#FIFA2018: 20 ఏళ్ల తర్వాత కప్పుగొట్టిన ఫ్రాన్స్

  • 15 జూలై 2018
ప్రపంచకప్‌తో ఫ్రాన్స్ జట్టు Image copyright Getty Images

రష్యాలో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ 2018ని ఫ్రాన్స్ కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో 4-2 గోల్స్ తేడాతో క్రొయేషియాపై విజయం సాధించింది.

ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను గెల్చుకోవటం ఫ్రాన్స్‌కు ఇది రెండోసారి. 20 ఏళ్ల కిందట సొంతగడ్డపై 1998లో జరిగిన ఫిఫా ప్రపంచకప్‌ను ఫ్రాన్స్ గెలిచింది.

ఆధునిక ఫుట్‌బాల్ చరిత్రలో అద్భుతమైన ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో ఒకటిగా భావిస్తున్న ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్, క్రొయేషియాలు హోరాహోరీగా తలపడ్డాయి. 1966 తర్వాత అత్యధిక గోల్స్ తేడా ఉన్న ఫైనల్ ఇదే.

మ్యాచ్ మొదలైన 19 నిమిషాల సమయంలో ఫ్రాన్స్‌కు తొలిగోల్ లభించింది. ఫ్రాన్స్ ఆటగాడు ఆంటోనీ గ్రిజ్‌మన్ కొట్టిన బంతి గోల్‌పోస్ట్‌లోకి వెళ్లకుండా క్రొయేషియా ఆటగాడు మారియో మన్‌డ్జుకిక్ తల అడ్డుపెట్టాడు. కానీ, ఆ బంతి గోల్‌పోస్ట్‌లోకి దూసుకెళ్లింది.

దీంతో ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో సెల్ఫ్ గోల్ చేసిన తొలి ఆటగాడిగా మారియో మండ్జుకిక్ వార్తల్లోకి ఎక్కాడు.

ఆ తర్వాత మరో 10 నిమిషాలకు క్రొయేషియా ఆటగాడు ఇవాన్ పెర్సిసిక్ కోల్ కొట్టి స్కోరును సమం చేశాడు. 16 గజాల దూరం నుంచి బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపిన ఇవాన్‌కు ఈ టోర్నమెంట్‌లో ఇది మూడో గోల్.

Image copyright Reuters
చిత్రం శీర్షిక గోల్ కొడుతున్న ఫ్రాన్స్ ఆటగాడు ఆంటోనీ గ్రిజ్‌మన్

మలుపుతిప్పిన వివాదాస్పద వీడియో అసిస్టెంట్ రిఫరీ

మ్యాచ్ 38 నిమిషాల సమయంలో ఆంటోనీ గ్రిజ్‌మన్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచటంతో ఫ్రాన్స్ పైచేయి సాధించింది. క్రొయేషియా ఆటగాడు ఇవాన్ పెర్సిసిక్‌ చేతికి బంతి తాకిందా? లేదా? అన్న సందిగ్ధంలో మ్యాచ్ రిఫరీ వీడియోను పరిశీలించి (వీడియో అసిస్టెంట్ రిఫరీ - వీఏఆర్) ఫ్రాన్స్‌కు పెనాల్టీ కార్నర్ ఇచ్చాడు. ఈ వివాదాస్పద వీఏఆర్ మ్యాచ్‌పై తీవ్ర ప్రభావం చూపింది.

రెండో అర్థభాగంలోనూ మొదటి గోల్ ఫ్రాన్స్‌దే అయ్యింది. 59వ నిమిషంలో ఫ్రాన్స్ ఆటగాడు పాల్ పొగ్బ గోల్ కొట్టి తమ జట్టు ఆధిక్యాన్ని 3-1కి పెంచాడు. కెలియన్ ఎంబప బంతిపై పట్టు సాధించి గోల్‌పోస్ట్ వరకూ తీసుకొచ్చి, ఆంటోనీ గ్రిజ్‌మన్‌కు అందించాడు. గ్రిజ్‌మన్ దాన్ని పొగ్బవైపు పంపగా.. పొగ్బ దాన్ని అద్భుతమైన గోల్‌గా మలిచాడు.

మ్యాచ్ 65వ నిమిషంలో కెలియన్ ఎంబపె మరో గోల్ కొట్టడంతో ఫ్రాన్స్ ఆధిక్యం 4-1కి పెరిగింది.

అయితే మరో నాలుగు నిమిషాల్లోనే మారియో మండ్జుకిక్ తన గోల్‌తో క్రొయేషియా జట్టుకు ఊరట కల్పించాడు. దీంతో ఫ్రాన్స్ ఆధిక్యం 4-2కు తగ్గింది.

కానీ, ఆ తర్వాత క్రొయేషియా పుంజుకోలేకపోయింది. దీంతో మ్యాచ్‌ను, ప్రపంచకప్‌ను ఫ్రాన్స్ కైవసం చేసుకుంది.

ఫ్రాన్స్, క్రొయేషియా రెండూ.. సెమీ ఫైనల్స్‌లో ఆడిన ఆటగాళ్లతోనే ఫైనల్ బరిలోకి దిగాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

హైదరాబాద్ 'ఎన్‌కౌంటర్‌‌'పై సుప్రీం కోర్టు: ముగ్గురు సభ్యులతో విచారణ కమిషన్‌కు ఆదేశం

గొల్లపూడి మారుతీరావు కన్నుమూత

ఆసిఫాబాద్ అత్యాచారం, హత్య కేసు: ‘ఆ శరీరం ఆడమనిషిలానే లేదు... నా కోడలిని బొమ్మలా ఆడుకున్నారు’

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి, అమెజాన్‌కి మధ్య వివాదంలో లాభపడిన మైక్రోసాఫ్ట్

రజినీకాంత్ @69: సినిమాలా? రాజకీయమా? జీవితంలోని కీలక సమంలో ఏ నిర్ణయం తీసుకుంటారు?

యువకుడిపై నలుగురి అత్యాచారం... ముంబైలో మూడు గంటల పాటు నరకం

పాకిస్తాన్ థార్ ఎడారి: ఇక్కడ ఆవుల బలిదానం ఉండదు, గోమాంసం విక్రయించరు

పౌరసత్వ సవరణ బిల్లుపై అస్సాంలో ఆందోళనలు, గువాహటిలో కర్ఫ్యూ, 10 జిల్లాల్లో ఇంటర్‌నెట్ నిలిపివేత