక్రటరీ డేవిడ్ ముండెల్ స్వాగతం పలికారు.

ఈ పర్యటనలో ట్రంప్ వెంట ఆయన సతీమణి మెలానియా ట్రంప్ కూడా ఉన్నారు.

స్కాట్లాండ్ వెళ్లే ముందు ఇంగ్లండ్‌లోని రాజ భవనం విన్సర్ క్యాజిల్‌‌లో బ్రిటన్ రాణిని ట్రంప్ కలిశారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)