ఎక్కడ ఉంటే ఎక్కువ ఆరోగ్యం? పల్లెల్లోనా, పట్టణాల్లోనా?

  • రాచెల్ నువెర్
  • బీబీసీ ప్రతినిధి

కాలుష్యం వల్ల కావచ్చు, ఒత్తిడి వల్ల కావచ్చు.. నగరాల నుంచి పారిపోయి పల్లెల్లో ఉంటే సంతోషంతో పాటు ఆరోగ్యంగా ఉంటామని మీరు ఎప్పుడైనా అనుకున్నారా?

అది లక్షలాది మంది ఉన్న నగరం కావచ్చు, లేదా మనుషులెవరూ లేని పంట పొలాల మధ్య కావచ్చు.. ఆనందమయ జీవితానికి, మన చుట్టూ ఉన్న వాతావరణానికి మధ్య ఉన్న సంబంధాన్ని అన్వేషిస్తున్నారు పరిశోధకులు.

అయితే కేవలం పరిసరాలే కాదు, ఆ వ్యక్తి నేపథ్యం, జీవితంలోని సంఘటనలు, అతను ఏమేం పనులు చేశాడు, ఎంత కాలం చేశాడు అనేవి కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.

సర్వసాధారణంగా పట్టణ ప్రాంతాలలో ఉండే వారి ఆరోగ్యానికి పచ్చగా ఉండే ప్రదేశాలు మంచివి. పార్కులు లేదా చెట్లకు దగ్గరగా నివసించేవారు తక్కువ వాయుకాలుష్యం, శబ్దకాలుష్యం బారిన పడతారు. అంతే కాదు.. ఇతర నివాసాలతో పోలిస్తే వాళ్ల నివాసాలు చల్లగా కూడా ఉంటాయి.

కేవలం చెట్ల కింద తిరగడమో, కూర్చోవడమో చేస్తే చాలు.. రక్తపోటు, గుండె వేగం తగ్గుతాయి. అంతే కాకుండా లింఫోసైట్స్ అనే 'కిల్లర్ సెల్స్' శరీరం అంతా కలయదిరుగుతూ కేన్సర్ కారక, వైరస్ ప్రభావిత కణాలను వేటాడుతాయని పరిశోధనలు చెబుతున్నాయి.

దీనికి కారణాలను అన్వేషిస్తున్న పరిశోధకులు, ''జీవ పరిణామ రీత్యా చూసినపుడు మనం సహజమైన వాతావరణానికి అలవాటు పడి ఉన్నాం. అందువల్లే ఆరోగ్యం కోసం మనం వాటి వైపు మొగ్గు చూపుతాం'' అని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఆంబర్ పియర్సన్ అన్నారు.

ఇంతకూ ఆరోగ్యంగా జీవించాలంటే ఏవి మేలు? నగరాలా, పల్లె ప్రాంతాలా?

నగరాలు, పట్టణాలలో ఉండేవారే ఎక్కువగా ఆస్తమా, అలర్జీలు, డిప్రెషన్‌లాంటి వాటితో బాధపడుతుంటారు. అయితే నగరాలలో కాలుష్యం, నేరాలు, ఒత్తిడి ఎంత ఎక్కువగా ఉన్నా, గ్రామాలతో పోలిస్తే అక్కడ కొన్ని లాభాలున్నాయి. గ్రామాల మాదిరి కాకుండా పట్టణాలలో అంటువ్యాధులు, పురుగు పుట్రా గొడవ ఉండదు.

ఇక కాలుష్యం విషయాన్ని చూస్తే... కాలుష్యం కారణంగా ఎక్కడ ఎక్కువ మంది మరణిస్తున్నారు? మీ జవాబు పట్టణాలు అయితే మాత్రం మీరు తప్పు. చాలా దేశాలలో మరీ ప్రత్యేకించి భారతదేశంలో కాలుష్యం కారణంగా గ్రామాల్లోనే ఎక్కువగా మరణిస్తున్నారని ఒక పరిశోధనలో వెల్లడైంది.

ఉదాహరణకు 2015లో కాలుష్యం కారణంగా దేశంలో సుమారు 25 లక్షల మంది మరణిస్తే, వారిలో 75 శాతం మంది పల్లెల్లో ఉండేవారే. దీనికి కారణం గ్రామాల్లో పంట కోత అనంతరం వాటిని తగలబెట్టడం, పిడకలను కాల్చడం వంటి కారణాల వల్ల అక్కడ వాతావరణంలో కాలుష్యం పెరుగుతోంది.

ఇండోనేషియాలోనూ పోడు తరహా వ్యవసాయం కోసం చెట్లను తగలబెట్టడం వల్ల కొన్ని నెలల పాటు విషకరమైన వాయువులు వాతావరణంలో ఉంటున్నాయి. ఈ వాయువులు పక్కనే ఉన్న సింగపూర్, మలేషియా, థాయ్‌ల్యాండ్ లాంటి పక్క దేశాలపై కూడా ప్రభావం చూపుతున్నాయి.

దక్షిణ అమెరికా, ఆఫ్రికా దక్షిణ ప్రాంతాల్లోనూ ఇలాంటి మంటల వల్ల వెలువడుతున్న కాలుష్యం దక్షిణ గోళార్థం మొత్తంపై ప్రభావం చూపుతోంది. అలాగే యూరప్, రష్యా, చైనా, అమెరికాలలో పంట పొలాల్లో ఉపయోగిస్తున్న ఎరువులు, గ్రామీణ ప్రాంతాలలో వాతావరణ కాలుష్యం పెంచుతున్నాయి.

మరి పర్వతాలలో పరిశుభ్రమైన గాలి మాటేమిటి? ఎత్తైన ప్రాంతాలలో కాలుష్యం తక్కువగా ఉంటుంది. 2,500 మీటర్లకంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కార్డియోవాస్క్యులర్ జబ్బులు, గుండె జబ్బులు లేదా కొన్ని రకాల కేన్సర్ వచ్చే అవకాశం తక్కువ. అయితే అక్కడ శ్వాసకోశ వ్యాధులు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అందువల్ల పర్వత ప్రాంతాలలోనూ 1500 నుంచి 2500 మీటర్ల ఎత్తులో నివసించడం శ్రేయస్కరం.

మరోవైపు, సముద్రాలకు దగ్గరగా నివసించడంపై కూడా అనేక వాదనలున్నాయి. ఉదాహరణకు బ్రిటన్‌లో సముద్రానికి దగ్గరగా నివసించే వారు, భూభాగంలో నివసించే వారితో పోలిస్తే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటున్నారు. దీనికి కారణం సముద్ర ప్రాంతాల్లో జీవవైవిధ్యం ఎక్కువగా ఉండడంతో పాటు అక్కడ రోజూ వ్యాయామం చేసే అవకాశం ఉండడం , డి విటమిన్ పుష్కలంగా లభించడం.

ఇక మానసిక అంశాల విషయానికి వస్తే, రోజూ సముద్రాన్ని చూసే వారిలో మానసికమైన ఒత్తిడి తక్కువగా ఉంటుందని తేలింది. ఎంత నీలం రంగు కనుచూపు మేరలో ఉంటే ఒత్తిడి అంత తగ్గుతుందని గుర్తించారు. అమెరికాలో కొన్ని చెరువుల వద్ద నిర్వహించిన పరిశోధనలోనూ ఇదే తేలింది. అందువల్ల అనేక యూరప్ దేశాలలో ఎండిపోయిన జలవనరులను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అయితే ఆరోగ్యంపై ఆర్థిక పరిస్థితులు కూడా ప్రభావాన్ని చూపుతాయని గుర్తుంచుకోవాలి. పేదలకంటే ధనికులకే సహజమైన వాతావారణాన్ని అందుబాటులోకి తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

కేవలం పరిశుభ్రమైన పర్వత ప్రాంతాలలో, సముద్ర తీరాలకో వెళ్లినంత మాత్రాన ఆరోగ్య సమస్యలు పరిష్కారం కావు. మన నిత్య జీవితంలో జరిగే సంఘటనలు - ఉదాహరణకు ఉద్యోగం, పెళ్లి, విడాకులు, పిల్లలు లాంటి విషయాలు కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.

నిజానికి ఆధునిక మానవులు ఎక్కడ జీవించాలి అనే విషయంలో ప్రకృతికి దగ్గరగా ఉండడం అనే అంశానికి చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దానికన్నా ఎక్కువగా వాళ్లు విద్యా, వైద్య సౌకర్యాలు మొదలైన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

అలా అని ఆరోగ్యవంతమైన జీవితం కావాలన్నా, అలాగే దీర్ఘకాలం జీవించాలన్నా ప్రకృతిని పూర్తిగా పట్టించుకోకుండా ఉండకూడదు. ఈ రెండూ సమతుల్యంగా ఉన్న ప్రాంతాలను ఎంచుకుంటే మేలని పరిశోధకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)