పాకిస్తాన్: నవాజ్, ఇమ్రాన్, బిలావల్.. ఎవరి బలమెంత? ఈ ఎన్నికల ప్రాధాన్యత ఏంటి?

  • 23 జూలై 2018
పాకిస్తాన్ ఎన్నికలు Image copyright Reuters

పాకిస్తాన్ పార్లమెంటు ఎన్నికలు బుధవారం జరుగనున్నాయి. ఈ ఎన్నికల ప్రచారం హింసాత్మకంగా మారింది. రాజకీయ వివాదాలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో పాక్ ఎన్నికల బరిలో ప్రధానంగా పోటీపడుతున్నదెవరు? వారి బలాబలాలేమిటి?

దాదాపు 20 కోట్ల జనాభా ఉన్న పాకిస్తాన్‌లో ఎన్నికల్లో ఏం జరుగుతుంది అన్నది ముఖ్యమైన విషయమే. ఎందుకంటే.. అణ్వస్త్ర దేశమైన పాక్‌ను.. పొరుగునే ఉన్న.. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ముస్లింలున్న దేశాల్లో ఒకటైన భారతదేశానికి శత్రువుగా చాలా మంది పరిగణిస్తుంటారు.

1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ పాకిస్తాన్.. పౌర, సైనిక పాలనల మధ్య ఊగిసలాడుతూ కొనసాగుతోంది. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ఒకరకంగా చరిత్రాత్మకమైనవి. ఒక పౌర ప్రభుత్వం పూర్తి కాలం అధికారంలో కొనసాగి మరొక పౌర ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించనుంది. పాక్ చరిత్రలో ఇంతకుముందు ఇలా ఒక్కసారే జరిగింది.

ఈ ఎన్నికలకు ముందు అధికార పాకిస్తాన్ ముస్లిం లీగ్ - నవాజ్ (పీఎంఎల్-ఎన్) పార్టీకి, సైన్యానికి మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి.

సైన్యం.. కోర్టుల సాయంతో తమ పార్టీ వాళ్లే లక్ష్యంగా దాడులు చేస్తోందని పీఎంఎల్-ఎన్ ఆరోపిస్తోంది. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారంటూ 17,000 మందికి పైగా పీఎంఎల్-ఎన్ కార్యకర్తలు, నాయకులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

Image copyright EPA

మరోవైపు దేశంలోని మీడియా మీద తీవ్ర సెన్సార్‌‌షిప్‌తో పాటు.. బెదిరింపులూ ఎదుర్కొంటోంది. తీవ్రవాద బృందాలు ఈ ఓటింగ్‌లో పాల్గొనటం పట్ల పాక్ ప్రజాస్వామ్యవాదులు కొందరు ఆందోళన చెందుతున్నారు.

సైన్యం తను కోరుకున్న అభ్యర్థులకు అనుకూలంగా పాత రాజకీయ వ్యూహాలకు పాల్పడుతోందని చాలా మంది విశ్వసిస్తున్నారు.

‘‘ఎన్నికలను వక్రీకరించటానికి బాహాటంగా, నిస్సిగ్గుగా, తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది పాకిస్తాన్ సమర్థవంతమైన ప్రజాస్వామ్యంగా మారటం మీద ఆందోళనకరమైన ప్రభావాలు చూపుతుంది’’ అని హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ పేర్కొంది.

ఈ ఎన్నికల ప్రచారంలో హింసాత్మక దాడులు జరిగాయి. జూలై 13వ తేదీన బలూచిస్తాన్‌లో జరిగిన దాడిలోనే దాదాపు 150 మంది చనిపోయారు. అది తన పనేనని ఐఎస్ ప్రకటించుకుంది.

కీలక నాయకులు ఎవరు?

Image copyright AFP

నవాజ్ షరీఫ్

పార్టీ: పీఎంఎల్-ఎన్, ప్రస్తుత సీట్లు 182

మూడు సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన 68 ఏళ్ల నవాజ్ షరీఫ్.. పనామా పేపర్ల ఉదంతంలో అవినీతి దర్యాప్తు కారణంగా అనర్హత వేటుపడి ఆ పదవి నుంచి వైదొలగారు. అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడటానికి ఆయన లండన్ వెళ్లారు. ఆయనకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించినప్పటికీ.. జూలై ఆరంభంలో తన కుమార్తె మరియంతో కలిసి నాటకీయంగా పాక్‌కు తిరిగివచ్చారు. వారిద్దరూ ఇప్పుడు జైలులో ఉన్నారు.

సైన్యాన్ని తాను బహిరంగంగా విమర్శించినందుకు, ఇండియాతో సంబంధాలు మెరుగుపరచుకోవాలని తాను ప్రయత్నిస్తున్నందుకు.. సైన్యం తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నిందని షరీఫ్ ఆరోపిస్తున్నారు. కానీ ఇందులో తన పాత్ర ఏదీ లేదని సైన్యం చెబుతోంది. నవాజ్ సోదరుడు షెబాజ్ షరీఫ్ పార్టీ ప్రచారానికి సారథ్యం వహించారు. ఎన్నికల్లో గెలిస్తే ప్రధాని పదవి చేపట్టటానికి ఆయన ప్రయత్నించవచ్చు.

Image copyright AFP

ఇమ్రాన్ ఖాన్

పార్టీ: పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ), ప్రస్తుత సీట్లు: 32

ప్రఖ్యాత అంతర్జాతీయ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ (వయసు 65) రెండు దశాబ్దాల కిందటే పాక్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. కానీ ఆయన ఇంతవరకూ అధికారంలోకి రాలేదు. ఈసారి సైన్యం ఆయనకు అనుకూలంగా ఉందని.. ఆయన ప్రత్యర్థుల బలాన్ని దెబ్బతీయటానికి సైన్యం పనిచేస్తోందని.. చాలా మంది పరిశీలకులు నమ్ముతున్నారు.

కానీ తమ మధ్య ఎలాంటి కుమ్మక్కూ లేదన్నది ఇమ్రాన్ ఖాన్, సైన్యం మాట. అయితే.. ‘‘ఇప్పటివరకూ మనం చూసినవారందరిలోకెల్లా ప్రస్తుత సైన్యాధిపతి జనరల్ బాజ్వా ప్రజాస్వామ్యానికి అత్యంత అనుకూలమైన మనిషి కావచ్చు’’ అని ఇమ్రాన్ ఖాన్ బీబీసీ‌తో వ్యాఖ్యానించారు. అల్-ఖైదాతో లింకున్నట్లు చెప్తున్న ఒక గ్రూపు సహా పలు వివాదాస్పద బృందాలు ఆయన పార్టీకి మద్దతిస్తున్నాయి.

బిలావల్ భుట్టో జర్దారీ

పార్టీ: పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ), ప్రస్తుత సీట్లు: 46

ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకున్న బిలావల్ భుట్టో జర్దారీ వయసు 29 ఏళ్లు. వారసత్వ రాజకీయాల్లో తాజా నాయకుడు. ఆయన తల్లి బేనజీర్ భుట్టో, ఆయన తాత జుల్ఫికర్ అలీ భుట్టో.. ఇద్దరూ పాక్ ప్రధానమంత్రులుగా పనిచేశారు. వారిద్దరూ హత్యకు గురయ్యారు.

బిలావల్ మొట్టమొదటిసారిగా పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. ‘‘శాంతియుతమైన, ప్రగతిదాయకమైన, సుసంపన్నమైన, ప్రజాస్వామిక పాకిస్తాన్’’ అనే తన తల్లి ఆకాంక్షలను అమలు చేయాలని తను కోరుకుంటున్నట్లు చెప్తున్నారు. ఈ పార్టీ మూడో స్థానంలో నిలుస్తుందని ఎన్నికల సర్వేలు చెప్తున్నాయి.

ఏ పార్టీకి ఎక్కడ బలముంది?

పీఎంఎల్‌-ఎన్‌కు పంజాబ్ ప్రావిన్స్‌లో బలమైన పట్టుంది. అది నవాజ్ షరీఫ్ స్వస్థలం. దేశంలో ధనిక రాష్ట్రం. జనాభా కూడా ఎక్కువ. నేషనల్ అసెంబ్లీలో మొత్తం 272 సీట్లు ఉండగా.. అందులో సగానికి పైగా సీట్లు పంజాబ్‌ ప్రావిన్స్‌లోనే ఉన్నాయి. ఎన్నికల్లో ఇది కీలక రణక్షేత్రం.

ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ గెలవాలంటే.. ఇక్కడ గణనీయమైన ప్రభావం చూపాల్సి ఉంటుంది. 2013 ఎన్నికల్లో ఈ పార్టీ ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలో మెరుగైన ఫలితాలు సాధించింది.

బిలావల్ పార్టీ పీపీపీకి గ్రామీణ తరగతిలో ప్రజాదరణ ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. ఆ పార్టీకి సింధ్ ప్రావిన్స్‌లో మంచి పట్టు ఉంది.

ఏం జరగొచ్చు?

ఈ ఎన్నికల నిర్వహణ న్యాయబద్ధత మీద.. మూడు ప్రధాన పార్టీల్లోని రెండు పార్టీలు సందేహాలు వ్యక్తంచేశాయి. ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ పీఎంఎల్-ఎన్, ఇమ్రాన్ ‌ఖాన్ పీటీఐ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రెండిటిలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోయినట్లయితే.. ప్రభుత్వ ఏర్పాటులో బిలావల్ పార్టీ పీపీపీతో పాటు ఇతర పార్టీల పాత్ర కీలకమవుతుంది.

సైన్యంతో ఇమ్రాన్‌ఖాన్‌కు ఉందన్నట్లు చెప్తున్న సాన్నిహత్యం, ఇస్లామిక్ తీవ్రవాదం విషయంలో ఆయన మెతకగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో.. పీఎంఎల్-ఎన్ గెలిచినట్లయితే ఇండియా, అమెరికాలకు కొంత ఊరట లభించినట్లవుతుంది. ఉగ్రవాదంపై అమెరికా పోరులో పాకిస్తాన్ చిరకాల భాగస్వామి అయినప్పటికీ.. పొరుగు దేశం అఫ్ఘానిస్తాన్‌లో క్రియాశీలంగా ఉన్న తీవ్రవాద గ్రూపులకు పాక్ రక్షణ కల్పిస్తోందన్న ఆరోపణలు.. అమెరికాకు ఆగ్రహం తెప్పించాయి. దీనివల్ల పాకిస్తాన్‌కు రక్షణ సాయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిలిపివేశారు.

ఒకవేళ పీటీఐ గెలిచినట్లయితే.. పీఎంఎల్-ఎన్ తన మద్దతుదారులతో వీధుల్లో ఆందోళనలకు దిగవచ్చు. ప్రత్యేకించి.. నవాజ్ షరీఫ్ జైలులోనే ఉన్నట్లయితే ఈ పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అయితే.. ఎవరు గెలిచినా కానీ పాకిస్తాన్‌లో అత్యంత శక్తివంతమైన తన పాత్రను సైన్యం కొనసాగిస్తుంది.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)