ఈయన 66 ఏళ్ల పాటు గోళ్లు ఎందుకు పెంచారంటే..

66 ఏళ్లుగా గోళ్లు పెంచిన శ్రీధర్

ఫొటో సోర్స్, GUINNESS WORLD RECORDS

ఒక బస్సు పొడవున్న గోళ్లను అమెరికాలోని ఒక ప్రదర్శనలో చూపించారు.

వీటిని 82 ఏళ్ల వయసున్న శ్రీధర్ చిల్లాల్ పెంచారు. ఆయన 66 ఏళ్ల నుంచీ(1952 నుంచి ఇటీవల వరకూ) వాటిని పెంచారు.

2014, నవంబర్ 17న అత్యంత పొడవైన గోళ్లున్న వ్యక్తిగా ఆయన గిన్నిస్ రికార్డులోకి ఎక్కారు.

ప్రస్తుతం ఆయన తన రోజువారీ పనులకు ఆటంకం లేకుండా గోళ్లను కత్తిరించుకుంటున్నారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రకారం చివరగా శ్రీధర్ గోళ్లను కొలిచినప్పుడు, అవి 909.6 సెంటీమీటర్ల పొడవున్నాయి.

ఫొటో సోర్స్, Reuters

గోళ్లు పెంచడం వల్ల చేతులకు కష్టం

కానీ ఇప్పుడు ఆయన తన గోళ్లు కత్తిరించేశారు. వాటిని ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ మ్యూజియంలో ఉంచారు.

సుదీర్ఘ కాలంపాటు గోళ్లను కత్తిరించకపోవడం, అవి భారీగా పెరగడంతో శ్రీధర్ ఎడమ చేతికి రకరకాల సమస్యలు వచ్చాయి.

మహారాష్ట్రలోని పుణెకు చెందిన శ్రీధర్ గోళ్లు పెంచుతున్నప్పుడు తన వేళ్లను కదిలించలేకపోయేవారు. ఏదైనా పట్టుకోవాలంటే చేతిని తెరవలేకపోయేవారు.

66 ఏళ్లపాటు పెంచడంతో గోళ్ల పొడవుతోపాటూ వాటి మందం కూడా చాలా పెరిగింది. దాంతో శ్రీధర్ తన గోళ్లను కట్ చేయడానికి ఇనుప ముక్కలు కట్ చేసే చిన్న కట్టర్ ఉపయోగించాల్సి వచ్చింది.

2015లో గన్నీస్ వరల్డ్ రికార్డ్ టీమ్ శ్రీధర్‌ను ఇంటర్వ్యూ చేసింది. ఆ సమయంలో ఆయన " నా గోళ్లు చాలా సున్నితంగా ఉంటాయి. వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ముఖ్యంగా రాత్రి నిద్రపోయేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి". అన్నారు.

ఫొటో సోర్స్, RIPLEY'S; REUTERS

అసలు గోళ్లు ఎందుకు పెంచారు?

శ్రీధర్ అమెరికాలోని మ్యూజియంలో పెట్టిన తన గోళ్లను చాలా మెచ్చుకుంటారు.

కానీ 66 ఏళ్ల వరకూ ఆయన తన గోళ్లు ఎందుకు కత్తిరించుకోలేదు?. వాటిని అంత కాలం ఎందుకు పెంచాడు?

దానికి జవాబుగా "అది చాలా పాత కథ. అప్పుడు నాకు 14 ఏళ్లు. నా స్నేహితులతో స్కూల్లో ఆడుకుంటున్నా. అప్పట్లో మా టీచర్ ఒకరు ఏదో కారణంతో తన చిటికెన వేలి గోరు పెంచుకునేవారు. నేను ఆడుకుంటూ ఆమెకు గుద్దుకున్నా. అంతే ఆమె గోరు విరిగిపోయింది. టీచర్ నాపై చాలా కోప్పడ్డారు. దాంతో ఆమె కంటే పెద్ద గోళ్లు పెంచి చూపించాలని నేను మనసులోనే అనుకున్నా" అన్నారు శ్రీధర్.

ఫొటో సోర్స్, Reuters

గోళ్లు కత్తిరించాక ఎలా అనిపించింది?

చాలా కాలం తర్వాత గోళ్లు కత్తిరించిన శ్రీధర్‌కు ఎలా అనిపించింది.

"నేను నా గోళ్లను ఎప్పుడూ చాలా ప్రత్యేకంగా చూసుకున్నా. గోళ్లు చాలా సున్నితంగా ఉంటాయి. నేను వాటితో 66 ఏళ్లు ఉన్నా. వాటిని కత్తిరించాలని అనుకున్నప్పుడు, అది నాకు ఒక కఠిన నిర్ణయంలా అనిపించింది" అని శ్రీధర్ చెప్పారు.

గోళ్లు జాగ్రత్తగా భద్రపరుస్తామని న్యూయార్క్‌లోని 'రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్' మ్యూజియం అధికారులు తనకు భరోసా ఇచ్చారని శ్రీధర్ చెప్పారు.

"గోళ్లు కత్తిరించాలనే నిర్ణయం సరైనదే అని నేను నమ్ముతున్నా. వాటిని ఎవరైనా చూడాలనుకుంటే, మ్యూజియంకు వెళ్లి చూడచ్చు" అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)