బ్రిటన్: పార్లమెంటు సభ్యులకు ‘కొత్త ప్రవర్తనా నియమావళి’.. ఎంపీల సభ్యత్వం రద్దుకు ప్రతిపాదన

ఫొటో సోర్స్, Getty Images
బ్రిటన్ పార్లమెంటు అక్కడి ఉభయ సభల సభ్యులకు కొత్త ప్రవర్తనా నియమావళిని ప్రతిపాదించింది. ఇది అమల్లోకి వస్తే వేధింపులు, బెదిరింపులకు పాల్పడే ఎంపీలు తమ సభ్యత్వాలు కోల్పోవాల్సి వస్తుంది.
ఇందుకుగాను రూపొందించిన కొత్త ప్రవర్తన నియమావళిని మంగళవారం ప్రకటించారు. దాని ప్రకారం... నియమావళిని ఉల్లంఘించినవారు, దానికి విరుద్ధంగా ప్రవర్తించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.
ఈ ప్రతిపాదనలను గురువారం పార్లమెంటు ముందుకు తీసుకొస్తున్నారు. అక్కడ ఆమోదం పొందితే అమల్లోకి వస్తాయి.
బ్రిటన్ పార్లమెంటులో లైంగిక వేధింపుల సమస్య తీవ్రంగా ఉంది.
గత ఏడాది బ్రిటిష్ ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు డామియన్ గ్రీన్, మిఖైల్ ఫాలన్లు సెక్స్ స్కాండల్స్‌లో చిక్కుకుని రాజీనామా చేశారు.
పలువురు ఇతర నేతలపైనా లైంగింక వేధింపుల ఆరోపణలున్నాయి. వారిపై దర్యాప్తు కొనసాగుతోంది.
గత ఏడాది పార్లమెంటులో, పార్లమెంటుకు అనుబంధంగా పనిచేసే 1300 మందిని సర్వే చేయగా అందులో 19 శాతం మంది తాము లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామని తెలిపారు.
ఫొటో సోర్స్, EPA
ఈ ప్రతిపాదనలు తయారుచేసిన బృందానికి నేతృత్వం వహించిన కంజర్వేటివ్ ఎంపీ ఆండ్రియా లీడ్సమ్
బాధితుల కోసం రెండు హెల్ప్ లైన్లు
కంజర్వేటివ్ ఎంపీ ఆండ్రియా లీడ్సమ్ నేతృత్వంలో ఒక బృందం ఈ ప్రతిపాదనలను రూపొందించింది. ఇవి అమల్లోకి వస్తే బాధితులు తమ సమస్యను దశలవారీగా పరిష్కరించుకునే వీలుంటుంది.
దీనికోసం రెండు సహాయ కేంద్రాలు నెలకొల్పుతారు. మొదటిది వేధింపులు, బెదిరింపులకు సంబంధించిన ఫిర్యాదుల కోసం కాగా రెండోది పూర్తిగా లైంగిక వేధింపులు, లైంగిక హింసకు సంబంధించిన ఫిర్యాదులు, కేసుల కోసం.
బాధితులు ఈ హెల్ప్లైన్లను సంప్రదించినప్పుడు మొదటి దశలో మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. తరువాత దశలో స్వతంత్ర దర్యాప్తు జరుపుతారు.
సమస్య చిన్నస్థాయిలో ఉంటే క్షమాపణలు చెప్పించడం వంటి శిక్షలు విధిస్తారు.
కానీ తీవ్రమైన వేధింపులు, హింసకు సంబంధించిన కేసుల్లో ఏడుగురు ఎంపీలు, పౌర సమాజం నుంచి ఏడుగురితో కూడిన కమిటీని నియమిస్తారు. వారు శిక్షలను ఖరారు చేస్తారు. సభ్యత్వం రద్దు వంటి శిక్షలు కూడా ఉండొచ్చు.
ఇవి కూడా చదవండి:
- రెండో ప్రపంచ యుద్ధం: ఆహారంపై ఆంక్షలు
- 'జలియన్‌వాలాబాగ్ నరమేధానికి బ్రిటన్ క్షమాపణ చెప్పాల్సిందే'
- అమెరికా-బ్రిటన్ చారిత్రక సంబంధాలకు డొనాల్డ్ ట్రంప్ ముగింపు పలుకుతారా?
- డేటా బ్రీచ్: ఫేస్‌బుక్‌కు 46 కోట్ల జరిమానా విధించనున్న బ్రిటన్
- ‘అందరికీ చెడ్డ రోజులుంటాయి’.. ధోనీ ‘డిఫెన్స్’కి కోహ్లీ సమర్థన
- ‘అందరూ పడుకున్నాక ఇంటి యజమాని నా దగ్గరకు వచ్చేవాడు’
- #లబ్‌డబ్బు: పీఎఫ్ నిబంధనల్లో మార్పులతో ప్రయోజనాలివే
- వాట్సాప్ వదంతులు: చిన్న పిల్లలకు చాక్లెట్లు పంచారని గ్రామస్తుల దాడి.. బీదర్‌లో హైదరాబాద్ వాసి మృతి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)