బాదల్‌పరా: ఇది పూర్తిగా మహిళలు పరిపాలించే గ్రామం, ఎంత బాగుందో చూడండి
మహిళల చేతికి అధికారం అప్పగిస్తే అభివృద్ధి ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి గుజరాత్‌లోని గిర్ జిల్లా బాదల్‌పరా గ్రామమే ఓ ఉదాహరణ. 15 ఏళ్ల నుంచి ఈ ఊళ్లో మహిళలే ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వస్తున్నారు. వైఫై, విద్యుత్తు, డ్రైనేజీ, రోడ్ల నిర్మాణంతో వీరు తమ గ్రామాభివృద్ధికి కొత్త బాటలు వేస్తున్నారు.
రమా పంపానియా 15 ఏళ్లుగా గ్రామ పంచాయతీ సభ్యురాలిగా పనిచేస్తున్నారు. 2005 నుంచి ఈ గ్రామాన్ని మహిళలే పాలిస్తున్నారు. అప్పటి నుంచి ఈ ఊరు ఊహించని రీతిలో అభివృద్ధి చెందుతోంది.
‘‘మా గ్రామంలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి. మేం బాగానే పరిపాలిస్తున్నాం. కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ కలిసికట్టుగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం.
చక్కటి రోడ్లు, ఊరంతా పచ్చదనం, ఇంటి ముందు గార్డెన్లు, వ్యర్థాల నిర్వహణ... ఇవన్నీ మా ఊరిని ఉన్నతంగా నిలబెడుతున్నాయి.’’ అని రమా పంపానియా అన్నారు.
‘‘ఇక్కడ రోడ్ల మీద ఎవరూ చెత్త వేయరు. ఊరంతా మరుగుదొడ్లు నిర్మించాం. అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. మార్కెట్లో చెత్త వేయడాన్ని, రోడ్ల మీద ఉమ్మి వేయడాన్ని కూడా అనుమతించం. ఎవరి ఇంటి ముందైనా చెత్త కనిపిస్తే వారికి జరిమానా విధిస్తాం.’’ అని వివరించారు.
గుజరాత్లో సర్పంచ్‌తో సహా మెంబర్లను కూడా ఎన్నిక లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకునే గ్రామాలను సమ్రస్ గ్రామాలు అంటారు. గత 15 ఏళ్ల నుంచి బాదల్‌పరా సమ్రస్ గ్రామంగా ఉందంటే దానికి కారణం ఇక్కడి పరిపాలనలో పాలుపంచుకుంటున్న మహిళలే.
వాళ్లే ఈ గ్రామానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చారు.
‘‘మహిళలు అధికారం చేబట్టినప్పుడు నిర్ణయాలు తీసుకునే విధానంలో వేగం పెరుగుతుంది. ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు కూడా ఇప్పుడు మెరుగుపడ్డాయి. స్వచ్ఛతపై మహిళలకు చక్కటి అవగాహన ఉంది.’’ అని గ్రామ వాసి డాక్టర్ హెతల్ బరద్ బీబీసీకి వివరించారు.
జయశ్రీ పంపానియాకు వాళ్ల అమ్మే ఆదర్శం. ఆమె లాగానే ఏదో ఒక రోజు తాను కూడా ఈ గ్రామ పంచాయతీ పాలనలో పాలు పంచుకోవాలనుకుంటున్నారు.
‘‘అమ్మను చూశాక నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. నేను కూడా గ్రామానికి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నా. పంచాయతీ పాలనే కాకుండా ఇంటి విషయాలను కూడా అమ్మే చూసుకుంటుంది. ఆమె నుంచి నేర్చుకుంటూనే ఉంటా. ’’ అని జయశ్రీ పంపానియా అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో మహిళల నాయకత్వం వల్ల ఎలా లాభం జరుగుతుందో రమా పంపానియా, ఆమె సహచర మహిళా నేతల బృందం రుజువు చేశారు. కుటుంబంపై, సమాజంపై సానుకూల ప్రభావం ఉంటుందని కూడా వారు చాటిచెప్పారు.
ఇంకా ఈ గ్రామ మహిళలు ఏమంటున్నారో పై వీడియోలో చూడండి.
రిపోర్టింగ్: అరవింద్ చాబ్రా
మా ఇతర కథనాలు:
- భర్త పాకిస్తాన్లో, భార్య భారత్‌లో
- మరో 10వారాల్లో పాకిస్తాన్ ఖజానా ఖాళీ!
- బిహార్: 'సంరక్షణ గృహంలో 29 మంది బాలికలపై అత్యాచారం'
- పండరీపుర యాత్ర: 'ఈ ఒక్క నెలే మాకు స్వేచ్ఛ, ఇంటికెళ్తే మళ్లీ అవే భయాలూ, బాధలు, బాధ్యతలు’
- ఈ లక్షణాలు కనిపిస్తే, అది మధుమేహం కావొచ్చు... జాగ్రత్త!
- వచ్చేస్తోంది.. మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ సూపర్ హీరో
- శానిటరీ న్యాప్కిన్లపై జీఎస్టీ రద్దు వెనకున్నది ఈ అమ్మాయే
- హైదరాబాద్‌లో రోహింజ్యాల ఫుట్‌బాల్ జట్టు ఇదీ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)