సిరియా: శరణార్థుల్ని చేరుకోని సాయం.. సహాయక సంస్థల్ని దేశంలో అడుగుపెట్టనివ్వని ప్రభుత్వం

నైరుతి సిరియాలో ప్రజల కోసం నిత్యావసర వస్తువులు, ఆహార సరఫరా తక్షణం జరగాలని సహాయక సంస్థలు అంటున్నాయి. వేలాది మంది ప్రజలు సహాయం కోసం ఎదురు చూస్తున్నారని ఐక్యరాజ్య సమితి అంటోంది. ఇక్కడి డెరా ప్రావిన్స్‌ను సిరియా ప్రభుత్వం తన ఆధీనంలోకి తెచ్చుకుంది కానీ సహాయక సంస్థలకు మాత్రం దేశంలోకి అనుమతివ్వడంలేదు.

డెరా ప్రావిన్స్ నుంచి ప్రాణాలతో బయటపడి పారిపోతున్న వేలాది మంది ప్రజలకు సహాయం అందించడం కోసం సిరియా సరిహద్దు వద్ద ఎదురుచూస్తున్న నిత్యావసర వస్తువుల ట్రక్కులన్నీ జోర్డాన్ సమీపంలోని ఎడారి పక్కన రోడ్డు మీదే నిలిచిపోయాయి. ఇబ్రహీం నడిపే లారీ నిండా ఆహార పదార్థాలున్నాయి. ఆయన సిరియా పౌరుడు. 2014లో అతను తన కుటుంబంతో కలిసి డెరా ప్రావిన్స్‌ను విడిచి వెళ్లిపోయారు.

‘‘ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. సిరియాలోకి ప్రవేశించగలమా లేదా తెలియదు. కానీ నేను ఆశావాహ దృక్పథంతో ఉన్నాను. గత నాలుగేళ్లుగా నా బంధువులను చూడనే లేదు’’ అని ఇబ్రహీం అన్నారు.

సిరియా ప్రభుత్వం డెరాలో ఈ మధ్యకాలంలో నిర్వహించిన దాడులకు రష్యా వైమానిక దాడులతో మద్దతునిచ్చింది. ఈ ప్రాంతం ఒక తిరుగుబాటు చిహ్నం. తిరుగుబాటు ఇక్కడే మొదలయింది. యుద్ధం ఇక్కడ వేల మంది ప్రజలకు ఆహారం, తాగేందుకు మంచి నీరు, ఉండేందుకు ఇల్లు లేకుండా చేసిందని ఐక్యరాజ్యసమితి అంటోంది.

‘‘యుద్ధం చేస్తోన్న అన్ని వర్గాలకు మేము చెప్పేది ఒక్కటే మాకు నిరంతరంగా ఆహారం సరఫరా చేసే అవకాశమివ్వండి. పోరాటంలో కొద్దిగా విరమణ ప్రకటిస్తే మేము అమాయక ప్రజలకు వారికి కావల్సినది అందించగలుగుతాము’’ అని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ ప్రతినిధి రూలా అమిన్ అన్నారు.

జులై నెల ప్రారంభం నుంచే దాదాపు డెరా ప్రావిన్స్‌ను సిరియా ప్రభుత్వం తన ఆధీనంలోకి తెచ్చుకుంది. అప్పటినుంచే సరిహద్దు దాటి సహాయం చేసేందుకు ఆహారం, మందులతో ఉన్న ట్రక్కులు సిరియాలోకి ప్రవేశించలేకపోతున్నాయి. జోర్డాన్ దళాలు మమ్మల్ని డెరా ప్రావిన్స్‌కు దగ్గరలో ఉన్న సరిహద్దు ప్రాంతానికి బీబీసీ ప్రతినిధుల్ని తీసుకెళ్లాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఈ రహదారి సందడిగా ఉండే వర్తక మార్గం. కానీ ఇపుడు పర్యాటకులు లేరు, డ్యూటీ ఫ్రీ వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. సైనికులు మాత్రమే ఈ ప్రాంతంలో పహరా కాస్తూ కనిపిస్తున్నారు.

సిరియా ప్రభుత్వం కావాలనే తమను దేశంలోకి రానివ్వట్లేదని స్వచ్ఛంద కార్యకర్తలు మాతో చెప్పారు. ఆ సమీపంలోని యూఎన్ సహాయక కేంద్రం మాదిరిగానే జోర్డాన్‌లో సేకరించిన విరాళాలు, సరుకులతో ఈ గిడ్డంగి నిండిపోయింది. సహాయం అందించడానికి సకలం సిద్ధమే. కానీ, అవి అవసరమైన వారి వద్దకు చేరుకోవడం లేదు.

మా ఇతర కథనాలను చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)