రష్యాతో బంధం నాలుగు గంటల కిందట మారిపోయింది: ట్రంప్

  • 16 జూలై 2018
ట్రంప్, పుతిన్ Image copyright Reuters

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల శిఖరాగ్ర సమావేశం ఫిన్లాండ్ రాజధాని హెల్సింకిలో సోమవారం జరిగింది.

ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన 2016 ఎన్నికల్లో రష్యా జోక్యంపై అమెరికాలో ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో.. ట్రంప్, పుతిన్ భేటీ వివాదాస్పదంగా మారింది.

పోలింగ్‌కి కొన్ని నెలల ముందు డెమొక్రటిక్ పార్టీ నాయకుల ఈ-మెయిళ్లను హ్యాక్ చేశారన్న ఆరోపణలకు సంబంధించి 12 మంది రష్యా సిబ్బంది మీద అమెరికా దర్యాప్తు సంస్థ శుక్రవారం అభియోగాలు ప్రకటించింది.

ఈ పరిస్థితుల్లో పుతిన్‌తో భేటీలో ట్రంప్ ఎందుకు పాల్గొంటున్నారని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ భేటీలో పుతిన్‌తో ట్రంప్ చాలాసేపు ఏకాంతంగా చర్చలు జరిపారు. అనంతరం ఇరువురు నేతలూ మీడియాతో మాట్లాడారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం ఆరోపణలపై పుతిన్‌తో సుదీర్ఘంగా చర్చించానని ట్రంప్ చెప్పారు. రష్యా ఏ విదేశీ ఎన్నికల్లోనూ జోక్యం చేసుకోలేదని పుతిన్ ఉద్ఘాటించారు.

21:31

ట్రంప్ ‘శృంగార కార్యకలాపాల సమాచారం’పై పుతిన్ స్పందన

డొనాల్డ్ ట్రంప్ శృంగార కార్యకలాపాలకు సంబంధించి రష్యా ప్రభుత్వం వద్ద ఒక విధమైన సమాచారం ఉందని చాలా కాలంగా వదంతులు వినిపిస్తున్నాయి. ఒక విలేకరి దీని గురించి నేరుగా పుతిన్‌ను ప్రశ్నించారు.

‘‘ఏం జరిగిందో తెలుసా: అలాంటిదేమీ తన దగ్గర లేదని పుతిన్ చెప్పారు’’ అని బీబీసీ వైట్ ‌హౌస్ ప్రతినిధి తారా మెక్‌కెల్వీ పేర్కొన్నారు.

అప్పుడు వ్యాపారవేత్తగా ఉన్న ట్రంప్ రష్యా వచ్చిన విషయమే తనకు తెలియదని కూడా పుతిన్ విలేకరులకు చెప్పారు.

21:27

రష్యా మీద ప్రశ్నకు సమాధానం దాటవేసిన ట్రంప్

అమెరికా ఎన్నికల్లో జోక్యం విషయంలో ‘మీ సొంత నిఘా సంస్థలను విశ్వసిస్తున్నారా? లేక రష్యా అధ్యక్షుడిని నమ్ముతున్నారా?’ అని విలేకరులు సూటిగా అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానం దాటవేశారు.

‘‘వాళ్లు నాదగ్గరకొచ్చారు. డాన్ కోటెస్ (నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్), మరికొందరు నా దగ్గరకు వచ్చి.. అది రష్యా అని తాము భావిస్తున్నట్లు చెప్పారు. రష్యా కాదని అధ్యక్షుడు పుతిన్ చెప్తున్నారు. అదే ఎందుకు కావాలనే దానికి కారణం నాకు కనిపించటం లేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

21:21

ఇప్పుడు బంతి మీ కోర్టులో ఉంది: పుతిన్

Image copyright AFP/Getty Images

వ్లాదిమిర్ పుతిన్ ఒక ఫుట్‌బాల్‌ను డొనాల్డ్ ట్రంప్‌కు అందించారు.

‘‘ఇప్పుడు బంతి మీ కోర్టులో ఉంది’’ అని వ్యాఖ్యానించారు.

‘ట్రంప్ గెలవాలని నేను కోరుకున్నా’

ట్రంప్ గెలవాలని తాను కోరుకున్నానని ఒక ప్రశ్నకు సమాధానంగా పుతిన్ అంగీకరించారు.

‘‘అవును కోరుకున్నా. ఎందుకంటే.. రష్యాతో సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావాలని ఆయన భావించారు’’ అని చెప్పారు.

అనుమానితుల అప్పగింత కోసం దరఖాస్తు చేసుకోవచ్చు

2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం ఆరోపణల గురించి పుతిన్ మరింత వివరంగా మాట్లాడారు. కుమ్మక్కయ్యారన్న ఆరోపణల్లో ఒక్కటైనా నిరూపించటానికి ‘ఒక్క వాస్తవాన్ని’ చెప్పాలని ఒక విలేకరికి సవాల్ చేశారు.

‘‘అదంతా చెత్త’’ అని వ్యాఖ్యానించారు.

దేశాల మధ్య వ్యక్తుల అప్పగింతకు సంబంధించి 1999లో జరిగిన ఒక ఒప్పందం గురించి కూడా పుతిన్ ప్రస్తావించారు.

‘‘ఆయన (రాబర్ట్ ముల్లర్) ఆ ఒప్పందాన్ని ఉపయోగించుకోవచ్చు’’ అన్నారు. ‘‘కొన్ని నేరాల గురించి తెలిసిన వారని ఆయన భావిస్తున్న వారిని అప్పగించటానికి అధికారిక విజ్ఞప్తిని మాకు పంపించొచ్చు. అప్పుడు మేం ఆ వ్యక్తులను విచారించగలం. ఈ పని చేయగల సమర్థత మా అధికారులకు ఉంది’’ అని చెప్పారు.

20:55

భిన్నాభిప్రాయాలపై ‘‘సుదీర్ఘంగా’’ చర్చించాం: ట్రంప్

Image copyright AFP/Getty Images

ట్రంప్ మాట్లాడుతూ.. ఈ చర్చలు ‘‘సూటిగా, దాపరికాల్లేకుండా, చాలా ఫలవంతమైన చర్చలు’’ అని అభివర్ణించారు.

‘‘మా రెండు దేశాల మధ్య అభిప్రాయభేదాలు బాగా తెలిసినవే. వాటి మీద అధ్యక్షుడు పుతిన్, నేను ఈ రోజు సుదీర్ఘంగా చర్చించాం’’ అని చెప్పారు.

‘‘అతివాద ఇస్లామిక్ ఉగ్రవాద విపత్తు’’ గురించి కూడా ఈ భేటీలో చర్చించామన్నారు.

దీనిపై కలిసి పనిచేయాలని అంగీకారానికి వచ్చినట్లు తెలిపారు.

‘రష్యాతో సంబంధం నాలుగు గంటల కిందట మారిపోయింది‘

ఆయన పుతిన్‌తో తన భేటీని సమర్థించుకుంటూ మాట్లాడారు.

‘‘ప్రచ్ఛన్న యుద్ధం ఉద్రిక్తతల మధ్య కూడా.. అమెరికా, రష్యాలు బలమైన చర్చలను కొనసాగించగలిగాయి’’ అని ఆయన విలేకరులతో పేర్కొన్నారు.

‘‘కానీ మా సంబంధాలు ఇంతలా ఎప్పుడూ దెబ్బతినలేదు. కానీ.. నాలుగు గంటల కిందట ఆ పరిస్థితి మారిపోయింది’’ అని వ్యాఖ్యానించారు.

‘‘పక్షపాత విమర్శకులు, మీడియా, ప్రతిపక్షాలను సంతృప్తి పరిచేలా.. చర్చలకు తిరస్కరించటం కన్నా రాజకీయంగా సులభమైనది ఏదీ ఉండద’’ని ఆయన చెప్పారు.

అయితే.. తాను రిస్కు తీసుకోవటానికే మొగ్గు చూపుతానన్నారు.

‘‘అధ్యక్షుడిగా.. అమెరికాకు ఏది ఉత్తమమైనదో.. అమెరికా ప్రజలకు ఏది ఉత్తమమైనదో దానికే ప్రాధాన్యమిస్తాను’’ అన్నారు.

‘ఎన్నికల్లో జోక్యం అంశాన్ని లేవనెత్తాను’

తాను అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన 2016 నాటి ఎన్నికల్లో రష్యా జోక్యంపై వస్తున్న ఆరోపణలను ప్రస్తావించానని చెప్పారు.

దీనిపై తాను, పుతిన్ సుదీర్ఘంగా చర్చించామని.. ‘‘ఈ సందేశాన్ని వ్యక్తిగతంగా అందించటం ఉత్తమమని’’ భావించటం వల్లే దీనిని ప్రస్తావించానని పేర్కొన్నారు.

అయితే పుతిన్ ఎలా స్పందించారన్న వివరాలేవీ ట్రంప్ చెప్పలేదు.

రష్యా - అమెరికా సంబంధాలు అధమస్థాయికి పడిపోవటానికి కారణం అమెరికా ‘‘అవివేకం, మూర్ఖత్వం’’ కారణమంటూ సోమవారం ఉదయం ఆయన చేసిన ట్వీట్ గురించి విలేకరులు ప్రశ్నించగా.. ఇందుకు కొంత భాగం రష్యా బాధ్యత కూడా ఉందని తాను భావిస్తున్నట్లు చెప్పారు.

‘రష్యా జోక్యంపై దర్యాప్తు మనల్ని విభజించింది’

‘‘అమెరికా అవివేకంగా ఉందని నేను అనుకుంటున్నా.. మనమంతా అవివేకంగా ఉన్నాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘రష్యాతో కలిసి అమెరికా ముందుకు కదులుతుంది... కొన్ని గొప్ప పనులు చేసే అవకాశమం మాకు ఉందని నేను భావిస్తున్నా’’ అన్నారు.

అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం అంశంపై దర్యాప్తు విషయంలో తన అసంతృప్తిని ట్రంప్ పునరుద్ఘాటించారు. ‘‘ఏ కుమ్మక్కూ లేదు’’ అని ప్రకటించారు. 2016 ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్‌ను తాను ఎలా ఓడించిందీ చెప్పుకొచ్చారు.

‘‘ఆ దర్యాప్తు మన దేశానికి ఒక విపత్తు. అది మనల్ని విభజించింది. అందులో కుమ్మక్కేమీ లేదు’’ అన్నారు.

‘‘అది స్వచ్ఛమైన ప్రచారం - హిల్లరీ క్లింటన్‌ను నేను సులువుగా ఓడించాను’’ అని చెప్పారు.

20:45

అణ్వస్త్ర శక్తులుగా..అంతర్జాతీయ భద్రత బాధ్యత మా మీద ఉంది: పుతిన్

విందు భేటీ అనంతరం ఇరువురు అధ్యక్షులూ సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడారు.

మొదట పుతిన్ మాట్లాడారు. ఆయుధాల నియంత్రణ మీద తాను నిర్దిష్టమైన ప్రతిపాదనలు చేసినట్లు చెప్పారు.

అంతర్జాతీయ భద్రత విషయంలో ‘‘అణ్వస్త్ర శక్తులుగా మా మీద బాధ్యత ఉంది’’ అని పేర్కొన్నారు.

అణు నిరాయుధీకరణ, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధాలతో పాటు.. అంతరిక్షంలో ఆయుధాలను మోహరించటాన్ని నివారించటానికి తమ రెండు దేశాలూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని రష్యా భావిస్తున్నట్లు వివరించారు.

అమెరికా, రష్యాల సైనిక వ్యూహాల పరస్పరం ఎదురుబొదురుగా ఉన్న సిరియాలో మరింత సహకారం అవసరమని పుతిన్ పిలుపునిచ్చారు.

Image copyright Getty Images

కొరియా చొరవకు ట్రంప్ మీద పుతిన్ ప్రశంసలు

కొరియా ద్వీపకల్పం విషయంలో ట్రంప్ వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవటం, ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్‌తో చర్చలు జరపటాన్ని ఆయన ప్రశంసించారు.

అయితే తామిద్దరి మధ్యా అన్ని అంశాలపై అంగీకారం కుదరలేదని తెలిపారు.

‘విదేశీ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదు‘

అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యంపై ఆరోపణల విషయాన్ని ట్రంప్ ఈ చర్చల్లో లేవనెత్తారని పుతిన్ చెప్పారు.

‘‘విదేశీ ఎన్నికల్లో రష్యా ప్రభుత్వం ఎన్నడూ జోక్యం చేసుకోలేదు, ఎన్నడూ జోక్యం చేసుకోదు కూడా’’ అని పేర్కొన్నారు.

‘కొన్ని సవాళ్లు ఇంకా ఉండిపోయాయి‘

తమ తొలి ‘‘పూర్తి స్థాయి సమావేశం’’ ఫలితాల పట్ల తాము సంతృప్తిగా ఉన్నామన్నారు.

అయితే.. ‘‘కొన్ని సవాళ్లు ఇంకా అలాగే ఉండిపోయాయి’’ అని చెప్పారు.

19:43

ట్రంప్ - పుతిన్ మధ్యాహ్న విందు: ఎవరెవరు పాల్గొన్నారు?

Image copyright AFP

ఆలస్యంగా జరుగుతున్న మధ్యాహ్న విందు భేటీలో ట్రంప్, పుతిన్ పాల్గొంటుండగా.. వారితో పాటు విందులో పాల్గొంటున్న వారెవరో చూద్దాం.

అమెరికా వైపు ఉన్న వారు:

రష్యా నిపుణురాలు ఫియోనా హిల్

అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

రష్యాలో అమెరికా రాయబారి జాన్ హంట్స్‌మన్

జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్

చిత్రంలో సరిగా కనిపించని.. వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జాన్ కెల్లీ

రష్యా వైపు ఉన్నవారు:

పుతిన్ ప్రెస్ కార్యదర్శి దిమిత్రీ పెస్కోవ్

అధ్యక్షుడికి విదేశాంగ విధాన సహాయకుడు యూరి ఉషకోవ్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్

అమెరికాలో రష్యా రాయబారి అనటోలి అనటోవ్

రష్యా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలో ఉత్తర అమెరికా విభాగాధిపతి జార్జీ బోరిసెన్కో

19:25

ఎన్నికల్లో జోక్యంపై ట్రంప్ మాట్లాడతారు: అధికారి

2016 ఎన్నికల్లో జోక్యం అంశాన్ని ట్రంప్ లేవనెత్తుతారని అమెరికా అధికారి ఒకరు బీబీసీ ప్రతినిధి తారా మెక్‌కెల్వీతో చెప్పారు.

క్రిమియాను కలుపుకున్న అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తారని ఆమె ట్వీట్ చేశారు:

తామిద్దరమూ ఏం మాట్లాడబోతున్నామనే విషయాల గురించి ట్రంప్ ఇంతకుముందు చెప్పినప్పుడు ఈ రెండు అంశాల్లో దేనినీ ప్రస్తావించలేదు.

అమెరికాలోని రష్యా రాయబార కార్యాలయం కొద్ది సేపటి కిందట ఇచ్చిన అజెండా జాబితాలో కూడా ఇవి లేవు.

అయితే.. ఎన్నికల్లో జోక్యం విషయాన్ని ట్రంప్ లేవనెత్తితే.. దేశద్రోహ సదస్సు అంటూ #TreasonSummit అనే హ్యాష్‌ట్యాగ్‌తో విమర్శలు చేస్తున్న కొందరిని అది శాంతింపచేయవచ్చు.

19:14

ట్రంప్: తొలి చర్చలు ‘శుభారంభం’

ఇరువురు అధ్యక్షులూ షెడ్యూలుకన్నా ఆలస్యంగా మధ్యాహ్న విందు చర్చలకు కూర్చున్నారు. పుతిన్‌తో తన ఏకాంత సమావేశం ‘మంచి శుభారంభం’ అని ట్రంప్ అభివర్ణించారు.

అయితే ఏం చర్చించారన్న దాని గురించి ఏమీ చెప్పలేదు.

19:07

ముగిసిన ట్రంప్ - పుతిన్ ఏకాంత చర్చలు

ఏకాంత చర్చలు ముగిశాయని రష్యా వార్తా సంస్థ ఇంటర్‌ఫాక్స్ పేర్కొంది. ఇరు దేశాల దౌత్యవేత్తలు మధ్యాహ్న విందులో పాల్గొన్న వేదిక ఫొటోలను ప్రచురించింది.

అయితే.. రెండు గంటల తర్వాత కూడా అధ్యక్షుల ముఖాముఖి సమావేశం ఇంకా కొనసాగుతోందని పాత్రికేయులకు చెప్పారు.

అంటే.. నిర్ధారిత సమయం కన్నా అరగంట ఎక్కువ సేపు ఆ భేటీ కొనసాగింది. ఇంకా ఇతర సీనియర్ అధికారులతో కలిసి ఇరువురు నేతలూ రెండోసారి భేటీ కావాల్సి ఉంది.

18:49

రెండు అజెండాల కథ

ఈ సమావేశానికి లాంఛనప్రాయమైన అజెండా ఏదీ లేదు. అయితే.. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని రష్యా రాయబార కార్యాలయం.. ఇరువురు నేతలూ చర్చించే అంశాలని పేర్కొంటూ ఒక ట్వీట్ చేసింది. అవి:

ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థితికి తీసుకురావటం

ఉక్రెయిన్

సిరియా

కొరియా ద్వీపకల్పం

ఉగ్రవాదం

కానీ.. వీటిలోని ఏ అంశాల గురించీ ట్రంప్ ప్రస్తావించలేదు. పైగా వాణిజ్యం, చైనా, సైనిక అంశాలు, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధం అంశాల గురించి ఆయన మాట్లాడారు.

18:40

హెల్సింకిలో ‘గర్భిణి ట్రంప్’ల నిరసన

హెల్సింకిలో సోమవారం కనిపించిన అసాధారణమైన దృశ్యాల్లో ‘‘గర్భిణి ట్రంప్‌ల’’ బృందం నిరసన ప్రదర్శన నిర్వహించటం ఒకటి:

అమెరికా ప్రభుత్వం నుంచి నిధులు అందుకునే స్వచ్ఛంద సంస్థలు.. ‘‘ఇతర దేశాల్లో కుటుంబ నియంత్రణ పద్ధతుల్లో భాగంగా గర్భస్రావాన్ని చేయటం కానీ, దానిని క్రియాశీలంగా ప్రోత్సహించటం కానీ చేయరాద’’న్న నిబంధనకు అంగీకరించాలనే నిబంధనకు నిరసనగా ఈ ప్రదర్శన చేపట్టారు.

‘‘గ్లోబల్ గ్యాగ్’’ (ప్రపంచ ఆంక్ష)గా అభివర్ణిస్తున్న ఈ విధానాన్ని డొనాల్డ్ ట్రంప్ 2017లో మళ్లీ అమలులోకి తెచ్చారు.

ఈ విధానం అమెరికాలో సేవలపై నేరుగా ప్రభావం చూపదు. కానీ.. నిధులు కానీ, సదుపాయాలు కానీ ఇప్పటికే పరిమితంగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని మహిళలపై ఇది ప్రభావం చూపుతుంది.

18:18

ఇరువురు నేతల సమావేశంలో సీరియస్ ముఖాలు

జేమ్స్ రాబిన్స్, దౌత్యరంగ ప్రతినిధి

Image copyright EPA

ఇద్దరు నాయకులూ పక్క పక్కన కూర్చున్నపుడు వారి ముఖాలు సీరియస్‌గా కనిపించాయి.

ఇద్దరూ తమ తమ దుబాసీల ద్వారా మీడియాతో పరిచయ వాక్యాలు చెప్పారు. ఇరువురు అధినేతలూ తమ తమ సలహాదారులు ఎవరూ లేకుండా ముఖాముఖి కలిసినపుడు వారితో ఈ దుబాసీలు మాత్రమే ఉంటారు.

తొలుత పుతిన్ మాట్లాడారు. తాము చర్చించాల్సిన అవసరమున్న క్లిష్టమైన అంతర్జాతీయ సమస్యలు చాలా ఉన్నాయని చెప్పారు.

ఫుట్‌బాల్ ప్రపంచ కప్ పోటీలను అసాధారణ రీతిలో నిర్వహించారంటూ పుతిన్‌కు ట్రంప్ అభినందనలు చెప్తూ మాటలు ప్రారంభించారు.

సంబంధాలు సరిగా లేకపోయినా తమ రెండు దేశాలకూ ఉమ్మడిగా గొప్ప అవకాశాలు ఉన్నాయని.. రెండు దేశాల మధ్య ‘‘అద్భుతమైన సంబంధం’’ నెలకొల్పుగోలమని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు.

కానీ దీనికి కొన్ని గంటల ముందు.. రష్యాతో సంబంధాలు చెడిపోవటానికి అమెరికా కారణమని ట్రంప్ ఒక ట్వీట్‌లో తప్పుపట్టారు.

ఇప్పటికే ఈ భేటీలో పుతిన్‌కు ఎక్కువ పేరు దక్కటంపై కలవరపడుతున్న అధ్యక్ష భవనం సలహాదారులను ఇది ఆందోళనకు గురిచేసే అవకాశముంది.

Image copyright Reuters

18:14

‘పుతిన్ అన్నిటికీ సిద్ధంగా ఉన్నారు’

పుతిన్ 2000 - 2004 సంవత్సరాల మధ్య రష్యా అధ్యక్షుడిగా ఉన్నపుడు.. రష్యా ప్రధానమంత్రిగా ఉన్న మిఖాయిల్ కస్యానోవ్.. ఇప్పుడు అమెరికాలో ప్రవాసముంటూ ప్రతిపక్ష పీపుల్స్ ఫ్రీడమ్ పార్టీకి నేతృత్వం వహిస్తున్నారు.

అమెరికా నుంచి ‘మృదువైన వైఖరి’ కావాలని పుతిన్ కోరుకుంటున్నారని.. అయితే ట్రంప్ ఆంక్షలను సడలించటానికి సంసిద్ధత వ్యక్తం చేస్తారని ఆయన నమ్మటం లేదని కస్యానోవ్ బీబీసీతో పేర్కొన్నారు.

‘‘అందుకే ఈ భేటీ ఇద్దరు అధ్యక్షులకీ ప్రచార కార్యక్రమం మాత్రమేనని నేను భావిస్తున్నా’’ అని ఆయన చెప్పారు.

అయితే ఇద్దరు నాయకులూ అనూహ్యంగా స్పందించగలరని అభిప్రాయపడ్డారు.

‘‘రష్యాలో మాకు అధికారవాద ప్రభుత్వం ఉంది. అంటే అన్నీ నాయకుడి మీద ఆధారపడి ఉంటాయి. పుతిన్ ఏ క్షణంలోనైనా దేనికైనా సిద్ధంగా ఉన్నారు’’ అని వివరించారు.

‘‘కానీ అనూహ్యంగా స్పందించటం వంటి లక్షణాలను పుతిన్ నుంచి ట్రంప్ దొంగిలించాడు.. ఇప్పుడు ఏం జరుగవచ్చుననేది ఎవరికీ అర్థం కాదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Image copyright AFP

17:58

హెల్సింకిలోనే భేటీ ఎందుకు?

అమెరికా అధ్యక్షుడిని రష్యా అధ్యక్షుడు ఫిన్‌లాండ్‌లో కలిశారు. ఎందుకు?

ఈ రెండు దేశాలతో సత్సంబంధాలున్న చరిత్ర ఫిన్‌లాండ్‌కు ఉంది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో తటస్థంగా ఉన్న ఫిన్‌లాండ్.. అప్పటి అమెరికా, మాజీ సోవియట్ యూనియన్ దేశాధ్యక్షుల మధ్య సమావేశాలకు ఆతిథ్యమిచ్చింది.

రష్యాతో ఈ దేశానికి పొడవైన సరిహద్దు ఉంది. రష్యా ప్రభుత్వంతో మంచి సంబంధాలూ ఉన్నాయి.

అలాగే.. ఇది నాటో సభ్య దేశం కూడా. సైనిక కూటమి అయిన నాటోతో రష్యా సంబంధాలు తరచుగా ఒడిదుడుకులకు లోనవుతుంటాయి.

భౌగోళికంగా కూడా ఫిన్‌లాండ్ సౌకర్యవంతంగా ఉంటుంది. ఇరువురు నాయకులూ బ్రిటన్ (ట్రంప్), రష్యా (పుతిన్) నుంచి తక్కువ సమయంలోనే ఇక్కడికి చేరుకోవచ్చు.

Image copyright Reuters

17:44

చర్చల వివరాలు లీక్ కాకుండా ఆంతరంగిక భేటీ

సీఎన్ఎన్ - ట్రంప్ తరచుగా లక్ష్యం చేసుకునే సీఎన్ఎన్ విలేకరి ఒకరు.. పుతిన్‌తో ట్రంప్ ఏకాంతంగా ముఖాముఖి ఎందుకు చర్చలు జరుపుతున్నారని ప్రశ్నిస్తున్నారు.

ఎటువంటి లీకులూ లేకుండా ఇతరుల జోక్యాలు లేకుండా ముఖాముఖి సమావేశం కావాలని ట్రంప్ కోరుకున్నారని వైట్ హౌస్ బృందం చెప్తోంది - మాట్లాడిన విషయాలకు సంబంధించి ఎటువంటి రికార్డులూ (నమోదు చేయటం) ఉండకపోవచ్చు.

17:36

ట్విటర్‌లో ట్రెండింగ్: ‘దేశద్రోహ సదస్సు’

పుతిన్‌తో ట్రంప్ భేటీ మీద సోషల్ మీడియా యూజర్లు కొందరు అసంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తోంది.

ఈ భేటీని ‘దేశద్రోహ సదస్సు’ అని అభివర్ణించే హ్యాష్‌ట్యాగ్ (#TreasonSummit) ట్విటర్‌లో ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది.

అమెరికాలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ట్విటర్ హ్యాష్ ట్యాగ్‌లలో అగ్రస్థాయిలో ఉంది.

Image copyright Twitter

17:21

సమస్యాత్మక అంశాలు చాలా ఉన్నాయి: పుతిన్

‘‘ఆతిధ్యపూర్వకమైన ఫిన్‌లాండ్ గడ్డ మీద హెల్సింకిలో మిమ్మల్ని కలవటం చాలా సంతోషకరం’’ అని ట్రంప్‌తో పుతిన్ పేర్కొన్నారు.

పుతిన్ రష్యా భాషలో మాట్లాడగా.. అనువాదకులు ఇంగ్లిష్‌లోకి అనువదించి ట్రంప్‌కు చెప్పారు.

‘‘మన మధ్య నిరంతర సమాచార సంబంధాలున్నాయి - మనం ఫోన్‌లో మాట్లాడుకున్నాం. వివిధ అంతర్జాతీయ కార్యక్రమాల్లో పలుమార్లు కలుసుకున్నాం. అవును, మన ద్వైపాక్షిక సంబంధాలు, ప్రపంచంలో వివిధ సమస్యా రంగాలపై సవివరంగా మాట్లాడుకోవాల్సిన సమయమిది. అవి చాలా ఉన్నాయి’’ అని పుతిన్ చెప్పారు.

16:59

ట్రంప్ కరచాలనంలో పట్టు తగ్గిందా?

పుతిన్ తన అధికారాన్ని ప్రదర్శించటానికి ఆలస్యంగా వస్తారని ప్రతీతి అయితే.. ట్రంప్ తన పైచేయిని చాటటానికి కరచాలనాన్ని ఉపయోగిస్తారని పేరుపడ్డారు.

అయితే.. ట్రంప్ ఇంతకుముందు ఇతర ప్రపంచ దేశాల నాయకులతో కరచాలనం చేసినంత బలంగా పుతిన్‌తో చేయలేదని పలువురు పరిశీలకులు వ్యాఖ్యానించారు.

16:48

ఫుట్‌బాల్‌ పోటీల్లో రష్యా ఉత్తమ ప్రదర్శనకు అభినందనలు: ట్రంప్

పుతిన్‌ని కలిసిన ట్రంప్.. ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీల్లో రష్యా ఎప్పటికన్నా ఉత్తమ ప్రదర్శన కనబరిచిందంటూ రష్యా అధ్యక్షుడికి అభినందనలు తెలిపారు.

ఇద్దరూ కలిసి మీడియా ముందు కరచాలనం చేసి కొద్ది నిమిషాలు ముచ్చటించారు.

ట్రంప్ మాటలను అనువాదకులు.. రష్యా భాషలోకి అనువదించి పుతిన్‌కు చెప్పారు.

వాణిజ్యం మొదలుకుని.. సైన్యం, చైనా అంశాల వరకూ ‘‘అన్నిటిపైనా’’ చర్చిస్తామని ట్రంప్ అన్నారు.

Image copyright Reuters

‘‘మన మధ్య సంబంధాలు (కొంత కాలంగా) సరిగా లేవు. దాదాపు రెండేళ్లు కావస్తోంది’’ అని వ్యాఖ్యానించారు.

‘‘రష్యాతో సత్సంబంధాలు మంచి విషయం.. చెడ్డ విషయం కాదు’’ అని పేర్కొన్నారు.

తమ అణ్వాయుధాల విషయమై తామిద్దరమూ ‘‘ఏదైనా చేయాల’’ని ఆశిస్తున్నట్లు కూడా ట్రంప్ చెప్పారు.

Image copyright Reuters

16:42

ఆలస్యంగా మొదలైన భేటీ...

ట్రంప్, పుతిన్ సమావేశం నిర్ధారిత సమయం కన్నా ఆలస్యంగా ప్రారంభమైంది.

అంతకుముందు పుతిన్ రావటం ఆలస్యం కావటంతో ట్రంప్ తను బస చేసిన హోటల్‌లోనూ ఆయన రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు.

పుతిన్ హెల్సింకి వచ్చిన తర్వాత భేటీ జరిగే వేదిక రాజభవనానికి ఆయన చేరుకున్న తర్వాతనే ట్రంప్ హోటల్ నుంచి బయలుదేరి వెళ్లారు.

షెడ్యూలు ప్రకారం ఇద్దరు నాయకులూ గంట సేపు ముఖాముఖి చర్చించనున్నారు. అనంతరం మధ్యాహ్న విందులో పాల్గొంటారు.

రెండున్నర గంటల తర్వాత సంయుక్తంగా విలేకరుల సమావేశంలో పాల్గొంటారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు