LIVE: పాకిస్తాన్ ఎన్నికల ఫలితాలు

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన నవాజ్ షరీఫ్ పార్టీ పీఎంఎల్-ఎన్, సైన్యం అనుకూలంగా ఉందనుకుంటున్న ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ, వారసత్వంగా రాజకీయాల్లో ప్రవేశించిన బిలావల్ భుట్టోల మధ్యే ప్రధాన పోరు అని భావిస్తున్నారు.
కొన్ని స్థానాల్లో మహిళలు తొలిసారిగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. క్వెట్టా నగరంలో ఎన్నికల సందర్భంగా జరిగిన పేలుడులో 31 మంది చనిపోగా, అక్కడక్కడా జరిగిన మరికొన్ని హింసాత్మక ఘటనల్లో కొందరు గాయపడ్డారు.
ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది.
వరల్డ్ టుడే న్యూస్, ఏఆర్‌వై న్యూస్, బిడ్ న్యూస్ చానళ్ల ప్రకారం రాత్రి 10 గంటల సమయానికి ఆధిక్యం వివరాలు...
ఎన్నికలు జరిగిన స్థానాలు - 230
పీటీఐ (ఇమ్రాన్ ఖాన్) - 94 స్థానాలు
పీఎంఎల్-ఎన్ (నవాజ్ షరీఫ్) - 53 స్థానాలు
పీపీపీ (బిలావల్ భుట్టో) - 32 స్థానాలు
ఇతరులు - 51 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మెజారిటీ - 137 సీట్లు
కీలక నాయకులు - బలాబలాలు
నవాజ్ షరీఫ్ - పీఎంఎల్-ఎన్
మూడు సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన 68 ఏళ్ల నవాజ్ షరీఫ్.. పనామా పేపర్ల ఉదంతంలో అవినీతి దర్యాప్తు కారణంగా అనర్హత వేటుపడి ఆ పదవి నుంచి వైదొలగారు. అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడటానికి ఆయన లండన్ వెళ్లారు. ఆయనకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించినప్పటికీ.. జూలై ఆరంభంలో తన కుమార్తె మరియంతో కలిసి నాటకీయంగా పాక్‌కు తిరిగివచ్చారు. వారిద్దరూ ఇప్పుడు జైలులో ఉన్నారు.
సైన్యాన్ని తాను బహిరంగంగా విమర్శించినందుకు, ఇండియాతో సంబంధాలు మెరుగుపరచుకోవాలని తాను ప్రయత్నిస్తున్నందుకు.. సైన్యం తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నిందని షరీఫ్ ఆరోపిస్తున్నారు. కానీ ఇందులో తన పాత్ర ఏదీ లేదని సైన్యం చెబుతోంది. నవాజ్ సోదరుడు షెబాజ్ షరీఫ్ పార్టీ ప్రచారానికి సారథ్యం వహించారు. ఎన్నికల్లో గెలిస్తే ప్రధాని పదవి చేపట్టటానికి ఆయన ప్రయత్నించవచ్చు.
ఇమ్రాన్ ఖాన్ - పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ)
ప్రఖ్యాత అంతర్జాతీయ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ (వయసు 65) రెండు దశాబ్దాల కిందటే పాక్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. కానీ ఆయన ఇంతవరకూ అధికారంలోకి రాలేదు. ఈసారి సైన్యం ఆయనకు అనుకూలంగా ఉందని.. ఆయన ప్రత్యర్థుల బలాన్ని దెబ్బతీయటానికి సైన్యం పనిచేస్తోందని.. చాలా మంది పరిశీలకులు నమ్ముతున్నారు.
కానీ తమ మధ్య ఎలాంటి కుమ్మక్కూ లేదన్నది ఇమ్రాన్ ఖాన్, సైన్యం మాట. అయితే.. ''ఇప్పటివరకూ మనం చూసినవారందరిలోకెల్లా ప్రస్తుత సైన్యాధిపతి జనరల్ బాజ్వా ప్రజాస్వామ్యానికి అత్యంత అనుకూలమైన మనిషి కావచ్చు'' అని ఇమ్రాన్ ఖాన్ బీబీసీతో వ్యాఖ్యానించారు. అల్-ఖైదాతో లింకున్నట్లు చెప్తున్న ఒక గ్రూపు సహా పలు వివాదాస్పద బృందాలు ఆయన పార్టీకి మద్దతిస్తున్నాయి.
బిలావల్ భుట్టో జర్దారీ - పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)
ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకున్న బిలావల్ భుట్టో జర్దారీ వయసు 29 ఏళ్లు. వారసత్వ రాజకీయాల్లో తాజా నాయకుడు. ఆయన తల్లి బేనజీర్ భుట్టో, ఆయన తాత జుల్ఫికర్ అలీ భుట్టో.. ఇద్దరూ పాక్ ప్రధానమంత్రులుగా పనిచేశారు. వారిద్దరూ హత్యకు గురయ్యారు.
బిలావల్ మొట్టమొదటిసారిగా పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. ''శాంతియుతమైన, ప్రగతిదాయకమైన, సుసంపన్నమైన, ప్రజాస్వామిక పాకిస్తాన్'' అనే తన తల్లి ఆకాంక్షలను అమలు చేయాలని తను కోరుకుంటున్నట్లు చెప్తున్నారు. ఈ పార్టీ మూడో స్థానంలో నిలుస్తుందని ఎన్నికల సర్వేలు చెప్తున్నాయి.

ఫొటో సోర్స్, EPA
ఎన్నికలంటే ప్రచారం, పోలింగ్, లెక్కింపు, గెలిచాక సంబరాలే కాదు మరెన్నో సిత్రాలూ ఉంటాయి. పాకిస్తాన్ ఎన్నికల్లోనూ ఇలాగే ఎన్నో సిత్రాలను అక్కడి మీడియా బాహ్య ప్రపంచానికి తెలియచెప్తోంది.
జెండా రంగుల్లో బ్యాలట్ పత్రాలు
పాకిస్తాన్‌లో ప్రస్తుతం పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో రెండింటికీ రెండు వేర్వేరు రంగుల్లో బ్యాలట్ పత్రాలు ఉపయోగించారు. పార్లమెంటు అభ్యర్థులకు ఓట్లేసేవారు ఆకుపచ్చ రంగు బ్యాలట్, అసెంబ్లీ అభ్యర్థులకు ఓటేయడానికి తెల్లని బ్యాలట్ పేపర్లు ఉపయోగించారు. పాకిస్తాన్ జెండాలోనూ ఆ రెండు రంగులే ఉంటాయి.
తేనెటీగల దాడి.. తుర్రుమన్న ఎలక్షన్ సిబ్బంది
పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రాంతంలో ఉన్న బహవాల్పూర్ పోలింగ్ స్టేషన్‌లో తేనెటీగలు ఎన్నికల సిబ్బందిని పరుగులు తీయించాయి. పలువురు ఓటర్లు కూడా తేనెటీగల దాడిలో గాయపడడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. తేనెటీగల కారణంగా పోలింగ్‌కు అంతరాయమేర్పడిందని అక్కడి మీడియా తెలిపింది.
ఓటర్లకు బిర్యానీ
ఉదయం పోలింగ్ మొదలుకాగానే చాలా చోట్ల అభ్యర్థులు ఓటర్లకు, కార్యకర్తలకు అల్పాహారంగా బిర్యానీ అందించారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లడానికి ముందే పెద్ద సంఖ్యలో ఓటర్లు అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లలో బిర్యానీ ఆరగించడం కనిపించిందని 'సమా' టీవీ తెలిపింది. అవామీ ముస్లింలీగ్ నేత షేక్ రషీద్ తన మద్దతుదారులు, కార్యకర్తలకు బిర్యానీ పెట్టగా.. తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ నేత అలీంఖాన్ ఓటర్లకు బిర్యానీ పంచిపెట్టారు.

ఫొటో సోర్స్, Samma tv
పాకిస్తాన్‌లో పోలింగ్ రోజున బిర్యానీ ఏర్పాట్లు
పహిల్వాన్‌లకు 'ఎక్స్‌ట్రా మీల్స్'
కరాచీలోని పోలింగ్ సిబ్బంది కోసం పులావ్ సిద్ధం చేసి వడ్డించారు. గుజ్రన్‌వాలా, పంజాబ్ ప్రాంతాల్లోనూ పోలింగ్ స్టేషన్లలో, పోలింగ్ కేంద్రాల వద్ద పులావ్, బిర్యానీలు అందుబాటులో ఉంచారు. గుజ్రన్‌వాలాలో అయితే భారీగా సిద్ధం చేశారు. ఈ ప్రాంతం పహిల్వాన్‌లు, కుస్తీ యోధులకు ప్రసిద్ధిగాంచడంతో మిగతావారి కంటే వారు ఎక్కువ తింటారన్న ఉద్దేశంతో వారి కోసం ఇలా పెద్ద మొత్తంలో వంటలు చేశారని సమా టీవీ వెల్లడించింది.
గడ్డం.. ఓటుకు అడ్డం
సింధ్ ప్రావిన్స్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఒక ఓటరును ఎన్నికల సిబ్బంది అడ్డుకున్నారు. అందుకు కారణం గుర్తింపు కార్డుల్లోని ఫొటోకు, ఆయనకు ఏమాత్రం పోలిక లేకపోవడమే. గుర్తింపు కార్డులో క్లీన్ షేవ్‌తో ఉండగా పోలింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు పెద్ద గడ్డంతో రావడంతో రెండింటికీ పోలిక కనిపించక అధికారులు ఆయన్ను ఓటేయకుండా అడ్డుకున్నారు.

ఫొటో సోర్స్, Samaa tv
దానమిచ్చేందుకు తీసుకెళ్తున్న మేకలు
ఎన్నికల కవరేజిలో ఎద్దులు, మేకలు
పాకిస్తాన్ ఎన్నికల కవరేజిలో ఎద్దులు, మేకలకూ స్థానం దక్కింది. ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్ 5 మేకలను దానమిచ్చాక కానీ ఓటయడానికి వెళ్లలేదట. దుష్టశక్తుల ప్రభావం నుంచి తప్పించుకోవడానికి, ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి తాను అలా చేసినట్లు ఆయన చెప్పారు.
హఫీజాబాద్‌లో ఓటేయడానికి వచ్చిన ఓ వ్యక్తి తనతో పాటు ఎద్దును కూడా తీసుకొచ్చాడని, కానీ, ఓటేయడానికి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేటప్పుడు దాన్ని అక్కడ కట్టేసి లోనికి వెళ్లకతప్పలేదని టీవీ ఛానళ్లు చూపించాయి.
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)