గ్రీస్‌లో కార్చిచ్చు: 60 మంది మృతి, 104 మందికి గాయాలు

  • 24 జూలై 2018
గ్రీస్‌లో దావాగ్ని Image copyright Getty Images

గ్రీస్‌ అడవుల్లో చెలరేగిన మంటలకు మనుషులు ఆహుతి అవుతున్నారు. ఇప్పటిదాకా ఈ దావాగ్ని బారినపడి కనీసం 60మందికి మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. గత పదేళ్లలో ఇది భారీ అగ్ని ప్రమాదం.

'మతి' గ్రామంలోని ఓ ఇంటి ఆవరణలో 26 మృతదేహాలు లభ్యమైనట్లు రెడ్ క్రాస్ తెలిపింది. ఈ విషయంలో అంతర్జాతీయ సహాయాన్ని గ్రీస్ అర్థించింది.

ఇప్పటికే వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మంటలను అదుపు చేయడం అత్యంత కష్టంగా మారిందని అధికారులు చెబుతున్నారు. గ్రీస్ రాజధాని ఏథెన్స్ సమీపంలోని ప్రజలు ఇళ్లు వదిలి ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు.

ఈ మంటల నుంచి తప్పించుకోవడానికి సముద్రంలోకి వెళ్లిన 10మంది పర్యాటకుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు.

Image copyright Getty Images

''మంటలను అదుపు చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం'' అని ప్రధాని అలెక్సిస్ సిప్రాస్ అన్నారు. ఈ ఘటన కారణంగా ప్రధాని.. తన బోస్నియా పర్యటనను రద్దు చేసుకున్నారు.

బాధితుల్లో చాలా మంది ఏథెన్స్‌కు 40కి.మీ. దూరంలో ఉన్న 'మతి'లో చిక్కుకున్నారు. చాలా మంది ఇళ్లల్లో ఉన్నపుడు, కార్లలో ప్రయాణిస్తున్నపుడు మంటలు వ్యాపించి అక్కడే మృతి చెంది ఉండొచ్చు.

ఈ ప్రమాదంలో 104మందికి పైగా గాయపడ్డారు. అందులో 11మంది పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డవారిలో 16 మంది చిన్నపిల్లలు ఉన్నారు.

ఈ దావానలం వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో.. ఆకాశానికి ఎగిసిపడుతున్నా దట్టమైన మంటలు, పొగ, ఆ మంటల నుంచి ప్రాణభయంతో కార్లల్లో పారిపోతున్న జనం కనిపిస్తారు.

Image copyright EPA

మంటలు వ్యాపించిన తీర ప్రాంతాల్లో ప్రాణాలు దక్కించుకోవడానికి చాలా మంది ప్రజలు సముద్రంలోకి వెళ్లారు.

''అదృష్టం కొద్దీ మేం తీర ప్రాంతంలో ఉన్నాం. మంటలు అంతటా వ్యాపించాయి. తప్పించుకోడానికి ఎక్కడికీ పోలేం. ఆ మంటలు మమ్మల్ని వెంటాడాయి. మంటల తాకిడికి మా వీపులు కాలిపోయాయి. అందుకే సముద్రంలోకి దూకి ప్రాణాలు దక్కించుకున్నాం'' అని మతి ప్రాంతానికి చెందిన వ్యక్తి అన్నారు.

ప్రధాని సిప్రాస్ మాట్లాడుతూ.. ''అన్ని అత్యవసర విభాగాలనూ రంగంలోకి దించాం. ఏథెన్స్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఎమర్జెన్సీ ప్రకటించాం'' అన్నారు.

Image copyright Getty Images
Image copyright Getty Images

బాధితులను రక్షించడానికి హెలీకాప్టర్లు, నిపుణులైన అగ్నిమాపక సిబ్బందిని పంపాలని యూరోపియన్ దేశాలను గ్రీస్ ప్రభుత్వం కోరింది. ఇప్పటికే ఇటలీ, జర్మనీ, పోలండ్, ఫ్రాన్స్ దేశాలు తమవంతు సాయంగా కొన్ని విమానాలను, వాహనాలను, అగ్నిమాపక సిబ్బందిని పంపాయి.

''నేను చాలా మృతదేహాలను చూశాను. కార్లు.. అన్నీ కాలిపోయాయి. అదృష్టం కొద్దీ నేను బతికి బయటపడ్డాను'' అని మతి ప్రాంతానికి చెందిన ఓ మహిళ రాయిటర్స్‌కు తెలిపారు.

అట్టికా ప్రాంతంలో ఇలా మంటలు చెలరేగడం తరచూ జరుగుతుంది. వేసవి ఎండ తాపానికి ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. కానీ ఈసారి.. దోపిడీలకు పాల్పడే కొందరు ఇళ్లకు నిప్పుపెట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగుంటుందని ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో అధికారులు అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు