అఫ్గానిస్థాన్‌లో మరణ మృదంగం.. 6 నెలల్లో 1692 మంది బలి

తాలిబాన్లు

అఫ్గానిస్థాన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ప్రజల సంఖ్య గత 6 నెలల్లో రికార్డు స్థాయికి చేరినట్లు ఐక్యరాజ్య సమితి పేర్కొంది.

మరణాలకు ప్రధాన కారణంగా చెబుతోన్న తీవ్రవాద, ఆత్మాహుతి దాడుల్లో 1,692 మంది చనిపోయారు. ప్రధానంగా తాలిబాన్, ఐసిస్ దాడుల్లో పెద్ద ఎత్తున ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

2001లో అఫ్గానిస్థాన్ యుద్ధం ప్రారంభమైనా, 2009 నుంచి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్యను ఐక్యరాజ్య సమితి గణిస్తూ వచ్చింది. 2009 నుంచి ఇప్పటిదాకా సంభవించిన మరణాల్లో గత ఆరు నెలల గణాంకాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.

ఐక్యరాజ్య సమితి సహాయక కార్యక్రమం వెల్లడించిన నివేదిక ప్రకారం, గతేడాది మొదటి ఆరు నెలలతో పోలిస్తే, 2018 మొదటి ఆరు నెలల్లో సంభవించిన మరణాలు 1% మేర పెరిగాయి.

కాల్పులు విరమించినా ఆగని మరణాలు

గత నెలలో తాలిబాన్లు, అఫ్గానిస్థాన్ దళాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ మృతుల సంఖ్య పెరగడం గమనార్హం అని ఐక్యరాజ్య సమితి సహాయక కార్యక్రమ నివేదిక తెలిపింది.

అఫ్గానిస్థాన్ యుద్ధం గురించి చర్చించడానికి గత నెల బ్రస్సెల్స్‌లో నాటో దేశాలు సమావేశమయ్యాయి. '17 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ యుద్ధం గురించి మేం వ్యూహాత్మక సమీక్ష చేస్తాం' అని అమెరికా ప్రకటించింది.

2001 సెప్టెంబర్ దాడుల తర్వాత, అఫ్ఘానిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని అమెరికా గద్దె దింపింది. అందులో భాగంగా వేలాదిగా నాటో దళాలు రంగంలోకి దిగడంతో సుదీర్ఘ యుద్ధం ప్రారంభమైంది.

2014లో నాటో దళాలు యుద్ధ కార్యక్రమాన్ని పూర్తి చేసి, తక్కిన కార్యక్రమాన్ని అఫ్గాన్ దళాలకు అప్పగించింది. నాటి నుంచి తాలిబాన్ల దాడులు తిరిగి ప్రారంభమయ్యాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)