ఫోన్ స్కామ్: మొబైల్ ఫోన్లు హ్యాక్ చేసి డబ్బులు కొల్లగొడుతున్నారు

  • 22 జూలై 2018
కెన్యా మొబైల్ ఫోన్ యూజర్లు Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రపంచంలోనే అత్యధికంగా మొబైల్ మనీ వాడుతున్నది కెన్యా వాసులే

కెన్యాలో మొబైల్ ఫోన్లనే బ్యాంకు ఖాతాల్లా వాడుతున్నారు. కొంతమంది తమ డబ్బులన్నిటినీ ఫోన్లలోనే దాచుకుంటున్నారు. ఆ డబ్బులు కొట్టేయటానికి మోసగాళ్లు మొబైల్ ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు.

సామీ వనైనాకు ఆదివారం నాడు ఒక మెసేజ్ వచ్చింది. అతడి సిమ్ కార్డును మార్చటానికి సీక్రెట్ పర్సనల్ కోడ్ పంపించాలని ఆ మెసేజ్ సారాంశం.

అతడు అయోమయంలో పడ్డాడు. కొత్త సిమ్ కార్డు కావాలని అతడేమీ అడగలేదు. దానికి కొద్ది నిమిషాల ముందే.. ఫోన్ కంపెనీకి చెందిన కస్టమర్ సర్వీస్ అడ్వైజర్‌ని అంటూ ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. ఆ ఫోన్‌ కాల్‌ని సామీ ఎత్తిన వెంటనే కట్ చేశాడు.

‘‘చాలా కొద్దిసేపే మాట్లాడాను. నా వివరాలేవీ నేను చెప్పలేదు’’ అని సామీ బీబీసీకి తెలిపాడు.

అతడు వెంటనే తన మొబైల్ సంస్థ సఫారీకామ్‌ని సంప్రదించాడు. తన ఫోన్ నంబర్‌ మీద మోసం చేయటానికి ప్రయత్నం జరుగుతోందని తాను అనుమానిస్తున్నట్లు ఫిర్యాదు చేశాడు.

అయినా.. అతడి ఫోన్ నంబర్ పనిచేయకుండా పోయింది. మూడు రోజుల తర్వాత అతడి నంబర్ మళ్లీ పనిచేయటం ప్రారంభించింది.

ఇదంతా తనను బాగా భయపెట్టినట్లు అతడు ట్వీట్ చేశాడు.

తను ఫిర్యాదు చేసిన తర్వాత సఫారికామ్ తనను సంప్రదించిందని.. ముందు జాగ్రత్త చర్యగా తనకు కొత్త సిమ్ కార్డు జారీ చేసిందని అతడు చెప్పాడు. అయితే.. తన ఫోన్ నంబర్ ఎందుకు పనిచేయకుండా ఆగిపోయిందనే వివరాలు మాత్రం చెప్పలేదని తెలిపాడు.

‘‘కస్టమర్ సమాచారానికి భద్రత కల్పించటానికి మేం కట్టుబడి ఉన్నాం.. ఈ అంశాన్ని చివరి వరకూ పరిశీలిస్తాం’’ అని ఆ సంస్థ అతడిని ఉద్దేశించి ట్వీట్ చేసింది.

‘నా ఫోన్‌లో 18,000 డాలర్లు కాజేశారు’

అతడి కథనంతో.. ఇతరులు తమ అనుభవాలను వెల్లడించటం మొదలైంది. వారిలో చాలా మంది ఈ స్కామ్‌లో డబ్బులు పోగొట్టుకున్నారు.

మోసగాళ్లు తనను వలలో వేసుకుని 18,000 డాలర్లు (దాదాపు 12.5 లక్షల రూపాయలు) కాజేశారని రాజకీయ నాయకుడు స్టాన్లీ వాన్జీకు వెల్లడించారు.

మొదట.. తన మొబైల్ వ్యాలెట్‌ను తెరవటానికి వీలుపడదని.. దానిని మళ్లీ ప్రారంభించటానికి ఒక నంబర్‌కి ఫోన్ చేయాలి.. అంటూ ఒక నోటిఫికేషన్ వచ్చిందని ఆయన డైలీ నేషన్ వార్తాపత్రికకు చెప్పాడు. ఆయన అలాగే చేశాడు.

ఆ తర్వాత తన పిన్ నంబర్ మారిపోయిందని.. కొత్త నంబర్‌ను సృష్టించారని.. దానివల్ల తన డబ్బును తాను తీసుకోలేకపోతున్నానని అతడికి తెలిసింది.

‘‘నా మొబైల్ పిన్‌ను ఎలా కొత్తది జనరేట్ చేశారో.. దానిని అపరిచితులకు ఎలా ఇచ్చారో నాకు తెలియదు. వాళ్లు నా గుర్తింపును ఎలా చూపారో నాకు తెలియదు’’ అని వాన్జీకు పేర్కొన్నారు. తన మొబైల్ ఫోన్‌కు లింక్ చేయని బ్యాంక్ ఖాతాను కూడా హ్యాక్ చేశారని ఆయన చెప్పారు.

జనానికి.. రకరకాల కవరేజీలు, ప్లాన్‌లతో వేర్వేరు సంస్థల నుంచి వేర్వేరు సిమ్ కార్డులు ఉంటాయి. దీనివల్ల సిమ్ కార్డులు పాడవుతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో కస్టమర్లు కొత్త సిమ్ కార్డులను కోరటం సాధారణంగా జరిగేదే.

ప్రపంచంలో మొబైల్ మనీ ఉపయోగిస్తున్న వినియోగదారుల సంఖ్య కెన్యాలోనే అత్యధికంగా ఉంది. అందువల్లే ఇటీవలి సిమ్ కార్డ్ మోసాలు ప్రజల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి.

Image copyright Getty Images

దేశ జనాభా మొత్తం 4.7 కోట్లు అయితే.. దాదాపు సగం మంది డబ్బు లావాదేవీలు, చెల్లింపుల కోసం ఎం-పెసా ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్నారు.

ఫోన్ కంపెనీలు కూడా భాగస్వామ్యాల ద్వారా.. మొబైల్ మనీ సర్వీసులను బ్యాంకులతో అనుసంధానిస్తున్నాయి. దానివల్ల కస్టమర్లు బ్యాంకు ఖాతాల నుంచి మొబైల్ మనీకి నగదు అటూ ఇటూ మార్చుకోవటం సులభమవుతోంది.

సెరియాను అనే సైబర్ సెక్యూరిటీ సంస్థకు చెందిన విలియం మకాటియాని.. మొబైల్ ఫోన్లను హ్యాక్ చేసే స్కామ్‌లు సర్వసాధారణంగా మారుతున్నాయని డైలీ నేషన్ పత్రికకు చెప్పారు.

‘‘2016 నుంచి సిమ్‌ను మార్చటం... ప్రత్యేకించి నైజీరియాలో పెద్ద సమస్యగా మారింది. ఇది గత ఏడాది మధ్య నుంచి కెన్యాలోనూ పెరుగుతోంది’’ అని ఆయన పేర్కొన్నారు.

Image copyright Getty Images

ఈ స్కాముల నుంచి కాపాడుకోవటం ఎలా?

ఈ స్కామ్ ఎలా నడుస్తుందో స్పష్టంగా తెలుస్తోంది. మొబైల్ ఫోన్ పరిశ్రమను నియంత్రించే కమ్యూనికేషన్ అథారిటీ ఆఫ్ కెన్యా.. ఇటీవల ఈ జాగ్రత్తలు పాటించాలని వినియోగదారులకు సూచించింది:

- వ్యక్తిగత సమాచారాన్ని ఎన్నడూ ఎవరికీ చెప్పవద్దు

- పిన్ నంబర్‌ను ఎవరికీ చెప్పవద్దు

- ఆర్థిక సమాచారం లేదా పాస్‌వర్డులను కోరే రిక్వెస్టులను డిలీట్ చేయాలి

- గుర్తు తెలియని వారి నుంచి వచ్చే సందేశాలను అనుమానించాలి

సఫారికామ్ కూడా.. వినియోగదారులు తమ పాస్‌వర్డులు, పుట్టిన రోజులు, నేషనల్ ఐడెంటిటీ నంబర్లను సురక్షితంగా ఉంచుకోవాలని తన వినియోగదారులకు సూచించింది.

కస్టమర్లు తన అధికారిక కస్టమర్ కేర్ నంబర్ తెలుసుకుని ఉండాలని.. తద్వారా వేరే నంబర్ల నుంచి ఫోన్ చేసి వారి ఖాతాలను తెరిచేందుకు జరిగే మోసాల నుంచి జాగ్రత్త పడవచ్చునని సూచించింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)