ట్రంప్, పుతిన్ భేటీ: ‘హెల్సింకి సమావేశానికి’ ఎందుకంత ప్రాధాన్యం?

ఫొటో సోర్స్, Reuters
చిరకాల ప్రత్యర్థులు అమెరికా, రష్యా దేశాల అధ్యక్షులు ఫిన్లాండ్ రాజధాని హెల్సింకిలో భేటీ కానున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ వైరం ఎప్పటిది?
అమెరికా, రష్యాల మధ్య వైరం ఈనాటిది కాదు. 1940 దశకంలోనే.. రెండు దేశాల మధ్య వైరం మొదలైంది.
సోవియట్ యూనియన్, అమెరికాల మధ్య నాలుగు దశాబ్దాలపాటు ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగింది. సోవియట్ యూనియన్ పతనమై, అమెరికా సూపర్ పవర్‌గా ఎదిగాక కూడా ఈ పరిస్థితుల్లో మార్పు లేదు.
2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుని, ట్రంప్‌కు అనుకూలంగా వ్యవహరించిందన్న ఆరోపణలు.. రెండు దేశాల మధ్య వైరాన్ని మరింత పెంచాయి.
మరోవైపు.. రష్యాకు పూర్వవైభవం తెచ్చేందుకు అధ్యక్షుడు పుతిన్ ప్రయత్నిస్తూ ఆ దిశగా పావులు కదుపుతున్నారు.
2014లో ఉక్రెయిన్ నుంచి క్రిమియాను స్వాధీనం చేసుకున్నాక ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. క్రిమియా వివాదం అనంతరం అమెరికాతోపాటు మరికొన్ని దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి.
ట్రంప్, పుతిన్‌ల సమావేశానికి ఎందుకంత ప్రాధాన్యం?
2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందన్నది అమెరికా ఆరోపణ. ఈ నేపథ్యంలో ట్రంప్-పుతిన్ మధ్య సంబంధాలు అంతర్జాతీయ వ్యవహారాల్లో చర్చనీయంగా మారాయి.
2016 అధ్యక్ష ఎన్నికల్లో.. ట్రంప్‌కు అనుకూలంగా రష్యా పని చేసిందని అమెరికా ఇంటెలిజెన్స్ విశ్వసిస్తోంది.
అమెరికా స్పెషల్ కౌన్సిల్ రాబర్ట్ ముల్లర్ దర్యాప్తులో.. 2016 ఎన్నికల్లో రష్యా పాత్ర ఏమిటి? ఆ రష్యా వ్యక్తులు ఎవరు? ట్రంప్‌కు చెందిన వ్యక్తులు అందుకు ప్రతిఫలంగా సదరు రష్యా వ్యక్తులకు ఏమైనా మేళ్లు చేశారా? అన్నవే ప్రధానాంశాలు.
కానీ ముల్లర్‌ను ట్రంప్ పదవి నుంచి తొలగించారు. ఇది ఒక ప్రజాస్వామిక కుట్రగా ముల్లర్ చెబుతారు.
2017లో అధికారంలోకి వచ్చాక, రష్యాతో సంబంధాలు మెరుగుపరచడానికి ట్రంప్ ప్రయత్నిస్తూనే ఉన్నారు.
క్రిమియా వివాదం అనంతరం రష్యాను జీ-7 కూటమి నుంచి బయటకు పంపారు. కానీ జూన్‌లో జరిగిన సమావేశంలో రష్యాను మళ్లీ జీ-7లో చేర్చుకోవాలనే ప్రతిపాదనను ట్రంప్ సమర్థించారు.
ఫొటో సోర్స్, Reuters
పొగడ్తల పర్వం
''పుతిన్ మంచి నాయకుడు.. మన అధ్యక్షుడు బరాక్ ఒబామా కంటే మెరుగైన నేత'' అని 2016లో ట్రంప్ అన్నారు. గత ఏడాదిలో.. 'పుతిన్ దృఢచిత్తుడు' అంటూ పొగిడారు. 2018 ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగానూ పుతిన్‌ను ట్రంప్ అభినందించారు.
పుతిన్ కూడా ''డొనాల్డ్ ట్రంప్ చురుకైన, శక్తివంతమైన నేత'' అని అన్నారు.
చర్చలో ఏ అంశాలు ఉండొచ్చు?
ట్రంప్-పుతిన్ భేటీలో చర్చకొచ్చే అంశాలపై విశ్లేషకుల అభిప్రాయం:
- అణ్వాయుధాల అంశం ప్రధానంగా చర్చకు వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. అణ్వాయుధాల తయారీని తగ్గించడం, వాటి సంఖ్యను పరిమితం చేసే అంశాల్లో ఇప్పటికే రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం ఉంది. 2021 వరకు అమల్లో ఉండే ఈ ఒప్పందాన్ని పొడిగించే దిశగా చర్చలు జరగవచ్చు. 1987లో చేసుకున్న క్షిపణి ఒప్పందంపైనా చర్చించే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయం.
- క్రిమియా వివాదం నేపథ్యంలో రష్యా కంపెనీలపై అమెరికా విధించిన ఆంక్షలు, ఉక్రెయిన్‌లో వేర్పాటువాదులకు రష్యా మద్దతు ఇవ్వడం, సిరియా యుద్ధంలో రష్యా పాత్ర, 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యాపై వస్తున్న ఆరోపణలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. రష్యాపై ఉన్న ఆంక్షలను సడలించాలంటే కాంగ్రెస్ అంగీకారం కావాలి. కానీ.. ఒకవేళ వీటిని సడలించే అవకాశం లేకపోతే, ఈ ఆంక్షలను కనీసం పొడగించకుండా ట్రంప్ ప్రయత్నిస్తారని, రష్యా కూడా అదే కోరుకుంటోందని విశ్లేషకులు చెబుతున్నారు.
- ఉక్రెయిన్‌కు అమెరికా ఇస్తోన్న సైనిక మద్దతును ఉపసంహరించుకోవాలని రష్యా ఆశిస్తోంది. ఈ విషయం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. పదివేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన తూర్పు ఉక్రెయిన్‌లో శాంతిని కోరుతున్నవారు అక్కడికి వెళ్లి పరిస్థితులను సమీక్షించేందుకు రెండు దేశాలూ అంగీకారం తెలపవచ్చు.
- ఇరాన్ సైన్యం, సిరియా మిత్ర దేశాల సైన్యాలు సిరియా సరిహద్దు నుంచి వెళ్లిపోవాలని అమెరికా మిత్ర దేశం ఇజ్రాయెల్ కోరుకుంటోంది. ఈ అంశాన్ని కూడా ట్రంప్.. ఈ సమావేశంలో ప్రస్తావించవచ్చు. కానీ పుతిన్ అందుకు సానుకూలంగా స్పందిస్తారని విశ్లేషకులు భావించడం లేదు.
ఫలితాలు ఎలా ఉండొచ్చు?
ఈ సమావేశం ఫలితాలను ఊహించడం చాలా కష్టం. ఇరువురు నేతలు ఏకాంతంగా సమావేశమవుతారనే వార్త.. మరింత ఆసక్తి రేపుతోంది.
ఇరు దేశాలూ గతంలో ప్రతీకారంతో ఉండేవి. ఇంగ్లండ్‌లో రష్యా గూఢచారిపై విష ప్రయోగమే అందుకు ఉదాహరణ. కానీ.. అందుకు భిన్నంగా, ఇరు దేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించే దిశగా ట్రంప్, పుతిన్ ప్రయత్నించే అవకాశం ఉంది.
ఇతర దేశాలపై ఎలాంటి ప్రభావం కన్పిస్తుంది?
సిరియా, ఉక్రెయిన్, క్రిమియా అంశాల్లో.. అమెరికా, రష్యాలు ప్రత్యర్థులుగా నిలిచాయి. ఈ రెండు దేశాల మధ్య మైత్రీబంధం నెలకొంటే, ఆ ప్రభావం ఇతర దేశాలపై చాలా ఉంటుంది.
యూరోపియన్ దేశాలు కూడా ఈ సమావేశాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి. ఈ సమావేశం పట్ల యూరోపియన్ దేశాలు కాస్త అసౌకర్యంగానే కన్పిస్తున్నాయి. అందుకు కారణం.. రష్యా గ్యాస్ నిక్షేపాలపై ఆ దేశాలు కొంతవరకూ ఆధారపడటమే.
వివాదాస్పదమైన 'నార్డ్ స్ట్రీమ్ -2'' ప్రాజెక్టులో జర్మనీని ట్రంప్ ఏకాకిని చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల రష్యా గ్యాస్ సరఫరా.. మధ్య, పశ్చిమ యూరప్ వరకు విస్తరిస్తుంది. ఈ కారణాలే.. ట్రంప్, పుతిన్ సమావేశంపై ఆసక్తిని పెంచుతున్నాయి.
దాంతో ప్రపంచ దేశాలు కళ్లు పెద్దవి చేసుకుని మరీ చూస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)