అమెరికా: రైతులకు రూ.82 వేల కోట్ల సాయం.. ట్రంప్ చర్యలతో మేలెంత?

  • 27 జూలై 2018
కాలిఫోర్నియాలో క్యారెట్లను వెలికి తీస్తున్న యంత్రం Image copyright Getty Images

ఇతర దేశాలతో అమెరికా వాణిజ్య యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం రైతులకు రూ.82 వేల కోట్ల ఆర్థిక సాయం అందించే ప్రణాళికను రూపొందించింది.

ఇతర దేశాలపై అమెరికా విధించిన సుంకాలకు బదులుగా ఆయా దేశాలు అమెరికాకు చెందిన సోయాబీన్స్ తదితర ఉత్పత్తులపై పన్నులను పెంచాయి. ఈ నేపథ్యంలో నష్టపోతున్న రైతులకు అండగా నిలిచేందుకు ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తారు. ఈ ప్రణాళిక కింద సబ్సిడీలు అందించడం, అమ్ముడుపోని పంటలు కొనడం తదితర పనులు చేపడతారు.

అమెరికా పట్ల విదేశాలు అనుసరిస్తున్న విధానాలపై ఒత్తిడి తీసుకువచ్చేందుకే ఈ సుంకాలను ప్రవేశపెట్టామని ట్రంప్ తెలిపారు. జులై 24వ తేదీ మంగళవారం ఒక ప్రసంగంలో ట్రంప్ మాట్లాడుతూ.. ఈ వాణిజ్య యుద్ధంలో రైతులు నష్టపోకూడదనే ఈ చర్య తీసుకున్నామని తెలిపారు.

అమెరికా వ్యవసాయ పరిశ్రమకు 20 శాతం ఆదాయం ఎగుమతుల ద్వారానే వస్తోంది. ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు కొనుగోలుదారులతో దీర్ఘకాలిక సంబంధాలను దెబ్బ తీస్తున్నాయని చాలా మంది రైతులు అభిప్రాయపడుతున్నారు.

అమెరికా నుంచి సోయాబీన్స్‌ కొనుగోలు చేస్తున్న చైనా... అమెరికా సుంకాలపై తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించిన నేపథ్యంలో సోయాబీన్స్‌ అమ్మకాలు ఏప్రిల్ నుంచి 15 శాతం తగ్గిపోయాయి.

Image copyright Getty Images

ఇప్పటివరకు జరిగింది -

  • మార్చి: విదేశీ ఉక్కు, అల్యూమినియంపై సుంకాలు ప్రకటించిన అమెరికా. అమెరికా 2017లో రూ.3 లక్షల కోట్లు విలువ చేసే ఉక్కు, అల్యూమినియం కొనుగోలు చేసింది.
  • ఏప్రిల్: అమెరికా ఉత్పత్తులపై చైనా రూ.20 వేల కోట్ల మేర సుంకాన్ని పెంచింది.
  • జూన్: ఈయూ, కెనడా, మెక్సికోలకు సుంకాల్లో ఇచ్చే మినహాయింపు కాలం పూర్తి. దీంతో ఆ దేశాలు అమెరికా ఉత్పత్తులపై రూ.1.37 లక్షల కోట్లు సుంకాలు విధించాయి.
  • జులై: ఇతర దేశాల ఎగుమతులపై రూ.2.3 లక్షల కోట్ల సుంకాలు విధించిన అమెరికా, చైనా.

రానున్న కాలంలో చైనా ఉత్పత్తులపై రూ. 13 లక్షల కోట్ల మేర సుంకాలు పెంచాలని అమెరికా యోచిస్తోంది. దానికి తోడు రూ. 20 లక్షల కోట్ల మేర విదేశీ కార్లు, విడిభాగాలపై సుంకాలు విధించాలని భావిస్తోంది. దీనికి బదులుగా కెనడా, మెక్సికో, ఈయూలు తామూ తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నాయి.

ఈ వాణిజ్య యుద్ధాల కారణంగా అమెరికా రైతులు సుమారు రూ.75 వేల కోట్ల మేర నష్టపోతారని అమెరికా వ్యవసాయ శాఖ అంచనా వేసింది.

ప్రభుత్వం రైతులకు అందజేయనున్న రూ. 82 వేల కోట్లకు కాంగ్రెస్ అనుమతి అవసరం లేదు.

ఇది సోయాబీన్స్, గోధుమ, జొన్నలాంటి పంటలు పండించే రైతులకు అందుతుంది. అంతేకాకుండా అమెరికా ప్రభుత్వం పళ్లు, కాయలు కొని, వాటిని ప్రభుత్వ పోషకాహార పథకాల్లో ఉపయోగించుకోవాలనుకుంటోంది.

ఈ ఆర్థిక సహాయ కార్యక్రమం సెప్టెంబర్ నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

Image copyright Getty Images

అమెరికా ప్రభుత్వం వ్యవసాయానికి మేలు కలిగించే దీర్ఘకాలిక చర్యలు చేపట్టే వరకు ఇది కేవలం ఒక స్వల్పకాలిక పరిష్కారమని అమెరికా వ్యవసాయ కార్యదర్శి సోనీ పెర్‌డ్యూ తెలిపారు.

కొంతమంది రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఈ ఆర్థిక సహాయాన్ని కొనియాడారు.

కానీ పారిశ్రామిక వర్గాలు, వ్యవసాయ రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు మాత్రం ఇది కొనితెచ్చుకున్న సమస్య అంటూ విమర్శించారు.

నెబ్రస్కా రిపబ్లికన్ సెనేటర్ బెన్ సాసే ''ఇది రైతు కాళ్లు నరికేసి, బంగారు ఊతకర్రలు ఇవ్వడం లాగుంది'' అన్నారు.

విస్కాన్సిన్ రిపబ్లికన్ సెనేటర్ రాన్ జాన్సన్, ''తమకు కావాల్సింది వ్యాపారం కానీ ఆర్థిక సాయం కాదని రైతులు ఎన్నోసార్లు చెప్పారు. మనం సృష్టించిన సమస్య పరిష్కారం కోసం మనమే డబ్బు పడేసే బదులు, రైతులు తమ ఉత్పత్తులను మంచి ధరలకు అమ్ముకునేలా చర్యలు తీసుకోవాలి'' అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)