వీళ్లు ఐసిస్ మిలిటెంట్ల పిల్లలు.. ఏతప్పూ చేయకపోయినా శిక్ష అనుభవిస్తున్నారు

వీళ్లు ఐసిస్ మిలిటెంట్ల పిల్లలు.. ఏతప్పూ చేయకపోయినా శిక్ష అనుభవిస్తున్నారు

లిబియాలోని సిర్త్ ప్రాంతం నుంచి ఐఎస్ మిలిటెంట్లు పారిపోయారు. కానీ వారి పిల్లలు మాత్రం అక్కడే ఉండిపోయారు. కొందరు పిల్లలు తల్లిదండ్రులను కలుసుకున్నారు. కానీ, ఇంకా ఇరవై మంది మాత్రం ఇక్కడి రెడ్ క్రిసెంట్ శిబిరంలోనే తల దాచుకుని, తమ వారి కోసం ఎదురు చూస్తున్నారు.

స్వయంప్రకటిత ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ల పిల్లలు ఏ తప్పు చేయకపోయినా విదేశీ గడ్డపై ఉండిపోయారు. యుద్ధం నుంచి బయటపడ్డారు. కానీ, జీవితాంతం మరచిపోలేని భయంకర ఘటనలు చూశారు.

మేం వారిని మొదటిసారి కలిసినప్పుడు వారు సరిగ్గా మాట్లాడలేదు కూడా. ఎందుకంటే వాళ్ళని పలకరించేవారే అరుదు. సమాజం దూరం పెట్టిన ఈ అమాయక చిన్నారులు ప్రస్తుతం అనాథ శరణాలయానికి పరిమితమయ్యారు.

ఈ చిన్నారులకు ఆశ్రయం కల్పించారు మనస్తత్వవేత్త ఫైజల్. నెలల తరబడి ఈ పిల్లలతో ఆయన మాట్లాడారు. వారిని మొదటిసారి కలిసినప్పుడు వారు ఎలా ఉండేవారో ఆయనకు ఇంకా గుర్తుంది.

"వారు పదే పదే భయాందోళనలకు గురయ్యేవారు. తీవ్ర నిద్రలేమితో బాధపడేవారు. మాట్లాడలేకపోయేవారు" అని ఫైజల్ చెప్పారు.

జుమానా వయసు పదేళ్ళు. యుద్ధంలో తన తల్లిదండ్రులను, సోదరుణ్ణి కోల్పోయింది ఈ చిన్నారి. సిర్త్ పట్టణాన్ని స్వాధీన పరుచుకునేందుకు అమెరికా, బ్రిటన్ దళాలు చేసిన దాడులలో ఈ చిన్నారి చిక్కుకుంది. ఆ సమయంలోనే ఆమెను రక్షించారు. తన సొంతవారు గుర్తొస్తున్నారని ఈ చిన్నారి అంటోంది.

జుమానా: "నాకు అమ్మమ్మ, తాతయ్య, అంకుల్ ఉన్నారు"

రిపోర్టర్: వాళ్ళని చూడాలనుందా?

జుమానా: అవును

రిపోర్టర్: అమ్మమ్మ పేరు గుర్తుందా?

జుమానా: తన పేరు అజీజా

కొన్ని వారాల పాటు పరిశోధించిన తరువాత జుమానా కుటుంబం ఈజిప్ట్‌ లో ఉన్నట్టు మాకు తెలిసింది. మూడేళ్ళ క్రితం వారు వెళ్ళినప్పటినుంచి వాళ్ళను చూడలేదు. వాళ్ళతో మాట్లాడలేదని జుమానా అమ్మమ్మ, తాతయ్య అన్నారు.

"ఏదైనా కారు హారన్ చప్పుడు వినపడగానే వాళ్ళేనేమో, తిరిగి వచ్చేశారేమో అని అనుకుంటాం. ఒక కారులో బయలుదేరి వారిని తీసుకొచ్చేయాలనుంది. కానీ అధికారులు మాత్రమే ఆ పని చేయగలరని నాకు తెలిసింది" అని వారు అన్నారు.

లిబియాలో ఉన్న చిన్నారుల వీడియోను బీబీసీ బృందం వారికి చూపించింది. మొత్తానికి వారు తమ మనుమరాలిని చూశారు.

ఆ చిన్నారులను ఈజిప్ట్‌కు తీసుకురావడం గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటికి తమ సొంత గూటికి చేరుకుంటామా అని ఈ పిల్లలు ఎదురుచూస్తున్నారు.

మా ఇతర కథనాలు చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)