పాకిస్తాన్‌లో హిందూ మహిళలకు గుర్తింపు కార్డులు ఇవ్వట్లేదు

  • షుమైలా జాఫ్రీ
  • బీబీసీ ప్రతినిధి

భారత్‌లో ఆధార్‌లానే పాకిస్తాన్‌లోనూ అక్కడి ప్రభుత్వం ఇచ్చే జాతీయ గుర్తింపు కార్డే అన్ని అవసరాలకూ దిక్కు. బ్యాంకు ఖాతా తెరవాలన్నా, ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందాలన్నా ప్రజలకు పాక్ నేషనల్ డేటాబేస్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ (ఎన్ఏడీఆర్ఏ) కార్డులు తప్పనిసరి.

కానీ ఆ దేశంలో మైనార్టీలుగా ఉన్న లక్షలాది హిందువులు, దళిత మహిళలకు ఆ గుర్తింపు కార్డులు అందని ద్రాక్షలుగానే మారుతున్నాయి. దాంతో ప్రభుత్వం నుంచి రావాల్సిన ఎలాంటి ప్రయోజనాలూ అందక వాళ్లకు బతకడం కూడా కష్టంగా మారుతోంది. రానున్న ఎన్నికల్లో వాళ్లకు ఓటు వేసే అవకాశం కూడా లేదు.

పాకిస్తాన్‌లోని థార్పర్కర్‌ జిల్లాలో హిందువుల జనాభా ఎక్కువ. అక్కడే ఉంటున్న లీలా అనే దళిత హిందూ మహిళ నాలుగేళ్ల నుంచి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఆమెకు ప్రభుత్వ గుర్తింపు కార్డు అందట్లేదు.

‘నెలల తరబడి కాళ్లరిగేలా అధికారుల చుట్టూ తిరిగాను. వాళ్లకు లంచం కూడా ఇచ్చాను. కానీ ఎలాంటి ప్రయోజనమూ లేదు. ఈ ప్రయత్నంలో పూర్తిగా అలసిపోయాను. బ్యాంకు ఖాతా లేకపోవడంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందట్లేదు. ఆఖరికి రానున్న ఎన్నికల్లో నేను ఓటు కూడా వేయలేను’ అని ఆమె ఆవేదనగా చెబుతున్నారు.

జులై 25 నుంచి పాకిస్తాన్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. కానీ అక్కడ అర్హులైన దాదాపు 1.21 కోట్ల మంది మహిళలకు ఎలాంటి కంప్యూటరైజ్డ్ గుర్తింపు కార్డులూ లేవనీ, కాబట్టి వాళ్లకు ఓటు వేసే అవకాశం కూడా ఉండదనీ పాక్ ఎన్నికల కమిషన్ భావిస్తోంది. అంటే, లీలా లాంటి చాలామంది మహిళలు అర్హత ఉన్నా, ఎన్నికల్లో తమ నిర్ణయాన్ని తెలపలేరు. ప్రజా ప్రతినిధుల ఎంపికలో తమ గొంతు వినిపించలేరు.

ఫొటో క్యాప్షన్,

రానున్న ఎన్నికల్లో తుల్సీ బలానీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు

థార్పర్కర్‌లో తుల్సీ బలానీ అనే దళిత మహిళ కూడా రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కానీ తన మద్దతుదార్లలో చాలామందికి ఓటు హక్కు లేకపోవడం తనకు పెద్ద సవాలుగా మారిందంటున్నారామె.

‘ఈ కార్డు చాలా ముఖ్యం. మీరు పాకిస్తాన్ పౌరులని చెప్పడానికి ఇదే సాక్ష్యం. ప్రభుత్వం నుంచి మీకు నెలవారీ సాయం అందాలంటే ఈ కార్డు ఉండాల్సిందే’ అంటూ తుల్సీ తన ఇంటి ముందున్న మహిళలకు ఆ కార్డు గురించి చెప్పారు.

అవగాహనా లోపంతో పాటు అక్కడున్న మహిళల్లో చాలామంది మారుమూల ప్రాంతాల నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయాల దాకా వెళ్లేందుకు డబ్బు లేకపోవడం వల్ల కూడా ప్రభుత్వ గుర్తింపు కార్డులు పొందలేకపోతున్నారన్నది తుల్సీ అభిప్రాయం. రెండు మూడు సార్లు ప్రయత్నించాక విసిగిపోయి చాలామంది కార్డు ప్రయత్నాలను ఆపేస్తున్నారు.

హిందువులు అధికంగా ఉండే థార్పర్కర్‌లో దాదాపు 2.5లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారని ఎన్నికల కమిషన్ భావిస్తోంది. కానీ వాళ్లలో దాదాపు 2లక్షల మంది మహిళల పేర్లు ఓటర్ల జాబితాలో లేవు.

దీని వల్ల వీళ్లు పోలింగ్‌కే కాదు, సామాజిక భద్రతకు కూడా దూరమవుతున్నారు.

ఫొటో క్యాప్షన్,

గత కొన్నాళ్లుగా థార్పర్కర్ జిల్లాలో శిశు మరణాల సంఖ్య ఎక్కువైంది

గత కొన్నాళ్లుగా థార్పర్కర్ జిల్లాలో శిశు మరణాల సంఖ్య ఎక్కువైంది. పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలు, తల్లుల ఫొటోలు ఆ జిల్లాకు ప్రతీకలుగా మారిపోయాయి. కరవు, పేదరికం కారణంగా అక్కడ మహిళలు, శిశువుల ఆరోగ్యం తీవ్రంగా క్షీణిస్తోంది. వీళ్ల కోసం ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా, గుర్తింపు కార్డులు లేని కారణంగా వాటి ఫలాలు వీళ్లకు అందట్లేదు.

ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘బేనజీర్ ఇన్‌కం సపోర్ట్’ పథకం కారణంగా ఇప్పుడు చాలామంది మహిళలు గుర్తింపు కార్డుల కోసం నమోదు చేసుకుంటున్నారని జిల్లా ఎన్‌ఏడీఆర్ఏ అధికారి ప్రకాష్ నందనీ అంటున్నారు. ఆ పథకం ద్వారా గుర్తింపు కార్డులున్న పేద మహిళలకు నెలనెలా కొంత ఆదాయం అందుతుంది.

‘ఈ కార్యక్రమం కింద 90వేల మంది లాభపడుతున్నారు. గత కొన్ని నెలలుగా వేల మంది థార్పర్కర్ మహిళలు గుర్తింపు కార్డుల కోసం దరఖాస్తు చేస్తున్నారు’ అని ప్రకాష్ అంటున్నారు. కానీ ఇప్పటికీ కార్డు అందని మహిళలు వేలల్లో ఉన్నారు.

ఎలాగైనా వీళ్లందరికీ గుర్తింపు కార్డులు ఇప్పించాలని వాళ్లతో కలిసి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నట్లు తుల్సీ బలానీ చెబుతున్నారు.

‘రాజకీయంగా మా దళితులకు ఇదో పెద్ద ఎదురుదెబ్బ. ఓట్లు, గుర్తింపు కార్డులు లేని కారణంగా మమ్మల్నెవరూ పట్టించుకోరు. మాకెలాంటి ప్రాధాన్యం ఇవ్వరు. అసలు మమ్మల్ని పౌరులుగానే చూడరు’ అంటారు తుల్సీ. కానీ ఆ విషయంలో స్థిరంగా పోరాడుతున్నామనీ, మైనార్టీ మహిళలందరికీ త్వరలో కార్డులొస్తాయనీ ఆమె ఆశిస్తున్నారు.

ఒక్క థార్పర్కర్ జిల్లాలోనే కాదు, పాకిస్తాన్ వ్యాప్తంగా ఉన్న మైనార్టీ మహిళలందరిదీ అదే సమస్య. అది తీరాలంటే చాలా కాలమే పడుతుంది.

ప్రస్తుత పరిస్థితిని చూసుకుంటే.. 2018 ఎన్నికల్లో 1.21కోట్ల మంది మహిళలు ఓటు హక్కుకు నోచుకోని వాళ్ల జాబితాలో చేరినట్లే లెక్క.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)