గూగుల్ రాక ముందు జీవితం ఎలా ఉండేది?

  • రొనాల్డ్ హ్యూజెస్
  • బీబీసీ ప్రతినిధి
గూగుల్ సెర్చ్ బార్

నా పిల్లిని శాకాహారిగా మార్చడం మంచిదేనా? చిన్న పిల్లల వద్ద నుంచి ఆ తాజా వాసన ఎలా వెలువడుతుంది? ప్రేమంటే ఏమిటి? ఈ ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పగలరా?

గూగుల్ ఉనికిలోకి వచ్చిన ఈ 20 ఏళ్లలో అది ఇలాంటి అనేక వింత వింత ప్రశ్నలకు జవాబులిచ్చింది. ఇలా వింత ప్రశ్నల్ని అడగటం ఇప్పుడు అలవాటుగా మారింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు జులై 18వ తేదీ బుధవారం ఈయూ గూగుల్‌కు 34 వేల కోట్ల రూపాయల జరిమానా విధించింది.

గూగుల్ వచ్చాక చాలా ఉద్యోగాలలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. ఎలాంటి మార్పులంటే, ఒకవేళ గూగుల్ లేకుంటే ఆ పనులు ఎలా చేసేవారో కూడా ఊహించడం కష్టం.

ఫొటో సోర్స్, Gareth Hughes

ఫొటో క్యాప్షన్,

టైప్ రైటర్ మీద పని చేస్తున్న గారెత్ హ్యూజెస్

జర్నలిస్టులు

గారెత్ హ్యూజెస్ 1974 నుంచి 2006 వరకు డైలీ పోస్ట్ అనే వార్తాపత్రికలో విలేకరిగా పని చేశారు.

''నేను ఎవరికీ తెలియని విషయాల గురించి కనుక్కుని రాయాల్సి వచ్చేది. నా వద్ద ఎన్‌సైక్లోపీడియా ఉండేది. లివర్‌పూల్‌లోని మా సెంట్రల్ ఆఫీస్‌లో ఒక గ్రంథాలయం ఉండేది. దాంట్లో ప్రతి వార్తాపత్రిక, ప్రతి వార్త కటింగ్ ఉండేది. ఎవరైనా, ఏదైనా ప్రత్యేకమైన అంశం గురించి తెలుసుకోవాలంటే లైబ్రేరియన్ వెళ్లి దాన్ని శోధించి పట్టుకుని, మాకు ఫ్యాక్స్ చేసేవాడు.’’

‘‘అంతే కాకుండా ఆ రోజుల్లో మేం చాలా విషయాలు గుర్తు పెట్టుకోవాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు గూగుల్ కారణంగా పనులు చాలా సులభంగా అయిపోతున్నాయి'' అని హ్యూజెస్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

1974లో తల్లి రోజ్ హెయిల్‌బ్రాన్, తండ్రితో హిలరీ హెయిల్‌బ్రాన్ (కుడి చివర)

న్యాయవాదులు

హిలరీ హెయిల్‌బ్రాన్ 1972 నుంచి జూనియర్ బారిస్టర్‌గా పని చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం ఆమె లండన్‌లోని బ్రిక్ కోర్ట్ ఛాంబర్స్ సభ్యురాలిగా పని చేస్తున్నారు.

''ఆ రోజుల్లో జూనియర్ న్యాయవాదిగా నేను సీనియర్ల సూచన మేరకు సొంతంగా పరిశోధన చేయాల్సి వచ్చేది. లా రిపోర్టులు, ఇంకా ఇతర అనేక పుస్తకాలు శోధించాల్సి వచ్చేది. లైబ్రరీల చుట్టూ తిరగాల్సి వచ్చేది.''

''కానీ ఇప్పుడు అన్ని లా రిపోర్టులు ఆన్‌లైన్‌లో దొరకుతున్నాయి. నా షెల్ఫ్‌లో కనిపించే లా రిపోర్టులన్నీ ఇప్పుడు నిరుపయోగంగా మారిపోయాయి. అయితే ఇది ఒక రకంగా మంచిదే. దీని వల్ల చాలా సమయం ఆదా అవుతుంది. అంతే కాకుండా చాలా సౌకర్యం కూడా. అయితే గతంలో కన్నా ఎన్నో ఎక్కువ విషయాలు తెలుస్తున్నాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి'' అన్నారు హిలరీ.

లైబ్రేరియన్

దశాబ్దాల క్రిందట న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీ సిబ్బంది మానవ గూగుల్‌గా పని చేసేవాళ్లు. అనేక రకాల ప్రశ్నలతో తమ వద్దకు వచ్చే ప్రజలకు వాళ్లు సమాధానాలు ఇచ్చేవాళ్లు. ఇటీవల అక్కడి సిబ్బంది తమకు గతంలో వచ్చిన ప్రశ్నలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు.

''మృతదేహాల విక్రయానికి సంబంధించిన వ్యాపారం, దానిలో ఎంత వ్యాపారం జరుగుతుంది? మొదలైన వాటికి సంబంధించిన సమాచారం నాకు ఎక్కడ దొరుకుతుంది?'' అని 1948లో ఒక వ్యక్తి అడిగారు.

2018లో గూగుల్‌ను ఇదే ప్రశ్న అడిగితే అమెరికాలో మృతదేహాల వ్యాపారంపై రాయిటర్స్ పరిశోధనను చూడండి అనే సమాధానం లభిస్తుంది.

1949లో ఒక వ్యక్తికి ''ఎలుకలు వాంతి చేసుకుంటాయా?'' అనే సందేహం వచ్చింది.

''ఒక విషపూరితమైన పాము తనను తాను కరుచుకుంటే, అది మరణిస్తుందా?'' మరో వ్యక్తి సందేహం ఇది.

ఇప్పుడు అదే ప్రశ్నను గూగుల్‌ను అడిగితే, ''ఎవరికీ ఖచ్చితంగా తెలీదు'' అన్న సమాధానం లభిస్తుంది.

''18వ శతాబ్దపు ఇంగ్లీష్ పెయింటింగ్స్‌లో ఎందుకు అన్ని ఉడతలు కనిపిస్తాయి? ఆ ఉడతలు పెయింటర్‌ను కరవకుండా వాటిని ఎలా మచ్చిక చేసుకున్నారు?''

ఆ రోజుల్లో మహిళలు ఉడుతలను పెంచుకునేవారేమో అనేది గూగుల్ జవాబు.

ఫొటో సోర్స్, Janice Yellin

ఫొటో క్యాప్షన్,

పురాతన న్యూబియన్ పిరమిడ్‌ను పరిశీలిస్తున్న జానైస్ యెల్లిన్

విద్యావేత్త

జానైస్ యెల్లిన్ 1970వ దశకం ప్రారంభంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె మసచూసెట్స్‌లోని బాబ్సన్ కాలేజీలో ఆర్ట్ హిస్టరీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.

''గూగుల్ అన్నిటినీ మార్చేసింది. ఇప్పుడు మీరు మ్యూజియంకో, లైబ్రరీకో వెళ్లి సమయాన్ని వృధా చేసుకోకుండా క్షణాల మీద సమాచారాన్ని పొందొచ్చు. పరిశోధనపై పెట్టాల్సిన సమయం ఇప్పుడు 80 శాతం తగ్గిపోయింది'' అని జానైస్ తెలిపారు.

''అయితే లైబ్రరీలకు వెళ్లడం వల్ల సంబంధాలు ఏర్పడతాయి. ఉపాధి అవకాశాల గురించి తెలుస్తాయి. ఆన్‌లైన్‌లో పని చేయడం చాలా ఒంటరిగా ఉంటుంది. పుస్తకాలను చూస్తూ, ఇతరులతో సంబంధాలు ఏర్పరచుకోవడం ఒక మంచి అనుభవం. నేటి విద్యార్థులు అలాంటి నెట్‌వర్క్‌కు దూరం అవుతున్నారు'' అని జానైస్ అన్నారు.

వార్త మొదట్లో అడిగిన మూడు ప్రశ్నలకు మీకు సమాధానాలు తెలుసా? ఒకవేళ మీరు తెలుసుకోవాలనుకుంటే..

1) పిల్లిని శాఖాహారిగా మార్చటం అనేది చాలా సున్నితమైన విషయం. మార్చవచ్చు అని కానీ, మార్చకూడదు అని కానీ స్పష్టంగా చెప్పలేం.

2) చిన్న పిల్లల నుంచి, ముఖ్యంగా వారి తల నుంచి తాజా సువాసన ఎందుకు వస్తుందో ఎవరికీ తెలియదు. అయితే, వాళ్ల స్వేద గ్రంథుల్లోని రసాయనాల కారణంగానే ఈ సువాసనలు వస్తుండవచ్చు.

3) ప్రేమంటే ఏంటో మీ అంతట మీరే తెలుసుకోవాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)