అయోమయంలో అమెరికా.. రష్యా జోక్యంపై ట్రంప్‌దో మాట, ఇంటెలిజెన్స్‌ది ఇంకో మాట

  • 19 జూలై 2018
ట్రంప్, పుతిన్ Image copyright Getty Images

రష్యా విషయంలో అమెరికా అయోమయం నుంచి బయటపడలేకపోతోందా? రష్యాను నమ్మాలా వద్దా అనే విషయంలో అమెరికా ఇంటెలిజెన్స్ విభాగాలతో అధ్యక్షుడు ట్రంప్ విభేదిస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు.

''రష్యా ఇప్పటికీ అమెరికా ఎన్నికలను లక్ష్యంగా చేసుకుంటోందా?'' అన్న ప్రశ్నకు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన సమాధానం దీనికి కారణమైంది.

ఏబీసీ న్యూస్ రిపోర్టర్ సెసీలియా వెగా.. ట్రంప్‌ను నేరుగా ఈ ప్రశ్న అడిగారు. అందుకు ఆయన సమాధానం ఇస్తూ (నో) 'లేదు' అని స్పష్టంగా చెప్పారు. ఆ వెంటనే ఆమె ఆయన సమాధానాన్ని నిర్ధారించుకునేందుకు గాను మరోసారి అదే ప్రశ్న అడిగారు. అప్పుడు కూడా ట్రంప్ 'లేదు' అనే చెప్పారు.

కానీ... అమెరికా నిఘా విభాగాలు మాత్రం మున్ముందు కూడా రష్యా జోక్యం చేసుకునే అవకాశం ఉందంటూ చాలా కాలంగా చెబుతూవస్తున్నాయి. అందుకు భిన్నంగా ట్రంప్ మాత్రం అలాంటిదేమీ లేదని చెప్పడంతో గందరగోళం తలెత్తింది.

ట్రంప్ వ్యాఖ్యల అనంతరం వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ మాట్లాడుతూ.. మరిన్ని ప్రశ్నలు అడగొద్దంటూ ట్రంప్ 'నో' చెప్పారని.. రష్యా విషయంలో విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన 'నో' అని చెప్పలేదని తెలిపారు.

ట్రంప్ ఉద్దేశం అది కాదని చెబుతూ ఆమె.. ''భవిష్యత్‌లో అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకునే వీల్లేకుండా అధ్యక్షుడు, ఆయన పాలనా విభాగం గట్టి ప్రయత్నం చేస్తున్నార''ని అన్నారు.

కాగా, దీనిపై ఇతర వార్తాసంస్థల విలేఖరులు కూడా స్పందించారు. అధ్యక్షుడు ట్రంప్ ఇంకేమీ అడగొద్దంటూ 'నో' చెప్పడం ఇంతవరకు వినలేదని చెబుతున్నారు.

మరోవైపు.. ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ ఈ విషయంలో వక్రీకరిస్తున్నారన్న ఉద్దేశం వ్యక్తం చేస్తూ 'ఎన్‌బీసీ న్యూస్' వైట్‌హౌస్ కరస్పాండెంట్ హేలీ జాక్సన్ ఒక ట్వీట్ చేశారు.

అందులో జాక్సన్.. ''అనేకసార్లు కేబినెట్ రూంలో ఉన్నాను. ఎక్కడున్నా ఎన్నోసార్లు గట్టిగా ప్రశ్నలు అడిగాం. కానీ, ప్రశ్నలడగొద్దంటూ మమ్మల్ని ఆపేందుకు ట్రంప్ ఎన్నడూ నో చెప్పడం మాత్రం వినలేదు' అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)