క్యాన్సర్‌తో చనిపోయే ముందు స్వీయ సంస్మరణ రాసిన బాలుడు.. ప్రపంచాన్ని కదిలించిన మాటలు

  • 18 జూలై 2018
గారెట్ మాథియాస్ Image copyright EMILIE MATTHIAS
చిత్రం శీర్షిక ‘గారెట్ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో జనానికి కొంతైనా తెలియాలని నేను కోరుకున్నా’ అంటారు అతడి తల్లి

అతడి వయసు ఐదేళ్లు. అప్పుడే నూరేళ్లు నిండిపోయాయి. కొద్ది రోజుల కిందటే క్యాన్సర్‌తో కన్నుమూశాడు. అయితే.. ఆ బాలుడు తన సంస్మరణ తనే రాసుకున్నాడు. అందుకు అతడి తల్లి సాయం చేసింది. అది ప్రపంచ వ్యాప్తంగా చాలా మందిని కదిలించింది.

ఆ బాలుడి పేరు గారెట్ మాథియాస్. నివాసం అమెరికాలోని ఆయోవా రాష్ట్రం. తనే రాసిన తన సంస్మరణని తమ కుటుంబ అంత్యక్రియల సంస్థ వెబ్‌సైట్‌లో ప్రచురించాడు.

విషాదకరమైన సంస్మరణ తనకు వద్దని అందులో చెప్పాడు. ‘‘మళ్లీ కలుస్తా.. బడుద్ధాయిలూ!’’ అంటూ వీడ్కోలు చెప్పాడు.

ఆ బాలుడి ఆంకాంక్షలను జులై 14వ తేదీ శనివారం నాడు ‘‘అతడి జీవన వేడుక’’ నిర్వహించటం ద్వారా గౌరవించారు.

గారెట్ తల్లిదండ్రులు ఎమిలీ, ర్యాన్. అతడికి వచ్చిన అరుదైన తరహా క్యాన్సర్ ప్రాణాంతకమైనదని జూన్ మధ్యలోనే వారికి తెలిసింది. గారెట్ జూలై 6న గారెట్ చనిపోయాడు. దానికి ముందు ‘‘తొమ్మిది నెలలు నరకం’’ చవిచూశాడని అతడి తల్లిదండ్రులు చెప్పారు.

గారెట్ ఎంతో కాలం బతకడని తెలియటంతో తొలుత విషాదంలో మునిగిపోయిన తల్లిదండ్రులు తర్వాత తాము ఏం చేయగలమని ఆలోచించారు.

‘‘నాకు ఒక విషయం అంతుబట్టదు. ఒక వ్యక్తి గురించిన సంస్మరణ చదివినపుడు ఆ మనిషి వ్యక్తిత్వం ఎలా ఉంటుందనే సమాచారం పెద్దగా ఉండదు. గారెట్ వ్యక్తిత్వం గురించి జనం కొంతైనా అర్థంచేసుకోగలిగేలా ఉండాలని నేను భావించాను. అది అతడి సొంత మాటల్లోనే రాయాలని నాకు అప్పుడు అనిపించింది’’ అని ఎమిలీ బీబీసీతో పేర్కొన్నారు.

Image copyright EMILIE MATTHIAS
చిత్రం శీర్షిక గారెట్ కోరుకున్నట్లుగానే అతడి జీవన వేడుకలో బ్యాట్‌మాన్, స్పైడర్ మాన్, వండర్ ఉమన్‌లు కూడా పాల్గొన్నారు.. అతడి చెల్లెలిని ఆలింగనం చేసుకున్నారు

గ్రేట్ గారెట్ అండర్‌పాంట్స్ ఇష్టాయిష్టాలు...

గారెట్‌ చనిపోవటానికి కొన్ని వారాల ముందు నుంచి అతడితో తమ సంభాషణల్లోని అంశాలతో ఈ సంస్మరణను తయారుచేశారు.

అలా రూపొందిన అతడి స్వీయ సంస్మరణకు ‘‘గ్రేట్ గారెట్ అండర్‌పాంట్స్’’ అని శీర్షిక పెట్టారు.

అందులో అతడి ఇష్టాలను ఇలా వివరించాడు.

‘‘నా చెల్లెలితో ఆడుకోవటం, నా బ్లూ బన్నీతో, త్రాష్ మెటల్‌తో, లెగోస్‌తో, నా డేకేర్ ఫ్రెండ్స్‌తో, బ్యాట్‌మాన్‌తో ఆడుకోవటమంటే నాకిష్టం. వాళ్లు నాకు సూది గుచ్చటానికి ముందుగానే నన్ను నిద్రపుచ్చటం ఇష్టం.’’

అతడు ద్వేషించేవి:

‘‘ప్యాంట్లు! ఈ వెధవ క్యాన్సర్. వాళ్లు నాకు సూది గుచ్చటం. ఇంజక్షన్లు. చెర్రీ పిత్తుల్లా వాసనవచ్చే మంకీ నోస్... మాయో రేడియేషన్ దగ్గర ఉండే పుదీనా మంకీ నోస్ అంటే నాకిష్టమే. నేను లెగోస్ పేర్చటానికి సాయపడిన ఆ మనిషి (రాండీ) కూడా.’’

మరణం గురించి అడిగినపుడు గారెట్ ఇలా చెప్పాడు: ‘‘నేను చనిపోయినపుడు: నేను గొరిల్లా అవుతా. డాడీ మీద పేడ విసిరేస్తా!’’

Image copyright EMILIE MATTHIAS
చిత్రం శీర్షిక ‘‘గారెట్ మాటలు ప్రపంచంలో ఇంతమందిని కదిలించాయంటే మాకు మాటలు రావటం లేదు’’ అని ఎమిలీ చెప్పారు

గారెట్ తన భౌతికకాయాన్ని తాము ఏం చేయాలని కోరుకుంటున్నాడని కూడా అతడిని తల్లిదండ్రులు అడిగారు. అతడి అంత్యక్రియలు ఎలా నిర్వహించాలనీ అడిగారు.

‘‘నన్ను దహనం చేసి (థార్ అమ్మ చనిపోయినపుడు చేసినట్లుగా), ఒక చెట్టులా చేయాలని కోరుకుంటున్నా. నేను గొరిల్లాగా ఉన్నపుడు దానిమీద నివసించటానికి వీలుంటుంది’’ అని అతడు రాశాడు.

‘‘అంత్యక్రియలు విషాదంగా ఉంటాయి: నాకు ఐదు బౌన్సీ హౌస్‌లు (ఎందుకంటే నా వయసు ఐదేళ్లు), బ్యాట్‌మాన్, స్నో కోన్‌లు కావాలి.’’

గారెట్ స్వీయ సంస్మరణలో చెప్పిన మాటలను అమెరికాతో పాటు అంతర్జాతీయంగా మీడియా సంస్థలు ప్రచురించాయి. ఆ మాటలు సోషల్ మీడియా ద్వారా విస్తరించాయి.

గారెట్ సంస్మరణపై ‘‘ఎంత దూరతీరాల నుంచి ప్రతిస్పందన వచ్చిందో చూసి నాకు మాటలు రాలేదు’’ అని ఎమిలీ చెప్తారు.

‘‘ప్రపంచమంతటి నుంచీ జనం మాకు సందేశాలు పంపిస్తున్నారు. గారెట్ ఆలోచనలను రాయటం ఇంత మందిని కదిలించటం చూసి మేము సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాం. వినమ్రత తెలియజేస్తున్నాం’’ అని ఆమె పేర్కొన్నారు.

Image copyright EMILIE MATTHIAS
చిత్రం శీర్షిక గారెట్ జీవన వేడుకలో అతడు కోరుకున్నట్లుగా ఐదు బౌన్సీ హౌ‌స్‌లను ఏర్పాటు చేశారు

గారెట్ ఆకాంక్షలకు అనుగుణంగా ఎమిలీ, ర్యాన్‌లు ‘‘జీవన వేడుక’’ నిర్వహించారు.

‘‘అది చాలా బాగా జరిగింది. చాలా మంది వచ్చారు. ఐదు బౌన్సీ హౌస్‌లు, బ్యాట్‌మాన్, వండర్ ఉమన్, స్పైడర్ మాన్, స్నో కోన్‌లు ఏర్పాటుచేశాం’’ అని ఎమిలీ తెలిపారు.

గారెట్ కోరుకున్నట్లుగా.. థార్ తల్లికి నిర్వహించినట్లుగా అతడికి కూడా అస్గార్డియన్ అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించారు తల్లిదండ్రులు. తమ ఇంటి సమీపంలో ఉన్న సరస్సులో ఒక నమూనా పడవ మీదకి ఒక విలుకాడు అగ్ని బాణాన్ని సంధించాడు.

గారెట్ చితాభస్మాన్ని చెట్టుగా మార్చే మార్గాన్ని వెదకాలని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు.

‘‘అంత్యక్రియలు విషాదంగా ఉండాల్సిన అవసరం లేదు. మా కొడుకు మరణం వల్ల మేం కుంగిపోయినప్పటికీ.. అతడి జీవన వేడుకను నిర్వహించటం ఓ అద్భుతమైన అనుభవం’’ అంటారు ఎమిలీ.

- యూజీసీ, సోషల్ న్యూస్ టీమ్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)