బ్రిటన్‌: సెక్స్ కంటే కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న యువత

  • 20 జూలై 2018
టీనేజర్లు, గర్భధారణ Image copyright Getty Images

బ్రిటన్‌లో టీనేజర్లు సెక్స్ కన్నా ఆన్‌లైన్ సంబంధాలకు, కుటుంబంతో గడపడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఒక పరిశోధన వెల్లడించింది.

16-18 ఏళ్ల మధ్య వయసున్న వేయి మంది టీనేజర్లపై నిర్వహించిన పరిశోధనలో వాళ్లు గతంలో కన్నా తక్కువగా మద్యం సేవిస్తున్నట్లు వెల్లడైంది.

బ్రిటిష్ ప్రెగ్నెన్సీ అడ్వైజరీ సర్వీస్ (బీపీఏఎస్) టీనేజర్లలో తగ్గిపోతున్న గర్భధారణ గురించి నిర్వహించిన పరిశోధనలో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 2007 నుంచి క్రమంగా టీనేజర్ల గర్భధారణ తగ్గుతోందని ఈ పరిశోధనలో పేర్కొన్నారు.

ఈ పరిశోధనలో మూడింట రెండొంతుల మంది తాము ఇప్పటివరకు ఒక్కసారి కూడా సెక్స్‌లో పాల్గొనలేదని, 24 శాతం మంది తామెన్నడూ మద్యం సేవించలేదని వెల్లడించారు.

Image copyright Getty Images

బీపీఏఎస్ సర్వే ఏం చెబుతోంది?

నేటి తరం టీనేజర్లు చాలా వివేకవంతులని బీపీఏఎస్ పరిశోధన తెలిపింది. వీళ్లు సెక్స్ కన్నా చదువు మీద, కెరీర్ మీద ఎక్కువ దృష్టి సారిస్తున్నారని వెల్లడించింది.

సర్వే చేసిన వారిలో సుమారు 80 శాతం మంది తాము పరీక్షలలో బాగా రాణిస్తున్నట్లు, తాము ఎంచుకున్న కెరీర్ మార్గంలో వెళుతున్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా వీరిలో ఎక్కువ మంది తాము స్నేహితులతో గడపడం కంటే, కుటుంబ సభ్యులతో గడపడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

చదువు, పని కారణంగా స్నేహితులను కలవడం కష్టంగా మారుతోందని అనేక మంది తెలిపారు.

అయితే ఈ సర్వేలో భాగంగా టీనేజర్లు రాసుకున్న డైరీలలో - చదువు, పని కాకుండా, సుమారు ఐదు గంటలు వీరు ఆన్‌లైన్‌లో గడుపుతున్నట్లు వెల్లడైంది.

సర్వే చేసిన వారిలో పావు శాతం కన్నా తక్కువ మంది మాత్రమే తమ స్నేహితులతో తరచుగా ముఖాముఖి మాట్లాడారు. ముఖాముఖికన్నా ఆన్‌లైనే సంభాషణే ఎక్కువగా ఉంది. సర్వే చేసిన వారిలో 70 శాతం మంది వారంలో నాలుగు లేదా అంతకన్నా ఎక్కువసార్లు స్నేహితులతో ఆన్‌లైన్‌లో సంభాషించారు.

క్రమం తప్పకుండా స్నేహితులతో లేదా భాగస్వాములతో ముఖాముఖి మాట్లాడే టీనేజర్లు సెక్స్ పట్ల తక్కువ ఆసక్తి చూపారని పరిశోధకులు వెల్లడించారు.

సెక్స్ ఎడ్యుకేషన్

గతంలో పశ్చిమ యూరప్‌లో టీనేజ్ గర్భధారణ చాలా ఎక్కువగా ఉండేది. ఇందుకోసం బ్రిటన్ ప్రభుత్వం రూపొందించిన వ్యూహం ఫలించి గత 20 ఏళ్లుగా దేశవ్యాప్తంగా టీనేజ్ గర్భధారణ రేటు బాగా తగ్గిపోయింది.

ఈ వ్యూహం కింద, కాంట్రాసెప్టివ్‌లు విరివిగా లభించేలా చేశారు. విద్యాసంస్థల్లో, ఆసుపత్రులలో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో 2007 నుంచి టీనేజ్ గర్భధారణ రేటు 50 శాతం తగ్గిపోయింది.

Image copyright Getty Images

బీపీఏఎస్ సర్వేలో సెక్స్ పట్ల టీనేజర్ల ధోరణి మారుతున్నట్లు గుర్తించారు. ఐదుగురిలో నలుగురు టీనేజర్లు చిన్న వయసులోనే తల్లిదండ్రులుగా మారడాన్ని అవమానంగా భావిస్తున్నారు. అంతే కాకుండా టీనేజ్ బాలికలు గర్భధారణ, తద్వారా తల్లిదండ్రులకు భారంగా మారడానికి ఇష్టపడ్డం లేదు.

సర్వే చేసిన వారిలో చాలా మంది సెక్స్‌లో తాము కాంట్రాసెప్టివ్‌లు వాడుతున్నట్లు తెలిపారు. కేవలం 14 శాతం మంది మాత్రం తాము ఎన్నడూ వాడలేదని లేదా ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే వాటిని వాడతామని చెప్పారు.

బీపీఏఎస్ సర్వేకు నేతృత్వం వహించిన కేథరిన్ ఓబ్రెయిన్, పాఠశాలల్లో సెక్స్ ఎడ్యుకేషన్‌పై ప్రభుత్వం చేస్తున్న ప్రచారం కారణంగా రాబోయే రోజుల్లో టీనేజ్ గర్భధారణ రేటు మరింత తగ్గిపోతుందని అన్నారు.

''నేటి తరం విద్య మీద చాలా శ్రద్ధ పెడుతోంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక సవాళ్ల గురించి వాళ్లకు చాలా అవగాహన ఉంది. వీరు తమ కుటుంబం, స్నేహితులతో సమయం గడపడాన్ని ఆస్వాదిస్తారు. మద్యం, సెక్స్ విషయంలో వాళ్లు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు'' అని కేథరిన్ తెలిపారు.

అయితే రాయల్ కాలేజ్ ఆఫ్ అబ్‌స్టెట్రీషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ అధ్యక్షురాలు ప్రొఫెసర్ లెస్లే రీగన్ మాత్రం టీనేజి గర్భధారణలో ప్రాంతాలపరంగా ఇంకా అనేక తేడాలున్నాయని అన్నారు.

టీనేజర్లలోని చాలా మందికి ఇంకా సెక్స్ ఎడ్యుకేషన్‌పై అవగాహన లేదని తెలిపారు.

ప్రజా వైద్యంపై ప్రభుత్వాలు కోత విధిస్తుండడం కాంట్రాసెప్టివ్ సేవలు అందరికీ అందుబాటులోకి రావడానికి ఆటంకంగా మారుతోందని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)