లావోస్‌లో కుప్పకూలిన డ్యాం.. గ్రామాలను ముంచెత్తిన వరద.. వందలాది మంది గల్లంతు

  • 24 జూలై 2018
లావోస్ వరద బాధితులు Image copyright EPA

లావోస్‌లోని ఈశాన్య ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఒక ఆనకట్ట కుప్పకూలటంతో వందలాది మంది గల్లంతయ్యారని, కనీసం 20 మంది చనిపోయారని ప్రభుత్వ మీడియా తెలిపింది.

అటేపు ప్రావిన్స్‌లోని ఈ హైడ్రోఎలక్ట్రిక్ (జలవిద్యుత్) డ్యామ్.. సోమవారం పొద్దుపోయాక కూలిపోయిందని.. ఆరు గ్రామాలను ఆకస్మిక వరద ముంచెత్తిందని లావో న్యూస్ ఏజెన్సీ చెప్పింది.

దీంతో 6,600 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులైనట్లు పేర్కొంది.

వరద నీటిలో మునిగిపోయిన ఇళ్ల పైకప్పులపై చిక్కుకుపోయిన గ్రామస్తులు, పడవల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న దృశ్యాలు.. ఫొటోలు, వీడియోల్లో కనిపించాయి.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవరద బాధిత గ్రామస్తులను బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీడియో: Attapeu Today

‘‘ఈ విపత్తు కొందరి ప్రాణాలను బలితీసుకుంది. వందలాది మంది గల్లంతయ్యారు’’ అని ఆ వార్తా సంస్థ తెలిపింది.

క్జి-పియాన్, క్జి-నామ్‌నోయ్ ఆనకట్ట నిర్మాణం 2013లో మొదలైంది. వచ్చే ఏడాది ఇది ప్రారంభం కావాల్సి ఉంది.

ఈ ఆనకట్టలో భాగంగా నిర్మించిన 770 మీటర్ల పొడవు, 16 మీటర్ల ఎత్తు ఉన్న ‘సాడిల్ డ్యామ్’ కూలిపోయినట్లు డ్యామ్ నిర్వాహకుల నుంచి తమకు నివేదిక అందిందని.. ఈ ప్రాజెక్టులో ప్రధాన భాగస్వామి అయిన థాయ్‌లాండ్ సంస్థ రాట్చాబురి ఎలక్ట్రిసిటీ జెనరేటింగ్ హోల్డింగ్ చెప్పింది.

వరుసగా వచ్చిన తుపాను వర్షాల వల్ల భారీ పరిమాణంలో నీటి ప్రవాహం రిజర్వాయరులోకి వచ్చిందని ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.

Image copyright AFP/GETTY IMAGES

‘‘ఈ ప్రాంతం చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలను ప్రస్తుతం క్జి-పియాన్, క్జి-నామ్‌నోయ్ పవర్ కంపెనీ లిమిటెడ్, సంబంధిత సంస్థలు ఖాళీ చేయించాయి’’ అని తెలిపింది.

‘‘అనూహ్యమైన భారీ వర్షాల వల్ల’’ చిన్న సరఫరా ఆనకట్ట కూలిపోయిందని, ప్రధాన ఆనకట్ట కాదని ఈ ప్రాజెక్టులో మరో భాగస్వామి అయిన దక్షిణ కొరియా సంస్థ ఎస్.కె. ఇంజనీరింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ అధికార ప్రతినిధి ఒకరు బీబీసీకి చెప్పారు.

‘‘కచ్చితమైన కారణం ఏమిటనేది మాకు ఇంకా తెలియదు. అయతే ఆనకట్ట పై భాగంలో కొంత భాగం కూలిపోయిందని, నీరు ఆ సరఫరా డ్యాం నుంచి పొంగి ప్రవహించిందని మేం భావిస్తున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు.

లావోస్ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు.. డ్యామ్ కింది భాగంలో నివసించే ప్రజలు, పర్యావరణంపై చూపగల ప్రభావాల మీద గతంలో పర్యావరణ బృందాలు భయాలు వ్యక్తం చేశాయి.

ప్రధానమంత్రి తోంగ్లోన్ సిసోలిత్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారని, సహాయ చర్యలను సీనియర్ అధికారులు పర్యవేక్షిస్తున్నారని ప్రభుత్వ మీడియా తెలిపింది.

బాధితులకు దుస్తులు, ఆహారం, తాగునీరు, మందులు వంటి అత్యవసర సాయాన్ని అందించాల్సిందిగా ప్రభుత్వ సంస్థలు, ఇతర వర్గాల వారికి స్థానిక సంస్థలు విజ్ఞప్తి చేశాయి.

లావోస్ జలవిద్యుత్ ఆకాంక్షలు

  • లావోస్ ప్రభుత్వం.. ‘ఆసియా బ్యాటరీ’గా మారాలన్న లక్ష్యంతో భారీ ఎత్తున ఆనకట్టల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
  • మెకాంగ్ నది, దాని ఉపనదుల మీద లావోస్ ఉంటుంది. ఇది జలవిద్యుత్ ఉత్పత్తికి చాలా అనువైన ప్రదేశం.
  • 2017 నాటికి ఈ దేశంలో 46 జలవిద్యుత్ ప్లాంట్లు పనిచేస్తున్నాయి. మరో 54 ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయి.
  • 2020 నాటికి మరో 54 విద్యుత్ పంపిణీ లైన్లు, 16 సబ్‌స్టేషన్లు నిర్మించాలని లావోస్ ప్రణాళిక రూపొందించింది.
  • లావోస్ ఇప్పటికే తను ఉత్పత్తి చేసే జలవిద్యుత్‌లో మూడింట రెండు వంతులను విదేశాలకు ఎగుమతి చేస్తోంది. దేశం నుంచి జరిగే మొత్తం ఎగుమతుల్లో 30 శాతం విద్యుత్తే.

ఆధారం: Hydropower.org, లావోతియన్ టైమ్స్, లావో న్యూస్ ఏజెన్సీ


ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

హోలీ రోజున గురుగ్రామ్‌లో ఏం జరిగింది.. ఆ కుటుంబంపై మూకుమ్మడిగా ఎందుకు దాడి చేశారు: Ground Report

ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి రూ. 72 వేలు వరకు ఇస్తాం: రాహుల్ గాంధీ

‘నయనతారను చూస్తే దెయ్యాలే పారిపోతాయి’.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేతను సస్పెండ్ చేసిన డీఎంకే

‘ప్రత్యేక రాష్ట్రమే రాయలసీమకు శాశ్వత పరిష్కారం’

డోనల్డ్ ట్రంప్: రష్యాతో కుమ్మక్కు కాలేదన్న ముల్లర్ రిపోర్ట్

భారత్, దక్షిణాసియా అమ్మాయిలపై ఆస్ట్రేలియాలో లైంగిక వేధింపులు

వైసీపీ అభ్యర్థిగా సీఐ గోరంట్ల మాధవ్‌ నామినేషన్‌కు ఆమోదం లభిస్తుందా...

ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ డైరీ: ఏడాదిలో ఆంధ్రాను అమెరికా చేస్తా- కేఏ పాల్‌ మేనిఫెస్టో ఇదే