పిల్లలు లావైపోతున్నారా, ఏం చేయాలి?

  • 25 జూలై 2018
బరువు Image copyright Getty Images

అధిక బరువును నిర్లక్ష్యం చేస్తే అది అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తుంటారు. మరి పిల్లల్లో అధిక బరువు సమస్యను అధిగమించడం ఎలా? పిల్లల బరువు అధికంగా పెరగకుండా ఉండేందుకు తల్లిదండ్రులు ఏం చేయాలి?

ప్రపంచంలో అత్యధికంగా ఊబకాయంతో బాధపడుతున్న పిల్లలు కలిగిన దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉందని గతేడాది ఓ అధ్యయనంలో తేలింది. దేశంలో దాదాపు కోటి 40 లక్షల మంది చిన్నారులు ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉన్నారని ఆ అధ్యయనం పేర్కొంది.

చైనా ప్రథమ స్థానంలో ఉండగా.. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లోనూ ఈ సమస్య అధికంగానే ఉంది.

అధిక బరువు గుర్తించడం ఎలా?

పిల్లల్లో అధిక బరువును గుర్తించడానికి సులువైన మార్గం వాళ్ల బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) పరిశీలించడం. దాని ద్వారా పిల్లల బరువు వారి వయసుకు, ఎత్తుకు తగ్గట్టుగా ఉందా? లేదా ఎక్కువ, తక్కువ ఉందా? అన్నది తెలుస్తుంది.

సాధారణంగా ఎనిమిదేళ్ల వయసు నుంచే బాలికల్లో అధిక బరువు సమస్య మొదలయ్యే అవకాశం ఉందని 2009లో జరిగిన ఓ పరిశోధనలో వెల్లడైంది.

సాధారణ వ్యక్తులతో పోల్చితే ఊబకాయంతో బాధపడుతున్న మహిళకు పుట్టే బిడ్డకు (అమ్మాయి) అధిక బరువు సమస్య 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని కూడా పరిశోధకులు గుర్తించారు.

అలాగే తండ్రి అధిక బరువుంటే, వారి మగ పిల్లలకు ఊబకాయం వచ్చే అవకాశం 6 రెట్లు అధికంగా ఉంటుంది.

జాగ్రత్తలు ఏమిటి?

పిల్లల్లో బరువును నియంత్రణలో ఉంచేందుకు తల్లిదండ్రులు ఏం చేయాలనే దానిపై వైద్య నిపుణులు కొన్ని సూచనలిస్తున్నారు.

  • పిల్లలతో పాటే కుటుంబ సభ్యులంతా కలిసి ఒకేచోట కూర్చుని తినేందుకు ప్రయత్నించాలి.
  • స్వీట్లు, తియ్యటి పానీయాలు తీసుకోకూడదు.
  • ఎప్పుడూ ఇంట్లో వండిన పదార్థాలనే తినేందుకు ప్రయత్నించాలి.
  • సమతుల పోషకాహారం తీసుకోవాలి.
Image copyright THE SCHOOL FOOD PLAN

వ్యాయామాన్ని ప్రోత్సహించండి

చిన్నపిల్లలు ప్రతి రోజూ 60 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలా అని ఒకేసారి విరామం లేకుండా చేయకూడదు. 5 నుంచి 10 నిమిషాల చొప్పున రోజులో పలుమార్లు చేయాలి.

సాధారణ బరువున్న పిల్లల కంటే అధిక బరువు కలిగినవారు ఎక్కువగా వ్యాయామం చేయాలని కొందరు భావిస్తారు. కానీ అలా చేయాల్సిన అవసరం లేదు. ఇద్దరూ ఒకేలా వ్యాయామం చేసినా.. వారి బరువుకు తగ్గట్టుగానే వారిలో కెలొరీలు ఖర్చవుతాయి.

చిన్నప్పటి నుంచే పిల్లలకు సైకిల్ తొక్కడం అలవాటు చేయాలి.

Image copyright Getty Images

చక్కెరకు కత్తెర వేయండి

చాలావరకు పిల్లలు తియ్యని పానీయాలు, స్వీట్లు అంటే అమితాసక్తి చూపిస్తారు. కానీ.. చక్కెరను నియంత్రణలో ఉంచాలని వైద్యులు సూచిస్తున్నారు.

గరిష్ఠంగా పిల్లలకు ప్రతి రోజూ అందాల్సిన చక్కెర:

  • 4 నుంచి 6 ఏళ్ల పిల్లకు 19 గ్రాములు
  • 7 నుంచి 10 ఏళ్ల పిల్లలకు 24 గ్రాములు
  • 11 ఏళ్లకు పైబడిన వారికి 30 గ్రాములు

ఆహారంలో రోజూ పండ్లు, కూరగాయలు ఇవ్వాలి.

కూరగాయలు, పండ్లు కలిసిన రసాలను రోజులో 150 మిల్లీ లీటర్లకు మించకుండా ఇవ్వవచ్చు.

భోజనం తినేందుకు పిల్లలకు పెద్దలు తినే ప్లేట్లను ఇవ్వకూడదని, అలా ఇస్తే వాళ్లు అవసరానికి మించి ఆహారం తినేందుకు ప్రయత్నిస్తారని నిపుణులు అంటున్నారు.

అలాగే ప్లేటులో ఒకేసారి ఎక్కువ ఆహారం పెట్టకుండా, అడుగుతుంటే కొద్దికొద్దిగా పెట్టాలి.

రోజూ ఒకే సమయానికి తినేలా అలవాటు చేయాలి.

Image copyright Thinkstock

కంటినిండా నిద్ర

సరిపడా నిద్ర పోకపోవడం కూడా అధిక బరువుకు దారితీస్తోందని 2011లో న్యూజీలాండ్ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో తేలింది.

తక్కువ సమయంపాటు నిద్రపోతున్న పిల్లల్లో ఏడేళ్ల వయసులోనే బీఎంఐ అధికంగా పెరుగుతోందని గుర్తించారు.

పిల్లలు రోజులో రెండు గంటలకు మించి టీవీ చూడకూడదని నిపుణులు చెబుతున్నారు.

నిద్రపోయేటప్పుడు వారి ముందు టీవీ, స్మార్ట్‌ఫోన్, వీడియో గేమ్ లాంటి ఎలక్ట్రానిక్ తెరలు లేకుండా చూడాలి.

Image copyright PA

భయపెట్టొద్దు

చిన్నతనం నుంచే పిల్లలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించేందుకు ప్రయత్నించాలి.

అయితే... ఎక్కువగా తింటే లావైపోతావు, అందవిహీనంగా తయారవుతావు అనే మాటలు మాత్రం అనకూడదు. అలా అంటే ఆ పదార్థాలను పిల్లలు మరింత ఎక్కువగా తినాలని అనుకుంటారని నిపుణులు అంటున్నారు.

టీనేజీ పిల్లలతో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే టీనేజీ పిల్లల్లో కొందరు లావైపోతామని భయపడి తినడం మానేసి అనారోగ్యం పాలయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.

దీర్ఘకాల ఆరోగ్య ప్రయోజనాల గురించి నెమ్మదిగా వివరిస్తూ వారు తమ అలవాట్లను మార్చుకునేలా ప్రోత్సహించాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)