గ్రీన్‌ల్యాండ్: ఊరిని భయపెడుతున్న భారీ ఐస్‌బర్గ్

  • 15 జూలై 2018
ఐస్‌బర్గ్ Image copyright Reuters

గ్రీన్‌ల్యాండ్‌‌లో ఒక గ్రామాన్ని ఒక భారీ ఐస్‌బర్గ్ భయపెడుతోంది. పశ్చిమ ప్రాంతంలో ఉండే తీర గ్రామం ఇన్నార్సూట్‌లో పలు ఇళ్లు ఈ ఐస్‌బర్గ్ నుంచి ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఈ ఐస్‌బర్గ్ చీలిపోయి, ఆ ప్రభావంతో అలలు ముంచెత్తితే ఈ ఇళ్లు మునిగిపోయే ఆస్కారముంది.

ఈ ప్రాంతంలో ఇంత పెద్ద ఐస్‌బర్గ్‌ను తామెన్నడూ చూడలేదని స్థానిక అధికారులు చెబుతున్నారు.

ఆర్కిటిక్, అట్లాంటిక్ మహాసముద్రాల మధ్య గ్రీన్‌ల్యాండ్ ఉంది. దేశంలో 17.99 లక్షల చదరపు కిలోమీటర్ల మేర మంచు విస్తరించి ఉంది.

ఇన్నార్సూట్ గ్రామ జనాభా 169 కాగా, ఐస్‌బర్గ్ నుంచి ముప్పున్న వారిని అధికారులు సురక్షిత ప్రదేశాలకు తరలించినట్లు డెన్మార్క్ వార్తాసంస్థ రిట్జావు తెలిపింది.

ఐస్‌బర్గ్‌ బీటలు వారిందని, అందులో రంధ్రాలు కూడా ఏర్పడ్డాయని గ్రామ మండలి సభ్యులు సుసాన్ ఎలియాసెన్ మీడియాతో చెప్పారు. గ్రామ విద్యుత్ కేంద్రం, ఇంధన ట్యాంకులు తీరానికి దగ్గర్లో ఉన్నాయని ఆమె తెలిపారు.

గ్రీన్‌ల్యాండ్ వాయవ్య ప్రాంతంలో గత వేసవిలో భూకంపం కారణంగా అలలు ఎగసిపడి కొన్ని ఇళ్లు నీట మునగడంతో నలుగురు చనిపోయారు.

వాతావరణ మార్పుల వల్లే భారీ ఐస్‌బర్గ్‌ల నుంచి ముప్పు పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. జూన్‌లో న్యూయార్క్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు విడుదల చేసిన ఒక వీడియో తూర్పు గ్రీన్‌ల్యాండ్‌లో భారీ ఐస్‌బర్గ్ ఒకటి హిమానీనదం నుంచి వేరుపడటాన్ని చూపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)