రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని నేలమట్టం చేయడం ప్రారంభించిన ఉత్తర కొరియా

  • 24 జూలై 2018
పాకిస్తాన్ Image copyright Getty Images

దేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఒక ముఖ్యమైన రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని ఉత్తర కొరియా నేలమట్టం చేయడం ప్రారంభించినట్లు తెలుస్తోంది.

జూన్‌లో అమెరికాకు ఇచ్చిన హామీల మేరకు సోహయి కేంద్రాన్ని నేలమట్టం చేస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి.

తమ రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని నేలమట్టం చేస్తామని ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ తనకు హామీ ఇచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో చెప్పారు. అయితే అది ఏ కేంద్రం అన్నది మాత్రం ఆయన స్పష్టంగా చెప్పలేదు.

ఈ కేంద్రాన్ని బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం కోసం ఉపయోగించేవారని అమెరికా అధికారులు అనుమానిస్తున్నారు.

Image copyright AFP PHOTO/ Pleiades CNES 2018
చిత్రం శీర్షిక సోహయి కేంద్రాన్ని నేలమట్టం చేస్తున్నట్లు వెల్లడిస్తున్న ఉపగ్రహ చిత్రాలు

గత నెల సింగపూర్‌లో ట్రంప్, కిమ్ జోంగ్-ఉన్‌ల మధ్య జరిగిన చరిత్రాత్మక సమావేశంలో, 'కొరియా ద్వీపకల్పాన్ని సంపూర్ణంగా అణునిరాయుధీకరణ' చేసే ఒప్పందంపై ఇరువురు నేతలూ సంతకాలు చేశారు.

అయితే ప్యాంగ్‌యాంగ్ ఎప్పుడు తన అణ్వాయుధాలను పూర్తిగా విసర్జిస్తుందో దానిలో స్పష్టమైన వివరాలు లేవని ఆ ఒప్పందంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఉత్తరకొరియాతో సంబంధాల విషయంలో తాను చాలా సంతోషంగా ఉన్నానని ట్రంప్ సోమవారం తెలిపారు. ఉత్తర కొరియా గత 9 నెలల్లో ఎలాంటి క్షిపణులను ప్రయోగించలేదని, అణు పరీక్షలు నిర్వహించలేదని ఆయన గుర్తు చేశారు.

జూన్ 12న కుదిరిన ఒప్పందానికి ఉత్తర కొరియా కట్టుబడి ఉంటుందా అన్న దానిపై సందేహాలు రేకెత్తుతున్న నేపథ్యంలో ఉత్తర కొరియా ఈ కేంద్రాన్ని నేలమట్టం చేయడం ప్రారంభించింది.

అణుపదార్థాల శుద్ధిపై అనుమానాలు

అయితే అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వెల్లడైన సమాచారం ప్రకారం, ఉత్తర కొరియా ఇంకా రహస్యంగా తన ఆయుధాల కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నివేదికల ప్రకారం ఉత్తర కొరియా తన అణుశుద్ధి కేంద్రం యాంగ్‌బ్యాన్‌ను మరింత అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు, మరికొన్ని రహస్య ప్రదేశాలలో కూడా అలాంటి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఉత్తర కొరియా ఇప్పటివరకు ఆరు అణుపరీక్షలు నిర్వహించింది. చివరిసారిగా ఆ దేశం గత ఏడాది సెప్టెంబర్‌లో అణుపరీక్ష నిర్వహించింది.

అమెరికా వరకు వెళ్లగలిగే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు తమ వద్ద ఉన్నట్లు గతంలో ఆ దేశం ప్రకటించుకుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)