సిరియాలో ఆత్మాహుతి దాడులు.. 215 మంది మృతి

సిరియాలో ఆత్మాహుతి దాడుల అనంతరం ఇలా..

ఫొటో సోర్స్, AFP

దక్షిణ సిరియాలో ఆత్మాహుతి దాడులు, కాల్పుల్లో 215 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ అధీనంలోని సువెడా నగరంలో బుధవారం దాడులు జరిగినట్లు అక్కడి ప్రభుత్వ ప్రసార మాధ్యమాలు వెల్లడించాయి.

ఈ దాడుల వెనుక 'ఇస్లామిక్ స్టేట్' (ఐఎస్) ఉన్నట్లు ఆరోపణలున్నాయి.

తాజాగా చనిపోయిన వారిలో 127 మంది పౌరులున్నట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వెల్లడించింది.

సువెడా తూర్పు ప్రాంతంలో ప్రభుత్వ అనుకూల బలగాలు తీవ్రవాదులతో పోరాడుతున్నాయి.

ఇటీవల కాలంలో దక్షిణ సిరియాలోనే అనేక ప్రాంతాలపై రష్యా సహకారంతో ప్రభుత్వం తిరిగి పట్టు సాధించింది. కానీ, ఇటీవల కాలంలో ప్రభుత్వ పట్టున్న ప్రాంతాల్లో ఈ స్థాయిలో దాడులు జరగడం మళ్లీ ఇదే.

20 మంది ఐఎస్ సాయుధులూ హతం

''రాజధాని డమాస్కస్‌కు దక్షిణ వైపు ఉన్న సువెడాలో వరుస ఆత్మాహుతి దాడులు జరిగాయి. దాని చుట్టుపక్కల గ్రామాలపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఇళ్లలోకి చొరబడి దొరికినవారిని దొరికినట్లు చంపేశారు'' అని బ్రిటన్‌కు చెందిన 'ది సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్' సంస్థ వెల్లడించింది.

సిరియా నైరుతి ప్రాంతంలో తిరుగుబాటుదారులకు ఇంకా పలు ప్రాంతాలపై పట్టుండడంతో అక్కడి నుంచి వారిని తరిమివేసేందుకు సిరియా సైన్యం రష్యా బలగాల మద్దతుతో ఇటీవల చర్యలు తీవ్రం చేసింది.

సువెడాకు పశ్చిమాన దారాలోని ఐఎస్ స్థావరాలపై బుధవారం కూడా రష్యా బలగాల మద్దతుతో సిరియా సైన్యం దాడులు చేసింది.

సుదీర్ఘకాలంగా సిరియాలో యుద్ధం కొనసాగుతుండడంతో ఈ ప్రాంతం నుంచి 2,70,000 మంది వలస వెళ్లిపోయారని ఐరాస చెబుతోంది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)