‘అందరికీ చెడ్డ రోజులుంటాయి’.. ధోనీ ‘డిఫెన్స్’కి కోహ్లీ సమర్థన

ఎం.ఎస్.ధోని

సాహసోపేతమైన ఎదురుదాడి ఆటకు పేరుగాంచిన ఎం.ఎస్.ధోని లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌‌తో జరిగిన మ్యాచ్‌లో అసాధారణ రీతిలో రక్షణాత్మక వ్యూహం అవలంబించటాన్ని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సమర్థించారు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 86 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఇంగ్లండ‌తో జరిగిన ఈ రెండో వన్డేలో భారత జట్టు 323 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండగా 140 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో మాజీ కెప్టెన్ ధోనీ 27వ ఓవర్ చివర్లో ఆరో నంబరు బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగాడు.

ఆయన 59 బంతులు ఆడి 37 పరుగులు చేశాడు. అందులో కేవలం నాలుగు ఫోర్లే ఉన్నాయి. 47వ ఓవర్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

‘‘అందరికీ చెడ్డ రోజులు ఉంటాయి. ఈ రోజు ఆయన ఒక్కడికే కాదు.. మా అందరకీ చెడ్డ రోజే’’ అని ధోనీ గురించి కోహ్లీ వ్యాఖ్యానించాడు.

ప్రస్తుతం 37 ఏళ్ల వయసున్న ధోనీ తన 320వ అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లో అసాధారణ ఇన్నింగ్స్‌లో 10,000 పరుగుల మైలు రాయిని అందుకున్నారు. అయితే.. ఆయన ఇంగ్లండ్ జట్టు స్కోరును అధిగమించటంలో ఆయన విఫలమవటంతో ప్రేక్షకులు ‘బూ’ అంటూ గేలిచేశారు.

ఇంగ్లండ్ జట్టులో జో రూట్ 113 పరుగులు చేశారు. ఆయనకిది అంతర్జాతీయ వన్డేల్లో 12వ శతకం. మరో బ్యాట్స్‌మన్ డేవిడ్ బెల్లీ 31 బంతుల్లో 50 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వారిద్దరి సాయంతో ఇంగ్లండ్ జట్టు 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 322 పరుగులు చేసింది.

‘‘ధోనీ తన సహజ శైలిలో ఆడలేని ప్రతిసారీ ఈ విషయం ముందుకొస్తూనే ఉంటుంది’’ అని కోహ్లీ పేర్కొన్నాడు.

‘‘జనం త్వరగా ఒక అభిప్రాయానికి రావటం దురదృష్టకరం. ఆయన బాగా ఆడినపుడు.. అందరికన్నా గొప్పగా ఆటను ఫినిష్ చేస్తారని పొగుడుతారు. కానీ పరిస్థితులు అనుకూలించనప్పుడు జనం ఆయన మీదపడతారు’’ అని వ్యాఖ్యానించాడు.

సీనియర్ వికెట్‌కీపర్ ధోనీ.. ఎట్టకేలకు భారీ షాట్‌ కొట్టటానికి ప్రయత్నించినపుడు బౌండరీ వద్ద క్యాచ్ అందుకున్నారు.

భారత జట్టు మ్యాచ్ చివరి బంతికి 236 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది. మంగళవారం హెడింగ్లే‌లో జరుగనున్న మూడో మ్యాచ్ విజేతను నిర్ణయిస్తుంది.

ధోనీ వైఖరి పొరపాటు కాదని కోహ్లీ ఉద్ఘాటించారు. ‘‘ఇన్నింగ్స్‌ను చివరి వరకూ తీసుకెళ్లాలన్నది ఆయన ఆలోచన. ఆయనకు ఆ అనుభవం ఉంది. కానీ కొన్నిసార్లు అనుకున్నట్లు జరగదు’’ అని చెప్పాడు.

‘‘మేం ఆయనను, ఆటగాళ్లందరి సామర్థ్యాన్ని పూర్తిగా విశ్వసిస్తాం’’ అన్నాడు.

భారత జట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ 11వ నంబర్ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగి చివరిగా ఔటయ్యాడు. అతడు కూడా సీనియర్ ఆటగాడైన ధోనీని సమర్థించారు. ‘‘అప్పటికే మ్యాచ్ మా చేతుల్లోంచి జారిపోయింది. దీంతో తర్వాతి మ్యాచ్‌కి ప్రాక్టీస్‌గా మాత్రమే పరిగిణంచాం’’ అని అతడు వ్యాఖ్యానించాడు.

విశ్లేషణ

‘టెస్ట్ మ్యాచ్ స్పెషల్‌‘లో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్

లక్ష్య ఛేదనల్లో, క్లిష్ట పరిస్థితుల్లో చాలా బాగా ఆడతాడని ధోనీకి చాలా పేరుంది. కానీ ఈ రోజు అతడు దారుణంగా విఫలమయ్యాడని నేను అనుకుంటున్నా. ప్రేక్షకులు ఒక రకమైన వినోదం కోరుకున్నారు. వారిని నేను అర్థం చేసుకోగలను.

చివరి 15 ఓవర్లలో భారత జట్టు పూర్తిగా చేతులెత్తేసింది. జనం తలగోక్కోవాల్సిన పరిస్థితి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)