అభిప్రాయం: పాత ప్రేమలను గుర్తు చేసే పరిమళం

  • 4 ఆగస్టు 2018
సెంటు బాటిల్ Image copyright RojaParfums/facebook

గమనిక: పరిమళాల సమీక్షలు ఒక వ్యక్తి జ్ఞాపకాల మీద ఆధారపడినవే కానీ అవి సాధికారిక విశ్లేషణలు అనుకోవడానికి వీలు లేదు. మీకు నచ్చిన పరిమళాల మీద మేం ఎలాంటి తీర్పులూ చెప్పడం లేదు. ఈ విశ్లేషణ ప్రారంభంలో చెప్పిన సైన్స్ సంగతులు నిజమే కానీ విశ్లేషణల్ని మాత్రం మరీ సీరియస్‌గా తీసుకోవద్దు.

మీరు వాడే పర్ఫ్యూమ్ మీలో ఏ జ్ఞాపకాన్ని తట్టి లేపుతుంది? బస్సులోనో, రైలులోనో ప్రయాణిస్తున్నపుడు తోటి ప్రయాణికుడు/ప్రయాణికురాలు ఒంటికి రాసుకున్న సుగంధ పరిమళం మీ ప్రియుడు/ప్రియురాలిని గుర్తుకుతెస్తోందా? కొన్నిసార్లు ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయి. ఎందుకంటే, కొన్ని పరిమళాలకు, మన జ్ఞాపకాలకు సంబంధం ఉంటుంది.

జ్ఞాపకాలు కంప్యూటర్లోని ఫైళ్ళలాగే ఉంటాయని, కావాలనుకున్నప్పుడు గుర్తుకు వస్తాయని అనుకోవడం సరదాగానే ఉంటుంది. కానీ, అది అన్ని వేళలా నిజం కాదు. జ్ఞాపకాలు అంతుచిక్కని విధంగా ఉంటాయి. ఒక్కోసారి వెంటాడి వేధిస్తాయి. వయసు మీద పడుతున్న కొద్దీ జ్ఞాపకాలు మనదైన ప్రపంచంలోనే ఆత్మల శకలాలుగా రహస్య పేటికల్లో దాగుంటాయన్న సంగతి అర్థమవుతుంది. అవి ఊహించని విధంగా దారి కాచి దాడి చేస్తాయని కూడా తెలుస్తుంది.

లింక్స్ పర్ఫ్యూమ్ చల్లుకున్న ఓ వ్యక్తి మన పక్క నుంచి అలా వెళ్ళిపోతే, ఆ పరిమళం మనల్ని టీనేజిలో ఆటస్థలంలో కాలు బెణికిన గాయాన్ని గుర్తు చేయవచ్చు. ఆ తరువాత 'సికె వన్' పరిమళం మన ముక్కుపుటాలను మీటితే సమీప గతంలో టీచర్ మీద పెంచుకున్న ప్రేమల సుడిగుండంలో మరోసారి పడిపోవచ్చు.

అన్ని విషయాలకంటే సువాసనలు మన బుద్ధికి వేగంగా అందుతాయి. మెదడులోని ఒక భాగం భావోద్వేగాలు, పాత జ్ఞాపకాల కోసం పని చేస్తుంది. సువాసనల కోసం పని చేసే భాగం కూడా దాని పక్కనే ఉంటుంది. బహుశా, ఈ సామీప్యతే జ్ఞాపకాలకు, సువాసనలకు మధ్య ఉన్న సంబంధానికి కారణం కావచ్చు.

వివిధ రకాలైన సువాసనలను గుర్తుపెట్టుకోవడం, వర్గీకరించడం లేదా విశ్లేషించడం చాలా కష్టం. కానీ, ఏదో ఒక దృశ్యం, శబ్దం, లేదా ఒక భావనతో ముడిపడిన వాసనలను సులభంగానే గుర్తించవచ్చు అని బోర్న్‌మౌత్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. ఆండీ జాన్సన్ బృందం చేసిన అధ్యయనం స్పష్టం చేస్తోంది.

'' ఏ పరిమళానికైనా మనకు తెలిసిన అనుభూతి లేదా ప్రాధాన్యం తోడవకపోతే, దాన్ని గుర్తుంచుకోవడం కష్టం. కానీ, జ్ఞాపకాలతో ముడిపడిన పరిమళాలకు ప్రత్యేకమైన అస్తిత్వం ఏర్పడుతుంది. అలాంటి వాసనలను సులభంగానే గుర్తుంచుకోవచ్చు'' అని డాక్టర్ జాన్సన్ అన్నారు.

జీవితంలో ఇతర దశలకన్నా, కౌమారం, యౌవన దశకు చెందిన జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకోవడం చాలా సులభం అని 'ది రెమినిసెన్స్ బంప్' పరిశీలనలో తేలింది.

''టీనేజ్ జ్ఞాపకాలు చాలా ఉద్వేగ భరితంగా ఉంటాయి'' అంటారు డాక్టర్ జాన్సన్.

కొన్నిరకాల పర్ఫ్యూమ్‌లు మీ జీవితంలోకి కొన్ని జ్ఞాపకాలను గుర్తు చేస్తుంటాయి. ఉదాహరణకు, మార్కెట్లోని కొన్నిరకాల పర్ఫ్యూమ్స్ ఎలాంటి జ్ఞాపకాలను గుర్తుచేస్తాయో ఓసారి చూద్దాం.

Image copyright Derrick Evans

ఇంపల్స్:

ఇంపల్స్ అనే పర్ఫ్యూమ్ సువాసన మీ యౌవనంలోని తొలినాళ్లను గుర్తుకు తెస్తుంది. ప్రపంచం మీకు కొత్తగా పరిచయమవుతున్న సమయం అది.. మీలో భావుకత్వం పురుడు పోసుకుంటున్న సందర్భం అది. సృష్టిలో ప్రతి చిన్న విషయమూ అందంగా, ఆనందంగా కనిపించే రోజులవి. ఆ పాత జ్ఞాపకాల్లో మునిగితేలడానికి చాలా మంది ఇష్టపడతారు.

లూ డుసీ పోర్ హోమ్:

ఈ పర్ఫ్యూమ్ సువాసన.. ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రేమ ద్రావకాన్ని పర్ఫ్యూమ్ బాటిల్లో నింపినట్లు ఉంటుంది. విందు, వినోదాల్లో మీ బట్టలకు అంటిన ఈ పరిమళం.. మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.

ఓల్డ్ స్పైస్

పన్నెండేళ్ళ ప్రాయం ఓ అమ్మాయి మీకు ఇచ్చిన కానుక. ఆమెను మీరు మీ పుట్టిన రోజుకు ఆహ్వానించారు. కానీ, వస్తుందని ఊహించలేదు. అది ఆ క్షణానికి సంబంధించిన పరిమళం. నువ్వు సుగంధాన్ని వర్షిస్తున్నావని మీ అమ్మ చెప్పిన జ్ఞాపకం. ఇది చిన్ననాటి ప్రేమల కస్తూరి పరిమళం.

పాకో రబ్బాన్ 1 మిలియన్:

ఈ పర్ఫ్యూమ్.. టీనేజర్ల కోసం ప్రత్యేకించినది. 'ఇది వాడితే మీరు బంగారంలా పరిమళిస్తారు..' అని ఈ ఉత్పత్తులు చెబుతాయి. కానీ ఎవ్వరైనా బంగారాన్ని వాసన చూశారా? అసలు చూడగలరా? అలాగే ఉంటుంది ఈ పర్ఫ్యూమ్ కూడా. కోట్ల రూపాయల కట్టల వాసనలా ఉంటుందని కూడా అంటారు. ఇంతకీ డబ్బు వాసన ఎలా ఉంటుందో ఎవరికైనా తెలుసా?

కోకో మేడ్‌మోజెల్:

వినియోగదారులను మభ్యపెట్టని పర్ఫ్యూమ్ కోకో మాడ్‌మోజేల్. కొన్ని కౌంటీలలో ఎదిగిన కూతుళ్లకు ఈ పర్ఫ్యూమ్‌ను బహుమతిగా ఇచ్చే తల్లిదండ్రులున్నారు. ఎందుకంటే తమ మీద నిఘా పెట్టే తల్లిదండ్రులనుంచైనా తప్పించుకోవచ్చేమోకానీ, ఒంటికి రాసుకున్న ఈ సుగంధం నుంచి తప్పించుకోలేరు.

లింక్స్:

లింక్స్ పరిమళం మీ మెడ వంపు నుంచి నిరంతరం సుగంధాన్ని వెదజల్లుతూనే ఉంటుంది. నిజానికి అది యౌవన దేహం వెదజల్లిన అణువుల పరిమళమే. కౌమార ప్రాయంలో ఆగిపోయిన ఆ పరిమళాన్ని లింక్స్ మీకు చెరిగిపోని జ్ఞాపకంలా కానుక చేస్తుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు