పాకిస్తాన్: సాధారణ ఎన్నికల బరిలో హిందువులు

  • షుమైలా జాఫ్రీ
  • బీబీసీ ప్రతినిధి
పాకిస్తాన్‌లోని హిందువులు

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్‌లోని చాలా ప్రాంతాల్లో హిందూ దేవాలయాలకు ప్రాధాన్యం తక్కువ. అలానే ఎన్నికల్లోనూ హిందూ ప్రతినిధులకూ, ముఖ్యంగా దళితులకూ ప్రాధాన్యం తక్కువేనని తెలుస్తోంది.

పాకిస్తాన్‌లో భారత సరిహద్దుకు దగ్గరగా ఉన్న థార్పర్కర్ జిల్లాలో హిందువుల జనాభా ఎక్కువ. అక్కడి నంగార్పర్కర్ ప్రాంతంలోని ఓ హిందూ దేవాలయానికి ఘన్షామ్ అనే వ్యక్తి అప్పుడప్పుడూ వెళ్లి పూజలు చేస్తుంటారు.

ఆ గుడిని తమ తాతయ్యే కట్టించారని ఘన్షామ్ చెబుతారు. 1971 భారత్-పాక్ యుద్ధం తరవాత అక్కడి చాలా హిందూ కుటుంబాలు భారత్‌కు వలస వచ్చేశాయి. అప్పటి నుంచీ ఆ దేవాలయం ఎలాంటి ఆదరణకూ నోచుకోలేదు.

ఆ గుడి చుట్టుపక్కల తమ కుటుంబానికి చెందిన 12వేల అడుగుల స్థలాన్ని స్థానిక వ్యక్తి ఒకరు ఆక్రమించారని ఘన్షామ్ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం తమ పరిస్థితి దుర్భరంగా ఉందనీ, స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తిపై కోర్టులో పోరాటం చేసే శక్తి లేదనీ ఆయన అంటున్నారు.

ఆ ప్రాంతంలో మైనార్టీలుగా ఉన్న హిందువులందరీ పరిస్థితీ అలానే ఉందని ఆయన చెబుతున్నారు.

ఫొటో క్యాప్షన్,

సునీతా పమార్

అదే థార్పర్కర్ జిల్లాలో మిట్టీ అనే నగరం నుంచి సునీతా పమార్ అనే మహిళ రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సునీత దళిత హిందూ వర్గానికి చెందిన మహిళ. కానీ ముస్లింలతో పాటు ముస్లిమేతరులు కూడా పవిత్రంగా భావించే సూఫీ ఆలయానికి మొక్కి ఆమె ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

తమ ప్రాంతంలో ఇంకా భూస్వామ్య వ్యవస్థ కొనసాగుతోందనీ, వారికి వ్యతిరేకంగా పోరాడేందుకు తమ వర్గానికి చెందిన మహిళల ప్రోత్సాహంతో ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు సునీత చెప్పారు.

కానీ సునీత ఎన్నికల్లో గెలిచే అవకాశం చాలా తక్కువ. పాకిస్తాన్‌లో మతపరంగా అతిపెద్ద మైనార్టీలు హిందువులే. కానీ భారత్-పాక్ విభజన తరవాత అక్కడ హిందువుల పరిస్థితి ఆశించినంతగా మెరుగుపడలేదు.

థార్పర్కర్‌లో దాదాపు సగం జనాభా హిందువులే అయినా, వాళ్లకు సరైన ఆర్థిక వనరులు, రాజకీయ పలుకుబడి లేవు. దాంతో ఏదైనా ప్రధాన రాజకీయ పార్టీ మద్దతు లభిస్తే తప్ప వాళ్లకు ఎన్నికల్లో గెలిచే అవకాశాలు చాలా తక్కువ.

‘థార్పర్కర్‌లో దాదాపు 33శాతం మంది ఓటర్లు దళితులే. కానీ వాళ్లకు సరైన ప్రతినిధి లేరు. వాళ్లెప్పుడూ అధికారంలో భాగం పంచుకోలేదు’ అంటారు పాకిస్తాన్ దళిత ఉద్యమ నేత డా.సోను ఖంగారని.

ఫొటో క్యాప్షన్,

ఘన్షామ్

రానున్న ఎన్నికల్లో టికెట్ల కోసం దాదాపు 20మంది దళితులు ప్రయత్నించినా, ప్రధాన పార్టీలు మాత్రం వాళ్లకు అవకాశం కల్పించలేదని ఆయన చెబుతున్నారు.

‘గతంలోనూ మా వర్గానికి చెందిన కొందరు పార్లమెంటులో అడుగుపెట్టారు. కానీ వాళ్లకు పార్టీ నాయకులతో వ్యక్తిగత సంబంధాలు, ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే వాళ్లు పార్టీకి అనుగుణంగా పనిచేశారు తప్ప, తమ వర్గానికి చెందిన వాళ్ల సమస్యల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు’ అని సోనూ అంటున్నారు.

దేశంలో దళితులపైన పెద్దగా వివక్ష లేదనీ, కానీ హిందువుల్లో మాత్రం దళితుల పట్ల వివక్ష ఉందనీ అంటారాయన.

వీడియో క్యాప్షన్,

వీడియో: మైనార్టీలైన హిందువులు ఈసారైనా ప్రభావం చూపించగలరా?

అగ్ర కులానికి చెందిన హిందూ నేత డా.మహేష్ కుమార్ మలానీ మాత్రం ఈసారి ఎన్నికల్లో భుట్టోకు చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ తరఫున అసెంబ్లీ టికెట్ సాధించడంలో సఫలమయ్యారు.

హిందూ ముస్లిం ఓటర్ల మధ్య ఎలాంటి వివక్షా లేదని మలానీ అంటున్నారు. ఆయనకు పీపీపీ నాయకులతో చాలాకాలంగా మెరుగైన సంబంధాలున్నాయి. గతంలోనూ ఆయన పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు.

‘నా మతంతో ప్రజలకు సంబంధం లేదనీ, పార్టీకి వాళ్లు ఓటు వేస్తారనీ నా నమ్మకం. కష్టపడి పనిచేసి గెలవడమే ప్రస్తుతం నా కర్తవ్యం’ అని మలానీ చెబుతున్నారు.

పార్టీలతో సంబంధం లేకుండా చాలామంది దళితులు స్వతంత్ర అభ్యర్థులుగా ఈసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. గెలిచినా, గెలవకపోయినా వాళ్లు తమ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.

పాకిస్తాన్‌లో హిందువులు

హిందువుల జనాభా: 33,24,392 (మొత్తం జనాభాలో 1.6శాతం), హిందూ ఓటర్ల సంఖ్య: 17.7లక్షలు

ఎన్నికల్లో మైనార్టీల కోసం 10 రిజర్వ్‌డ్ సీట్లున్నాయి. వీటితో పాటు హిందువులు సాధారణ స్థానాల్లో కూడా పోటీ చేయొచ్చు.

దక్షిణ సింధ్ ప్రావీన్స్‌లోని ఉమెర్‌కోట్, థార్పర్కర్, సంఘార్ జిల్లాల్లో హిందువుల జనాభా ఎక్కువ.

దళితులతో సహా చాలామంది హిందువులు గతంలో పార్లమెంటుకు ఎన్నికయ్యారు. మంత్రులుగానూ పనిచేశారు.

సింధ్ ప్రాంతానికి చెందిన కృష్ణ కుమారి అనే దళిత మహిళకు పీపీపీ ఇటీవల సెనెటర్‌గా బాధ్యతలు అప్పగించింది.

దేశ తొలి న్యాయ శాఖా మంత్రి జోగేందర్ నాథ్ మండల్ ఓ హిందువు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)