అమెజాన్: ఇతను ప్రపంచంలోనే అత్యంత ఒంటరి మానవుడు

  • 22 జూలై 2018
అమెజాన్, అత్యంత ఒంటరి మానవుడు Image copyright Funai
చిత్రం శీర్షిక అమెజాన్‌లో అత్యంత ఒంటరి మానవుని వీడియో ఫుటేజ్ ఇటీవలే విడుదల చేశారు

ఈ ప్రపంచంలోనే అత్యంత ఒంటరి మానవుని అరుదైన వీడియో ఫుటేజ్ ఇటీవల బయటపడింది.

తన తెగకు చెందిన వారంతా హత్యకు గురికాగా, ఈ 50 ఏళ్ల వ్యక్తి బ్రెజిల్‌లోని అమెజాన్ అడవుల్లో గత 22 ఏళ్లుగా ఒంటరిగా నివసిస్తున్నాడు.

బ్రెజిల్ ప్రభుత్వానికి చెందిన స్వతంత్ర సంస్థ 'ఫునాయ్' ఇటీవల అతని వీడియో ఫుటేజ్‌ను విడుదల చేసింది. దూరం నుంచి చిత్రించిన ఈ వీడియోలో ఆ వ్యక్తి గొడ్డలితో చెట్లను నరకడం కనిపించింది.

అతణ్ని ఎందుకు చిత్రించారు?

ఫునాయ్ 1996 నుంచి దూరం నుంచి అతణ్ని పర్యవేక్షిస్తోంది. రొండోనేనియా రాష్ట్రంలో అతను సంచరించే ప్రాంతంలో నిషేధాజ్ఞలను పునరుద్ధరించడం కోసం, అతను ఇంకా జీవించే ఉన్నాడు అని సాక్ష్యంగా చూపే ఈ వీడియో అవసరం ఉంది.

అతను ఉంటున్న సుమారు 4 వేల హెక్టార్ల ప్రదేశంపై ప్రైవేట్ సంస్థలు కన్నేశాయి.

బ్రెజిల్ చట్టాల ప్రకారం ఆదివాసీ ప్రజలకు తామున్న భూమిపై హక్కు ఉంటుంది.

అందువల్ల నిషేధాజ్ఞల ప్రకారం ఎవరూ అతనికి ప్రమాదం కలిగించే చర్యలు చేపట్టరాదు. అతనున్న చోట ప్రవేశించరాదు.

''ఆ మనిషి జీవించే ఉన్నట్లు ఎప్పటికప్పుడు నిరూపించాల్సి ఉంటుంది'' అని గిరిజనుల హక్కుల కోసం కృషి చేస్తున్న 'సర్వైవల్ ఇంటర్నేషనల్' అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఫయోనా వాట్సన్ తెలిపారు.

దేశంలో ఆదివాసీల హక్కులపై పెద్ద ఎత్తున దాడి జరుగుతోందని ఆమె అన్నారు.

ఈ ఒంటరి మనిషి గురించి ఇంకా ఏం తెలుసు?

ఇతనిపై గతంలో అనేక పరిశోధనలు జరిగాయి, వార్తలు వెలువడ్డాయి. అమెరికా జర్నలిస్ట్ మోంటె రీల్ 'ద లాస్ట్ ఆఫ్ ద ట్రైబ్: ద ఎపిక్ క్వెస్ట్ టు సేవ్ ఎ లోన్ మ్యాన్ ఇన్ అమెజాన్' అనే పుస్తకం కూడా రాశారు.

ఇప్పటివరకు ఇతనితో ఎవరూ కూడా సంభాషించలేదని తెలుస్తోంది.

1995లో కొంతమంది అతని కుటుంబంపై దాడి చేశారు. ఆ దాడిలో ఇతనొక్కడే బతికి బయటపడ్డాడు.

ఇతని తెగ పేరు, ఏం భాష మాట్లాడతారో కూడా ఎవరికీ తెలీదు.

ప్రస్తుతం ఇతను గతంలో తాను నివసించే గుడిసెను కూడా వదిలేసి జంతువులను పట్టేందుకు ఉపయోగించే కన్నాల్లో జీవిస్తున్నాడు.

Image copyright Survival
చిత్రం శీర్షిక గతంలో అతను నివసించిన గుడిసె. ప్రస్తుతం అతను ఈ గుడిసెలో నివసించడం లేదు (ఈ ఫొటో 2005 నాటిది)

ఈ ఫుటేజ్‌కు ఎందుకంత ప్రాముఖ్యం?

ఇప్పటివరకు ఇతనికి సంబంధించిన ఒకే ఒక ఫొటో, అదీ మసకమసకగా ఉండేది.

1998లో ఫునాయ్ తరపున డాక్యుమెంటరీ తీయడానికి వెళ్లిన ఒక ఫొటోగ్రాఫర్ ఈ వీడియో చిత్రించాడు.

50 ఏళ్ల ఆ వ్యక్తి ఇంకా ఆరోగ్యంగా ఉండడంపై స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఫునాయ్ నియమాల ప్రకారం మానవ సమాజానికి దూరంగా ఉండే వాళ్లను కలవరు. అంతేకాకుండా ఆ వ్యక్తి కూడా తనను ఎన్నడూ కలవడానికి ప్రయత్నించవద్దని గతంలోనే స్పష్టం చేశాడు. తన వద్దకు రావడానికి ప్రయత్నించిన వారిపై బాణాలు సంధించాడు.

''గతంలో అతనికి ఎదురైన అనుభవాల దృష్ట్యా అతను బయట ప్రపంచాన్ని ప్రమాదకరమైన ప్రదేశంగా భావిస్తున్నాడు'' అని ఫయోనా వాట్సన్ తెలిపారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక అడవిని ఆక్రమించుకునేందుకు గతంలో అనేకసార్లు ప్రయత్నాలు జరిగాయి

ప్రమాదంలో ఉన్న ఒంటరి మనిషి

1970, 80లలో ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం సందర్భంగానే ఇతని తెగ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. రోడ్డు కారణంగా ఇక్కడ భూమికి మంచి డిమాండ్ ఏర్పడింది.

ప్రస్తుతం రైతులు, అక్రమంగా కలపను తరలించేవాళ్లు అతనున్న ప్రదేశాన్ని ఆక్రమించాలని ప్రయత్నిస్తున్నారు.

2009లో ఫునాయ్ అతని పరిరక్షణ కోసం ఒక తాత్కాలిక క్యాంప్ ఏర్పాటు చేసినపుడు కొంత మంది సాయుధులు ఆ క్యాంప్‌ను ధ్వంసం చేశారు. ఫునాయ్ సిబ్బందిని బెదిరించారు.

ఆదివాసీ ప్రజల రోగనిరోధక శక్తి తక్కువ కనుక ప్రస్తుతం అతను బయట ప్రపంచంలోకి వచ్చినా ఫ్లూ, తట్టులాంటి వ్యాధులు సోకే అవకాశముంది.

''నిజానికి అతని గురించి తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. కానీ అతను మనం కోల్పోతున్న విస్తృతమైన జీవ వైవిధ్యానికి ప్రతీక'' అని వాట్సన్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)